01/27/2026
తెలుగు ప్రతిభకు జాతీయ గుర్తింపు – పద్మ అవార్డు గ్రహీతలకు తానా అభినందనలు....
రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు ప్రకటించిన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు చోటు దక్కించుకోవడం మనందరికీ గర్వకారణం.
ఈ సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తరఫున, పద్మ అవార్డులు అందుకున్న తెలుగు పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము.
ఈ జాబితాలో ప్రముఖ క్యాన్సర్ వైద్యులు డా. నోరి దత్తాత్రేయుడు గారికి పద్మభూషణ్ అవార్డు, సినీ నటులు రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీ మోహన్ గారికి పద్మశ్రీ అవార్డులు లభించడం విశేషం. వీరికి తానాతో ఎంతో కాలంగా గాఢమైన అనుబంధం ఉంది.
తానా మహాసభల సందర్భంలో వీరిని గతంలోనే వివిధ అవార్డులతో సత్కరించడం మనకు తెలిసిందే. డా. నోరి దత్తాత్రేయుడు గారిని తానా కమ్యూనిటీ సర్వీస్ అవార్డుతో పాటు, 2025 తానా కాన్ఫరెన్స్‌లో “ఎక్సలెన్సీ ఇన్ మెడిసిన్” అవార్డుతో సత్కరించింది. రాజేంద్ర ప్రసాద్ గారికి 2023లో తానా ప్రెసిడెన్షియల్ అవార్డు, 2025లో నవరస పోషక చక్రవర్తి అవార్డు అందజేయగా, మురళీ మోహన్ గారికి 2023లో ఎన్టీఆర్ కల్చరల్ అవార్డు, 2025లో జీవితసాఫల్య అవార్డు అందజేసి తానా ఘనంగా సత్కరించింది.
వీరితో పాటు పద్మశ్రీ అవార్డులు అందుకున్న ఇతర విశిష్ట వ్యక్తులు - గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు), వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం & విద్య), కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్ (సైన్స్ & ఇంజినీరింగ్), పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్యం),డా. కుమారస్వామి తంగరాజ్ (సైన్స్), రామారెడ్డి మామిడి (మరణానంతరం – పశుసంవర్థక & పాడి పరిశ్రమ),గూడూరు వెంకట్రావు (వైద్యం), దీపికా రెడ్డి (నృత్యం), గడ్డమనుగు చంద్రమౌళి (సైన్స్) గార్లకు కూడా తానా అభినందనలు తెలియజేస్తోంది.
తెలుగు ప్రతిభకు జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవం, మన తెలుగు సమాజానికి మరింత గర్వాన్ని చేకూర్చింది. ఈ విశిష్ట ఘనత సాధించిన అందరు పద్మ అవార్డు గ్రహీతలకు తానా కుటుంబం తరఫున మరోసారి శుభాకాంక్షలు.
ఇట్లు,
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)