24/10/2024
*కోమల గాత్రం - కోకిల కంఠం – లావణ్య గానం*
చెన్నైకి చెందిన వర్ధమాన గాయని, చిన్న వయస్సులోనే విఖ్యాతి గడించిన శ్రీమతి లావణ్య సుందరరామన్ శ్రీ పురందర దాస కీర్తనలను ఎంతో రమ్యంగా పాడి శ్రోతలను మెప్పించారు. ఈమె పాడుతుంటే, సంగీత సామ్రాజ్ఞి డా. డి.కే. పట్టమ్మాళ్ గుర్తుకువచ్చారు. మరోవైపు, ప్రఖ్యాత గాయకురాలు, పట్టమ్మాళ్ గారి మనవరాలు శ్రీమతి నిత్యశ్రీ మహదేవన్ స్పురించారు. డి.కే. పట్టమ్మాళ్ గారి ముని మనవరాలు, శిష్యురాలు అయిన శ్రీమతి లావణ్యగారు వారిద్దరి బాణీలను అలవోకగా పట్టుకోగలిగారు.
తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 168 గంటల నిర్విరామ సంగీత సంతర్పణ .. సప్తగిరి సంగీత సప్తాహంలో భాగంగా 2024, జూన్ 19వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి 6 గంటలవరకూ శ్రీ పురందర దాసులవారి కీర్తనలతో అద్భుతమైన శుద్ధ శాస్త్రీయ సంగీత విందును శ్రీమతి లావణ్య గారు అందించారు. వీరికి వయొలిన్ పై డా. కొమాండూరి వేంకట కృష్ణ గారు, మృదంగం పై శ్రీ ఏ. ఎస్. శంకర్ గారు, ఘటం పై శ్రీ బుద్ధవరపు మారుతీ రఘురాం గారు తమవంతు సహకారం అందించారు.
శ్రీమతి లావణ్య గారు శరణు సిద్ధి వినాయకా అంటూ సౌరాష్ట్ర రాగంలో మిశ్రచాపు తాళంలో ఎంతో గంభీరంగా కచేరీని ప్రారంభించారు. తరువాత అభేరి రాగాలాపనలో పై దైవతాన్ని స్పృశించి, తన ప్రతిభను ప్రదర్శించి, ఎంత చెలువగే మగలను అనే కీర్తనను ఆదితాళంలో ఎంతో భావయుక్తంగా పాడారు. కన్నడ కీర్తన అయినప్పటికీ, భాష తెలియనప్పటికీ శ్రోతలు ఎంతో ఆనందించారు. ఆమె గొంతులో ఈ కీర్తన అలా వొదిగిపోయింది. కొమాండూరి వారు ఈ కీర్తనలో సౌకుమార్యాన్ని ఇనుమడింపజేస్తూ సహకారాన్ని అందించారు. శంకర్ గారు, మారుతీ గారు బాగానే అనుసరించారు. ఔచిత్యం ఏమిటంటే, అన్నీ రక్తి రాగాలనే ఎంచుకోవడం.
వసంత రాగంలో ఖండ గతిలో రామ రామ అంటూ కొంచెం చురుకైన కీర్తన అందుకుని శ్రోతలను మంత్ర ముగ్డులను చేశారు. ఆ తరువాత, ప్రధానాంశంగా చారుకేశి రాగాన్ని ఎంతో విస్తారంగా ఆలపించి, ఎన్నెన్నో స్పురిత గమకాలను, వివిధ స్వర స్థాయి రూపాలను గానంచేసి, తన అకుంఠిత సాధానా పాటవాన్ని శ్రోతలకు చూపించారు. ఆమె కంఠస్వరంలో ఏదో తెలియని మెస్మరిజం ఉంది. హాలంతా మారుమ్రోగిపోయింది. సామాన్య వల్ల అనే కీర్తనను ఆదితాళంలో ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. ఇందులో చేసిన స్వరకల్పనలో తన మనోధర్మాన్ని ఆవిష్కరిస్తూనే, సహ కళాకారుల నుండీ ప్రతిభను వెలికితీశారు. రాగాలాపనలోనూ, స్వరకల్పనలోనూ డా. కృష్ణ గారు తన కళా విశ్వరూపాన్ని చూపించారు. శ్రీ శంకర్, శ్రీ మారుతీ గార్లు రెట్టించిన ఉత్సాహంతో వాయించి కీర్తనకు వన్నె తెచ్చారు. తనియావర్తనం చాలా సింపుల్ గా తేల్చేసినప్పటికీ ఆకట్టుకుంది. చివరిగా వాసంతి రాగంలో ఎంతో ఆర్తిగా అలపిస్తుంటే, నాలాంటి వారికి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. బంధ మేలే రంగా బంధ మేలే అంటూ ఖండ గతిలో ఎంత ఆర్తిగా పాడారో మాటల్లో చెప్పలేము. కృష్ణా.. అంటూ పై పంచమం వరకూ వెళ్ళి ఆలపిస్తుంటే, ఆమె ఒక మీరాలా అగుపించారు. ఒక గోపీగా, ఒక రాధగా అనిపించారు. అలా పాడితే కృష్ణుడు రాక ఏమవుతాడు? వచ్చి తీరుతాడు. కానీ ప్రేక్షకులే రాలేకపోయారు.
