30/06/2022
2021 జూలై 1 న శ్రీ వర్మ గారు @ 75 సందర్భంగా
సీనియర్ పాత్రికేయులు
డి సోమసుందర్ గారు రాసిన కొన్ని జ్ఞాపకాలు
————/—
మార్క్సిజం స్ఫూర్తి! గ్రామ్సీ దీప్తి!
సృజనాత్మక కృషి సాగిస్తున్న
వర్మగారి జన్మదినం జూలై 1.
----------------------------------------------
డి.వి.వి.ఎస్.వర్మ గారి పేరు ఒక మార్క్సిస్టు మేధావిగా రాష్ట్రంలోని వామపక్ష శ్రేణులకు చిరపరిచితమైనదే!
ఆయన రచనలు, విశ్లేషణలు, కొత్త దైన లోచూపుతో చారిత్రక, సామాజిక, రాజకీయ,ఆర్థిక అంశాలను అధ్యయనం చేయడానికి మనకు దారి చూపుతాయి!
ఉద్యమాలలో విశాల ప్రజానీకం విస్తృతంగా పెద్ద ఎత్తున పాల్గొనడానికి వీలుగా వర్మగారు రూపొందించే నినాదాలు,పోరాట రూపాలు, వైవిధ్యంగానూ, సరళంగాను, వినూత్నంగానూ అత్యంత ప్రభావవంతం గానూ ఉంటాయి!
భారతకమ్యూనిస్టుపార్టీలో, లోక్ సత్తా ఉద్యమసంస్థలో, లోక్ సత్తా పార్టీలో వర్మగారు ఎంతో ముందుచూపుతో, నైపుణ్యంతో చూపిన కొత్తదారి ఆయా ఉద్యమాల్లో వేలాదిమంది కార్యకర్తల్ని అమితంగా ప్రభావితం చేసింది!
రాజకీయ,సైద్ధాంతిక గురుకులాలపైనా, గురుపీఠాలపైనా వర్మగారికి ఏమాత్రం నమ్మకంలేదు!
అందుకే ఆయన పీఠాధిపతి కాలేదు!
అయితే వర్మగారి కుదురునుండి తయారైన సామాజిక కార్యకర్తల బలగం ఒకటి తెలుగు రాష్ట్రాలలో ఉంది!
విభిన్న జీవనరంగాలలో వారంతా తమదైన కీలక భూమిక పోషిస్తున్నారు!
వర్మగారి ఆలోచనలలో ని కొత్త దృష్టిని వారు వ్యాప్తిచేస్తున్నారు!
క్రియాశీల రాజకీయాలలో లేకున్నా వర్మగారి ఆలోచనలు మార్క్సిస్టు సిద్ధాంత ఆచరణ చుట్టూనే ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటాయి!
అధ్యయనాన్ని ఆచరణకు అన్వయింప చేయడంపైనే ఆయన దృష్టిసారించి మేధోకృషి సాగిస్తూ ఉంటారు!
జూలై 1 వ తేదీ ఆయన పుట్టిన రోజు!
వర్మ గారితో ఓ నాలుగున్నర దశాబ్దాలకు పైబడిన అనుబంధం నాది!
ఆ చనువుతోనే వారి కృషి గురించి కొన్ని సంగతులు చెప్పడానికే ఈ పోస్ట్!
----------------------------------------------
వర్మ @75.
**********************
2021 జూలై 1 వ తేదీనాటికి 75 ఏళ్లు నిండుతున్నాయి!
ఆయన 76 వ ఏట ప్రవేశిస్తున్నారు!
వర్మగారి పూర్తిపేరు దాట్ల వీర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వర్మ!
పశ్చిమగోదావరి జిల్లా
జంగారెడ్డిగూడెం శివారు రామచంద్రపురంలో 1946 జూలై 1 వ తేదీన జన్మించారు!
తండ్రి దాట్ల సత్యనారాయణరాజు గారు!
తల్లి సూర్యనారాయణమ్మ గారు!
