12/05/2026
ఉక్కు పాదానికి ఎల్లలు లేవు
` కట్టా కృష్ణారావు
(విశ్రాంత అధ్యాపకులు)
ప్రపంచ సాహితీ చరిత్రలో అన్ని భాషల్లోను సృజియించబడ్డ లక్షల పుస్తకాల్లో గొప్ప పుస్తకాలపై సాహతీ వేత్తలు పరిశీలన చేసిన నూరు అద్భుత పుస్తకాల జాబితాలో అమెరికా రచయిత జాక్ లండన్ రచన “ది ఐరన్ హీల” ఒకటి. మన తెలుగు భాషలో “ఉక్కుపాదం” పేరుతో అనువాదం పొంది పాఠకుల చేతుల్లోకి వచ్చి చేరింది.
జాక్ లండన్ 1908లో రాసిన ఈ నవల కాలక్షేపం కోసం రాసింది కాదు. ఆనాటి జనజీవన సమాజ స్వరూపం, దాని అడుగున దాగున్న కఠోర వాస్తవ జీవనసత్యాన్ని, జటిలమైన విషయాలను సులభ శైలిలో దృశ్యమానం చేశాడు. అతని పదునైన భాష, శక్తివంతమైన వ్యక్తీకరణ విస్మయం గొల్పోతుంది. నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వాన్ని, రణరంగ రక్తసిక్త ప్రవాహాన్ని, దరిద్రుల్ని కాల్చుకు తిన్న బలవంతుల దౌర్జన్యాన్ని, నరహంతకుల కబంధహస్తాల్లో పదఘట్టనల్లో ఎలా నలిగిపోతూ, ఎలా రక్తంతో కన్నీళ్ళతో తడిసిపోతుందో సత్యదర్శనం చేసాడు.
మానవ హస్తం శ్రమకు మÖలస్థానమని, శ్రమయే మానవ నాగరికతకు జన్మస్థానమని గ్రహించి సర్వ మానవాళి శ్రమశక్తి ఉత్పత్తితోనే జీవనం సాగిస్తుందని తెలుసుకున్నాడు. ప్రపంచ మానవ చరిత్రని జయాపజయాల్ని భూత భవిషత్ వర్తÁ్తమానాల్ని క్రిటికల్ ఆలోచనతో, క్రియేటివ్ ప్రజెంటేషన్ చేశాడు. మనిషి జీవనం దుర్లభమైపోతున్న స్థితిలో బ్రతకడానికున్న హక్కును స్థాపించడమే మానవ ధర్మం అని ఆక్రోషించాడు. ధనికలోకం పూజితావాదంతో అధికార దుర్వినియోగం, కార్మిక అణచివేత, ప్రజల్ని హింసించడం, ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ శక్తితో లాభాల కోసం సాగించే రాజకీయ దోపిడీ శక్తులు నిజస్వరూపాన్ని కళ్ళకు కట్టినట్లు దృశ్వీకరించిన రచన “ఉక్కుపాదం”.
అందంగా కనిపించే ఈ లోకం ఉపరితల ఆకారం ముసుగు తొలగిస్తే, అంతరంగ సత్యాన్వేషణ సాగిస్తే సాగుతున్న దుర్మార్గాలు, మోసాలు, ద్వేషాలు, దోపిడీలు వాటి దుర్భేధ్యరహస్యాలు తెలుసుకోవడం సాధ్యం. అందంగా కనిపిస్తున్న మానవ శరీరాన్ని తీసుకుంటే.. ఎన్నో పరీక్షలు నిర్వహిస్తే తప్ప లోపల రుగ్మతల్ని కనిపెట్టలేం. జబ్బు ఏ రూపంలో, ఎక్కడ ఉందో తెలిస్తేనే కదా దానికి చికిత్స సాధ్యమవుతుంది. ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని రక్షించుకోగలిగేది.
