26/12/2019
శుభోదయం. నేటి సాక్షి దినపత్రిక లో ప్రచురణ.
పుస్తకం (జ్యోతిర్మయం) -- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
అక్షర రూపం దాల్చిన గురువు, విజ్ఞాన వికాసాల తరువు పుస్తకం. అజ్ఞానాంధకారాన్ని తొలగించి, జ్ఞానజ్యోతులు వెలిగించి ప్రయోజకులను చేసే ఉత్తమ సాధనం.
‘పువ్వులాగే స్వలాభాపేక్ష లేకుండా పరిమళాలు వెదజల్లే సద్గుణం పుస్తకానికుందని’ మహాకవి కాళిదాసు, 'కావ్యామృత రసాస్వాదనం, సజ్జన సాంగత్యం మినహా సంసార విష వృక్షానికి మధుర ఫలాలు లేవన్న’ విష్ణుశర్మ మాటలు మంచి గ్రంథాల పఠన ప్రాముఖ్యతను విశదపరుస్తూ వివేకాన్ని మేల్కొలుతాయి.
ఉన్నతమైన సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు, విధివిధానాలను అందించింది పురాతన గ్రంథాలేనని, నేటి విజ్ఞాన వృక్షానికి వేదకాలంలోనే బీజం అంకురించిందని, ఋషులు, ద్రష్టలు, మునులు, కవుల మేథో శ్రమ ఫలాలైన వేదాలు(భగవంతుని ద్వారా తెలుపబడగా వినబడినవి కనుక శ్రుతులు), ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, గ్రంథాల ఫలితమే హిందూ మత వ్యాప్తికి, ఘనకీర్తికి కారణభూతమన్న పెద్దల మాటలు ఆమోదయోగ్యం.
పురాణాలను, భారత, భాగవతాలను వేదవ్యాసుడు, రామాయణాన్ని వాల్మీకి, అనేక గ్రంథాలను శంకరాచార్యుడు వంటి మహాత్ములు రచించి లోకోపకారం చేశారు. ‘తింటే గారెలే తినాలని, వింటే భారతం వినాలన్నంత’ ప్రాచుర్యం పొందిన ఇతిహాసాల్లోని అంశాలు సమాజంలోని జీవులకు, జీవితాలకు ప్రతిబింబాలు. జీవించకూడని విధానాలకు ఉదాహరణగా దుర్యోధనుడు, ఉత్తమమైన ఆదర్శాలకు నిదర్శనంగా శ్రీరాముడు, ప్రేమ, సహాయ తత్వాల నిలయంగా కృష్ణుడి కథలు దారిదీపాలై ఆదర్శ జీవనానికి మార్గదర్శనం చేసాయి.
''పుస్తకాల నేస్తుడికి ఒంటరితనం లేదని, అక్షర చెలిమిని మించిన కలిమి సృష్టిలో లేదన్న” అక్బర్ భావనలు, “పుస్తకం నోరు తెరవని ఉపన్యాసకుడు, మౌనం వహించిన కవి, ఒంటరితనం పోగొట్టే స్నేహితుడు, మరోలోకానికి తీసుకుపోయే మాంత్రికుడన్న’ అనుభవజ్ఞుల వాక్కులు గ్రంథ పఠన ప్రయోజనాలను విశదపరచగా, ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, సంస్కారం, విలువలు పెంపొందించే ఉత్తమ సాధనాలయ్యాయని మహనీయుల జీవితాలు నిరూపించాయి.
అంతర్జాలం మాయలో చిక్కి గ్రంథ పఠనానికి దూరమైన నేటితరం ఒడిదుడుకులు, ఒత్తిడులను ఎదుర్కొలేక చిన్న కష్టానికే ఆత్మహత్యలను శరణు కోరడం బాధాకరం. ఒత్తిడిని, కుంగుబాటుని దూరం చేయగల సంజీవని సాహిత్య పఠనమన్న సత్యాన్ని గుర్తించి, ఉత్తమ గ్రంథాల స్పూర్తితో ఒత్తిడిని అధిగమించి ఉన్నతులుగా నిలిచేందుకు బాల్యం నుండే పుస్తక పఠనం అలవాటు చేయాలి.
“పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతః” అన్న హెచ్చరికను జ్ఞప్తి చేసుకుంటూ ఉత్తమ గ్రంథాలను సంపదలా భావించి అపురూపంగా భద్రపరచాలి. ప్రతి జన్మకు సార్ధకత కలగాలన్న గీతాకారుడి బోధనలు నిజం చేసే దిశగా అడుగులు వేస్తూ పుస్తకం హస్తభూషణమయ్యే మంచి రోజులు రప్పించాలి.
----**------