వర్మగారికి ఒక సోదరుడు, ఇద్దరు సోదరీమణులు!
తండ్రి ఉపాధ్యాయుడు!
వర్మగారు జంగారెడ్డిగూడెంలో పాఠశాలవిద్య పూర్తిచేశారు!
హైస్కూల్లోనే ఏ.ఐ.ఎస్.ఎఫ్. తోనూ కమ్యూనిస్టుపార్టీతోనూ ఆయనకు పరిచయం ఏర్పడింది!
అప్పటినుండీ పార్టీయే ఆయనకు సర్వస్వం అయిపోయింది!
మూడున్నర దశాబ్దాలపాటు పార్టీతో ఆయన జీవితం పెనవేసుకు పోయింది!
ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీలో బి.ఎస్సీ పూర్తిచేశారు!
ఆంధ్ర యూనివర్సిటీలో లా కోర్సులో చేరారు!
విద్యార్థిఉద్యమ అవసరాలకోసం మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పారు!
విశాఖఉక్కు ఉద్యమ నేపథ్యంలో 1966 లో గుంటూరులో జరిగిన
ఏ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర మహాసభల్లో సురవరం సుధాకరరెడ్డి గారు రాష్ట్రఅధ్యక్షుడుగా, వర్మగారు ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యారు!
విశాఖఉక్కు ఆంధ్రులహక్కు పేరుతో జరిగిన ఉద్యమంలో వర్మగారు కీలక భూమిక పోషించారు!
ఆ తర్వాత అఖిల భారత యువజన సమాఖ్య ప.గో. జిల్లా అధ్యక్షుడుగా,రాష్ట్ర ఉపాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు!
1964 లో భారత కమ్యూనిస్టుపార్టీ లో చేరిన వర్మగారు 1971 నాటికి జిల్లా కార్యవర్గసభ్యుడు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అయ్యారు!
అప్పట్లో బల్గేరియా రాజధాని సోఫియాలో జరిగిన ప్రపంచ యువజనోత్సవాలకు ప్రతినిధిగా హాజరయ్యారు!
సోవియట్ యూనియన్ లో సోషలిస్టు సిద్ధాంత, ఆచరణలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయడానికి పదినెలలపాటు మాస్కోలో ఉండి వచ్చారు!
1971 నుండి 9 సంవత్సరాలు సి.పి.ఐ.జిల్లా సహాయకార్యదర్శిగా ఉన్నారు!
1980 నాటికి జిల్లా కార్యదర్శిగాఎన్నికయ్యారు!
రాష్ట్ర కమిటీ సభ్యునిగా 1996 వరకూ ఉన్నారు!
రెండుసార్లు మించి ఏ బాధ్యతకూ ఎన్నిక కారాదన్న స్వీయనిబంధన తోనే పార్టీ కార్యదర్శిగా ఆయన వైదొలిగారు!
1989 లో పార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు!
అయితే పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం ఆయన్ని రాష్ట్ర కమిటీలో కొనసాగించింది!
1996 లో వర్మగారు పార్టీలో తన సభ్యత్వాన్ని పునరుద్ధరించు కోకుండా స్వచ్ఛందంగా వదులుకున్నారు!
ఆ విషయంలో కూడా వర్మగారు తన ప్రత్యేకతను నిలుపుకున్నారు!
ఆయన పార్టీకి రాజీనామా చేయలేదు!
పార్టీ ఆయన్ని బహిష్కరించలేదు!
పార్టీకి వ్యతిరేకంగా గానీ, నేతలకు వ్యతిరేకంగా గానీ ఆయన ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు!
సభ్యత్వం వదులుకున్నారు. అంతే!
----------------------------------------------
వినూత్నంగా ప్రజాఉద్యమాలు!
****************************
వర్మగారి హయాంలో జరిగిన పార్టీ ఉద్యమాలు, పోరాటాలు, సమీకరణలు అందరికీ తెలిసినవే!
వాటి జోలికి పోకుండా వర్మ గారి ప్రత్యేకతలను వివరించే కొన్ని ఉద్యమాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను!