ఉక్కుపాదం ఒక ప్రాంతానికో, దేశానికో పరిమితమైందికాదు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వర్తించే విశ్వజనీన సత్యాన్వేషణే ఈ రచన. జనాభా విస్పోటనంతో అధిక ఆహార ధాన్యాల దిగుబడి తప్పనిసరైన మాట వాస్తవమే కానీ దీనికై సృష్టించే రసాయనక ఎరువులు, క్రిమిసంహారక మందులు, మార్కెట్ మతలబులు, మాయాజాలంతో పై మెరుగులు అద్దె విష పదార్థాల స్లోపాయిజన్లు, వ్యాధి కారకాల పళ్ళు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, బియ్యం, గోధుమ అన్ని మానవ ఆరోగ్యాన్ని, భూసారాన్ని నాశనం చేస్తున్నాయి. భారతదేశంలో క్రిమిసంహారక మందులు 63 వేల మెట్రిక్ టన్నులు, ఫెర్టిలైజర్ 500 లక్షల మెట్రిక్ టన్నులు ఉపయోగిస్తుంటే.. ప్రపంచంలో క్రిమిసంహారక మందులు 37 లక్షల మెట్రిక్ టన్నులు, ఫెర్టిలైజర్స్ కోటి 90 లక్షల మెట్రిక్ టన్నులు ఉపయోగిస్తున్నారు. వీటి వెనుక లక్షల కోట్ల లాభార్జనే ధేయంగా ఎరువుల రసాయనాల ఉత్పత్తిదారులు ఉన్నారనే సత్యం మనకు తెలియదుగా..! ప్రాణుల జీవనంలో జలం పాత్ర విస్మరించలేనిది. ప్రవహిస్తున్న కాలువలు, నదులు, చెరువులన్నింటా ఫ్యాక్టరీలు విడిచి పెట్టే వ్యర్ధాలన్నీ ఈ ప్రవాహాల్లోకి తోసేస్తున్నారు. నీరంతా కలుషితం చేయబడుతుంది. స్థలాల్లోకి, పొలాల్లోకి రసాయనాలు కొట్టుకొస్తున్నాయి. తాగునీరు ప్రాణాంతకమైన జబ్బులకు కారణం అవుతుంది. వీటి వెనుకున్న వ్యాపారవర్గ లాభాలు మనకు కనిపించవు. ప్రజల ప్రాణాలు హరించే దుర్మార్గం తెలిస్తే భయమేస్తుంది. మరి స్వచ్ఛమైన గాలైన పీల్చి జీవించే అదృష్టం ఉందా?. ఉహు.. ప్రతిరోజు పరిశ్రమలు, వాహనాలు, ఏసీలు, ఫ్రిజ్ లు విడిచిపెట్టే విషవాయువులతో వాతావరణ కాలుష్యం ఏర్పడి కోట్ల మంది జబ్బుల బారిన పడుతున్నారు. మరి స్వచ్ఛమైన గాలి పీల్చి బతకడమెలా? సాంస్కృతిక కాలుష్యానికి కారణాలు చెప్పనక్కరలేదు. ప్రపంచ వ్యాప్తంగా లాభాలు గడించడానికి వారి ఉత్పత్తులు వినియోగం కావడానికి, వినియోగదారుల్ని మెస్మరైజ్ చేయడానికి వ్యాపార ప్రకటనలు, ప్రచారాలు, పత్రికలు,రేడియో, టీవీ, సినిమా, సీరియల్స్, కంప్యూటర్ నెట్వర్క్, సెల్ఫోన్లు ద్వారా ప్రజల మెదళ్లను చేజిక్కించి లక్షల కోట్లు కొల్లగొట్టే వ్యాపార సామ్రాజ్యాలు రాజ్యమేలుతున్నాయి.
పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు ప్రజలకు నిజాలు తెలియకుండా చేయడానికి ప్రచండమైన, శక్తివంతమైన ప్రసార సాధనాలు పత్రికలను, టీవీ చానల్స్, సెల్ ఫోన్స్ శక్తితో బుద్ధిని చిత్తు చేసే మత్తు పానీయాల ఎత్తును కొనసాగిస్తుంది. మతాధిపతులను, విశ్వవిద్యాలయాలను, దేవాలయాల్ని, దేవుళ్లను వాళ్ళ ఆధీనంలో ఉంచుకుని కట్టు కథలతో ప్రజల మెదళ్లు ఏలడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. శ్రామిక జనం తెలివిమీరితే, సంఘటితమవుతుంటే అణచివేతకు చట్టాలు సృష్టిస్తారు. తమను కాపాడుకోవడానికి పోలీస్ వ్యవస్థను అవసరమైతే సైనిక శక్తిని వినియోగిస్తారు. అతిక్రూరంగా మృత్యువిన్యాసాలు సృష్టించి రక్తపుటేరుల్లో ముంచెత్తుతారు. ఈ కరాళనృత్యం, నిర్ధాక్షణ్య పథగట్టనల్ని ఎలా సాగిస్తుందో రచయిత చరిత్రలో అనేక సంఘటనల ఆధారంగా ఊహాత్మకంగా తన మేదస్సును జోడించి భవిష్యత్తు ప్రపంచ గమనాన్ని ఉక్కుపాదం నవలలో కళ్లకు కట్టినట్టు దృశ్యమానం చేశాడు.
అమెరికా రచయిత జాక్ లండన్ తన అద్భుత సృష్టి ఉక్కుపాదం నవల. ఈ నవలలోని కథానాయకుడు ఎర్నెస్ట్ ఎవర్ హార్డ్ ఒక శక్తివంతమైన పాత్ర. గొప్ప మేధావి మానవతావాది, మÖర్తీభవించిన సమరశీలి. అతని అనంతమైన విజ్ఞాన ఆర్జనతో, ప్రజ్ఞా పాఠవాలతో సమాజంలోని అసమానతలకు కారణాల్ని బహిర్గతం చేశాడు. ఎవిస్ సంపన్న వర్గానికి చెందిన ఒక సాధారణ మహిళ. ఎర్నెస్ట్ పరిచయంతో సమాజంలో జరుగుతున్న మోసాన్ని, దోపిడీని అర్థం చేసుకుంటుంది. ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వం ఎలా విజృంభిస్తుందో అర్థం చేసుకుంటుంది. ఎర్నెస్ట్ గొప్పతనం అవగతమై ప్రేమిస్తుంది. అతన్ని వివాహమాడి అతనితో కలిసి సమాజ హితం కోసం పాటుపడుతుంది. సంపూర్ణ మానవతావాదిగా మారుతుంది. ఎన్నికలు, రాజ్యాంగం, చట్టాలు, సమస్త వ్యవహారాలు వాటి వెనుక ఉన్న ధనిక వర్గం స్వార్ధాన్ని అర్థం చేసుకుంటుంది. తన అనుభవాలను రాసుకున్న డైరీనే ఈ నవల. జాక్ లండన్ ఉక్కుపాదం నవల దేశ కాలాలకు అతీతమైంది. ఏ వర్గసమాజంలోనైనా దోపిడీ విశ్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి, పీడిత జనం జాగృతం కావడానికి, విస్మయం కొలిపే దోపిడీ రహస్య కోటల్ని బద్దలుకొట్టాడు. మన చుట్టూ జరుగుతున్న వాస్తవ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉక్కుపాదం ఎంతో ఉపకరిస్తుంది. ఇది చదివి అర్థం చేసుకుంటే మన అవగాహనాజ్ఞానం పదింతలు పెరుగుతుంది. ఇది నా అనుభవం. నాకిష్టమైన పుస్తకం ఇది. మీరు ఒకసారి చదవడానికి ప్రయత్నించండి.
చైతన్య మానవి, ఏపిల్ర్ 2026