08/08/2026
*వజ్ర కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం – 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్..*
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వజ్ర కాలనీ సభ్యుల ఆహ్వానం మేరకు 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ సయ్యద్ ఇంతియాజ్ గారు కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల మరోసారి 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన శ్రీ సయ్యద్ ఇంతియాజ్ గారిని కాలనీ సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం కాలనీ వాసులు తమ ప్రాంతంలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను ఓపికగా విన్న శ్రీ సయ్యద్ ఇంతియాజ్ గారు సానుకూలంగా స్పందిస్తూ, గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కె.ఆర్. నాగరాజు గారి సహకారంతో గతంతో పోలిస్తే 14వ డివిజన్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.
అలాగే వజ్ర కాలనీలో ఉన్న అన్ని సమస్యలను గౌరవ ఎమ్మెల్యే శ్రీ కె.ఆర్. నాగరాజు గారి దృష్టికి తీసుకెళ్లి, వాటి శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానని కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ జానీ, వజ్ర కాలనీ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.