1980 - 90 దశకంలో ఈ ఉద్యమాలు జరిగాయి!
గ్రామీణప్రజలకు సామూహిక మరుగుదొడ్లు సైతం లేనిరోజులవి!
పశ్చిమగోదావరి జిల్లాలో అప్పట్లోనే
ఇంటింటికీ మరుగుదొడ్డి నినాదాన్ని రూపొందించి ఉద్యమం నిర్వహించిన ఘనత వర్మ గారికి దక్కుతుంది!
దాన్ని ఒకసమస్యగా గుర్తించడానికి సిద్ధంగా లేని ఆరోజుల్లో
జిల్లాలో పెద్దఎత్తున పాదయాత్రలు నిర్వహించి ప్రజల్లో సమస్యపై అవగాహన కల్పించారు!
అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి సమస్య తీవ్రతను వివరించి పరిష్కారానికి చర్యలు తీసుకునేటట్లు చూసారు!
పథకానికి బ్లూ ప్రింట్ ఆయనే తయారు చేశారు!
నిధుల సమీకరణకు మార్గం కూడా ఆయనే చూపారు!
ఫలితంగా తొలివిడతగా జిల్లాలో 40 వేల మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది!
ఆ తర్వాత జిల్లాలో సుమారు రెండున్నరలక్షల మరుగుదొడ్ల నిర్మాణానికి ఈ ఉద్యమమే దారి చూపింది!
మూడున్నరదశాబ్దాల క్రితం వర్మ గారు చేపట్టిన నినాదాన్నే
ఇప్పుడు అందరూ స్వచ్చభారత్ అంటున్నారు!
పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన సారథ్యంలో వ్యవసాయకార్మికులు నిర్వహించిన ఉద్యమం ఫలితంగా , చెట్టుపట్టా, వనసంరక్షణసమితి వంటి జాతీయస్థాయి పథకాల రూపకల్పన జరిగింది!
అప్పట్లో జిల్లా అటవీశాఖ కార్యాలయం ఎదుట "నిరవధిక ధర్నా" పొరాట రూపాన్ని వర్మగారే రూపొందించారు!
వేలాదిమంది కూలీలు కార్యాలయ ఆవరణలో మకాంచేసి అక్కడే వంటలుచేసుకుని, అక్కడే స్నాన పానాలు చేసి నిద్రించారు!
ప్రతిరోజూ,బియ్యం, పాలు, కూరగాయలు వచ్చిపడ్డాయి!
(ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల పోరాటం గుర్తుకు వస్తోంది కదా!)
మూడురోజుల పాటు ఉద్యమం ఉధృతంగా జరిగింది!
ఎన్నిరోజులైనా పోరాటం అదేవిధంగా కొనసాగుతుందన్న గట్టిసంకేతం వెళ్ళడంతో నాటి ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపింది!
అటవీ సంరక్షణకు పరిసర ప్రాంతాల ప్రజల జీవనోపాధిని ముడిపెట్టి సమస్యకు చక్కని
పరిష్కారంచూపింది వర్మగారే!
పార్టీలకు అతీతంగా రైతుఉద్యమం ఉండాలన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి అనే సంస్థను వర్మగారి ఆలోచన మేరకే ఏర్పాటుచేశారు!
రైతాంగసమస్యలపై ఆసంస్థ పలు పోరాటాలు చేసింది!
ఆపోరాటాలు కూడా వినూత్న పద్ధతిలో కొనసాగాయి!
గ్రామీణబందు, గ్రామీణ ప్రాంతాల దిగ్బంధనం, వంటి పోరాట రూపాలను వర్మ గారు రూపొందించారు!
గ్రామీణప్రాంతాలలో ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది!
జాతీయ,రాష్ట్ర రహదారులపై
రెండెడ్లబళ్ళు, ట్రాక్టర్లతో గ్రామీణులు చేసిన దిగ్బంధనాలు, రాస్తారోకోలు అప్పటికి కొత్తవి!