చివరిగా, బసంత్ రాగంలో నరజన్మ బంధానే కృష్ణా ఎనబారదే అంటూ సంత్ హరిదాస్ గిరి రచనతో కచేరీ పరిసమాప్తం చేశారు.
దురదృష్టం ఏమిటంటే, ఈ కచేరీని వినలేకపోవడం. స్థానికంగా ఉన్న కళాకారులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోలేకపోయారు. తితిదే నిర్వహణలో సంగీత కళాశాల, అన్నమాచార్య ప్రొజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వంటి సంస్థల్లో వందలమంది కళాకారులు ఉన్నారు. ఆయా సంస్థల అధిపతులకు స్వయంగా ఆహ్వాన పత్రాలు అందించినప్పటికీ ఏ విధమైన స్పందనా లేకపోవడం చాలా విచారకరం. వీటిల్లో సేవలందిస్తున్న కళాకారుల్లో కూడా చైతన్యం లేకపోవడం, మనకెందుకులే అనుకోవడం కొంత నిరుత్సాహ పరచిన మాట నిజం. ఇంతటి మహోన్నత కార్యక్రమంలో తమ శిష్యులను తప్పనిసరిగా పాల్గొనేటట్లు చేయవలసిన భాధ్యత సంగీత గురువులపై ఎంతో ఉంది. కానీ గురువులే రాలేదు. ఇంకా శిష్యులేం వస్తారు? ఇంత బ్రహ్మాండమైన కచేరీకి కనీసం 10 మంది కూడా లేనప్పటికీ, ఏమాత్రం నిరాశ చెందకూడా, తన గాత్రాన్ని భగవంతునికి అర్పిస్తున్నట్లుగా ఎంతో హృద్యంగా గానం చేశారు. అయితే, వీరి కచేరీని అప్యర సరస్వతీ స్వరూపులు అవసరాల కన్యాకుమారి గారు, పత్రి సతీష్ కుమార్ గారు విని ఆమెను మెచ్చుకుని, వేదికమీదకు వెళ్ళి, ఆశీర్వదించారు. అదిచాలు ఆమెకు.
ఇంతటి అద్వితీయమైన కచేరీని వినడం మీరు ఏమాత్రం విస్మరించకండి. విన్న తరువాత మీరే చెప్తారు కామెంట్ల రూపంలో. అదే విధంగా మరికొంత మందికీ పరిచయం చేయండి. శాస్త్రీయ సంగీత సౌరభాన్ని మీ సాధ్యమైనంత ఎక్కువ మందికి చవి చూపించండి. 168 గంటల నిర్విరామ సంగీత యజ్ఞానికి ఫలితం పదిమందికీ అందించడంలో మీ వంతు సహకారం ఇవ్వండి.
ఈ క్రింద లింకు నొక్కండి.
On19.06.2024, DASA SAHITYA SOURABHAM -Mrs. LAVANYA SUNDARA RAMAN, CHENNAI, Vocal concert went brilliantly in the Saptagiri Sangeetha Saptaham held in Tiru...