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రైతుఉద్యమ పర్యవసానంగానే అనంతరకాలంలో ఉచితవిద్యుత్ పథకం రూపకల్పనకు దారితీసింది!
----------------------------------------------
సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమం!
****************************
జిల్లాలో 1989 - 95 మధ్య జరిగిన సంపూర్ణ అక్షరాస్యత, నిరంతర విద్య, బాలకార్మిక వికాససమితి వంటి కార్యక్రమాలు విజయవంతంకావడంలో వర్మగారి కృషి కీలకమైనది!
స్వాతంత్య్రానంతరం జిల్లాలో సుమారు 50 వేలమంది కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి పాల్గొన్న ఏకైకఉద్యమం అది!
వారంతా ఆర్నెల్లపాటు సమయాన్నిచ్చి వయోజనులకు అక్షరాలు నేర్పించడం చిన్న విషయంకాదు!
మహిళలు,యువకులు, విద్యార్ధులు, అంత పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఉద్యమం సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమమే అని చెప్పాలి!
అది ఒక ప్రభుత్వ పథకంగా కాకుండా ప్రజల భాగస్వామ్యాన్ని సమీకరించి ప్రజాఉద్యమంగా తయారుచేయడంలో వర్మగారి వ్యూహం ప్రధానపాత్ర పోషించింది!
వాలంటీర్ల శిక్షణ, అభ్యాసకుల శిక్షణకోసం వర్మగారు పలు కరదీపికలు రూపొందించారు!
సులభవాచకాలు రాశారు!
అక్షరాస్యతా ఉద్యమం కోసం, నిరంతర విద్య కోసం వర్మగారు
సుమారు 15 బుక్ లెట్స్ ను రచించారు!
అక్షరాస్యతా ఉద్యమంలో పశ్చిమగోదావరి జిల్లా జాతీయస్థాయిలో ప్రథమస్థానం పొందింది!
తణుకు పట్టణం రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం సాధించింది!
జిల్లాఅధికారులు ,పలుఅవార్డులు పొందారు!
అక్షరాస్యతా ఉద్యమం నుండి స్వయం సహాయక సంఘాలు ఆవిర్భవించాయి!
సారా వ్యతిరేక పోరాటం వచ్చింది!
పొదుపు, పిల్లల బడినమోదు పెరిగాయి!
పేదల సామాజిక స్థాయి పెరగడానికి ఇవన్నీ తోడ్పడ్డాయి!
ఈ విజయాల వెనుక వర్మగారి ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలూ,ఆయన ప్రత్యక్ష నాయకత్వమూ ఉన్నాయని అప్పట్లోనే జిల్లాఅధికారులంతా చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకోవాలి!
----------------------------------------------
లోక్ సత్తా లో...!
*******************
1999 సంవత్సరంలో వర్మగారు లోక్ సత్తా ఉద్యమసంస్థలో చేరారు!
సంస్థకు రాష్ట్రప్రధానకార్యదర్శిగా, తర్వాత రాష్ట్ర సమన్వయకర్తగా ఎన్నికయ్యారు!
అప్పటివరకూ మేధావుల థింక్ టాంక్ గానూ, అడ్వకసీగ్రూప్ గానూ పనిచేస్తున్న లోక్ సత్తాను ఉద్యమ సంస్థగా, పోరాడేశక్తిగా రూపొందించినవారు వర్మగారే!
294 నియోజకవర్గాల్లో లోక్ సత్తాకు సంస్థగత నిర్మాణం ఏర్పాటు చేసిందీ వర్మగారే!
స్థానిక ప్రభుత్వాల సాధికారిత కోసం, సమాచారహక్కు చట్టం సాధనకోసం, ఎన్నికల సంస్కరణల కోసం, లోక్ సత్తా చేసినకృషిలో వర్మగారు కీలకపాత్ర పోషించారు!
కోటిసంతకాల సేకరణ, ప్రజా బ్యాలెట్, వంటి పోరాటరూపాలను ఆయన రూపొందించారు!
2006 లో లోక్ సత్తా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలన్న డా.జయప్రకాష్ నారాయణ్ ఆలోచనను వర్మగారు పెద్దగా ఇష్టపడలేదు!
అడ్వకసీ గ్రూప్ ను యాక్షన్ గ్రూప్ గా మార్చి ఒక ప్రెషర్ గ్రూప్ గా కొనసాగించి పరిపాలనా ఎన్నికల సంస్కరణల కోసం ప్రయత్నం చేయాలన్నది వర్మగారి ఆలోచన!
రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేదని కొత్తపార్టీ అవసరంలేదని వర్మగారు అభిప్రాయ పడ్డారు!
అయితే జేపిగారి పట్టుదలతో పార్టీ ఏర్పడింది!
జేపీ గారి అభ్యర్థన మేరకు దానికి ప్రధానకార్యదర్శి అయ్యారు!
తర్వాత అధ్యక్షుడు అయ్యారు!
అయితే 2014 తర్వాత వర్మగారు లోక్ సత్తా పార్టీకి దూరం అయ్యారు!
లోక్ సత్తా నిర్వహించిన అనేక ప్రజా ఉద్యమాల వెనుక వర్మ గారి ఆలోచనలు, వ్యూహాలు ఉన్నాయని అందరికీ తెలిసినదే!
"నేను మనదేశంలో ఒక అచ్చమైన లిబరల్ పార్టీ పెట్టాలనుకున్నాను, వర్మగారు,ఆయన మిత్రులు కలిసి దీన్ని ఒక సోషల్ డెమాక్రటిక్ పార్టీ గా చేశారు" అంటూ జేపీ గారు 2010 లో లోక్ సత్తా శిక్షణా తరగతులలో పరిహాసధోరణిలో అన్నారు!
జే.పి.గారు ఏ ధోరణిలో అన్నప్పటికి అది మాత్రం నిజమేనని చెప్పాలి!
----------------------------------------------
వర్మగారి విశిష్టతలు!
**********************
వర్మ గారు ఒక మార్క్సిస్టుమేధావి!
సృజనాత్మక ఆలోచనాశీలి!
మూస, రొడ్డకొట్టుడు పద్ధతులకు ఆయన వ్యతిరేకం!
మార్క్స్ నూ ఎంగెల్స్ నూ, లెనిన్నూ, ఎంత శ్రద్ధగా చదివారో, గాంధీజీ నీ, అంబేడ్కర్ నూ అంతే అనురక్తితో చదివారు!
ఆంటోనియో గ్రామ్ సీ నీ లోతుగా అధ్యయనం చేశారు!
భారతీయ వాస్తవికతలకు అనుగుణంగా మార్క్సిజాన్ని వర్తింప చేయడానికి ఆయన తనవంతు మేధోకృషి కొనసాగిస్తున్నారు!
ప్రభావాలకూ, ప్రలోభాలకూ తలవంచని స్వతంత్ర వ్యక్తిత్వం ఆయన సొంతం!
కమ్యూనిస్టుపార్టీలో ఆయన్ని ప్రభావితం చేయడానికి పెద్ద నాయకులు ఎంతో ప్రయత్నించారు!
వీలు కాలేదు!
తన అభిప్రాయాల కోసం ఎంతటి వారితోనైనా తలపడే ధైర్యం,పట్టుదల,నిజాయితీ ఆయనలోని విశిష్టతలు!
అలాగే భిన్నాభిప్రాయాల కారణంగా ఆయనకు ఎవ్వరితోనూ వ్యక్తిగతంగా విభేదాలులేవు!
తగాదాలులేవు!
ఇన్నేళ్ళ పరిచయంలో ఇతర వ్యక్తుల గురించి ఆయన నిందా పూర్వకంగా, ద్వేషంగా మాట్లాడటం నేనెప్పుడూ వినలేదు!
అందరితోనూ స్నేహ సంబంధాలను సామరస్యపూరితంగా కొనసాగించడం వర్మగారి వ్యక్తిత్వంలోని విశిష్టత!
రాజకీయ, సామాజిక కార్యాచరణలో వినూత్న ఆలోచనలకు,ప్రయోగాలకు, మార్పులకు సదాసంసిద్ధంగా ఉండటం వర్మగారి ప్రత్యేకత!
గ్రాస్ రూట్ లో వచ్చే సామాజిక మార్పులను,రాజకీయ డైనమిక్స్ ను సీస్మోగ్రాఫిక్ స్థాయిలో పసిగట్టడంలో వర్మ గారికి ఎంతో నైపుణ్యంవుంది!
కమ్యూనిస్టుపార్టీలో, లోక్ సత్తాలో సైద్ధాంతిక, రాజకీయశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కార్యకర్తలను తయారు చేయడంలో వర్మగారు విశేష కృషిచేశారు!
శిక్షణా తరగతులను పదే పదే నిర్వహించే వారు!
ఆ రెండు ఉద్యమాల్లో వందలాది మంది కార్యకర్తలు ఆయన చేతుల మీదుగా తయారయ్యారు!
ఆయన ఎన్నో శిక్షణా కరదీపిక లను, అవగాహనాపత్రాలను, చిన్న చిన్న బుక్ లెట్ లను తయారు చేశారు!
ఎన్నో పుస్తకాలు రాశారు!
విశాలాంధ్ర దినపత్రిక తరపున 1990 లో "పశ్చిమగోదావరి జిల్లా సమాచార దర్శిని" పేరుతో 290 పేజీల ప్రత్యేక సంచిక టాబ్లాయిడ్ సైజులో ప్రచురించారు!
దానికి వర్మగారు సంపాదకునిగా బాధ్యతలు నిర్వహించారు!
అటువంటి సమగ్ర సమాచార సంచిక ఆ స్థాయిలో మళ్ళీ ఇంతవరకూ రాలేదని చెప్పాలి!
ప్రస్తుతం "జాతీయ స్ఫూర్తి" పక్ష పత్రిక సంపాదకునిగా ఆయన బాధ్యతలు చూస్తున్నారు!
ఇటీవల కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ఎంగెల్స్, జయంతి ఉత్సవాలు, కమ్యూనిస్టు మానిఫెస్టో 150 సంవత్సరాలు, భారత రాజ్యాంగం 70 సంవత్సరాలు, ఆంటోనియో గ్రామ్ సీ జయంతి సందర్బాల్లోనూ, సి.రాఘవాచారి స్మారకార్థం ప్రచురించిన "జాతీయస్ఫూర్తి" ప్రత్యేకసంచికలు వామపక్ష మేధో వర్గాల్లో మంచి ఆదరణ పొందాయి!
ఇప్పటికీ జిల్లాలో పలు కార్మికసంఘాలకు కూడా ఆయన సారథ్యం వహిస్తున్నారు!
----------------------------------------------
వర్మ గారి వ్యక్తిగతం!
****************
వర్మగారి వివాహం తన విద్యార్థి ఉద్యమసహచరి సంకుమనోరమ గారితో 1971 లో అయ్యింది!
మనోరమ గారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టుపార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, రైతునాయకుడు, సంకుఅప్పారావు, మహిళా ఉద్యమనేత సంకు లక్ష్మీకాంతమ్మ దంపతుల కుమార్తె!
ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ గా మనోరమగారు పదవీవిరమణ చేశారు!
మహిళా ఉద్యమనేతగా, సామాజికకార్యకర్తగా మనోరమ గారు జిల్లాలోనే కాక రాష్ట్రంలోనే చిరపరిచితురాలు!
కమ్యూనిస్టు ఉద్యమంలో, లోక్ సత్తాలో, మహిళాహక్కులకోసం, ప్రపంచశాంతి కోసం జరిగిన ఉద్యమంలో, మద్య వ్యతిరేక ఉద్యమాల్లో మనోరమ గారు క్రియాశీలంగా పాల్గొన్నారు!
వర్మ, మనోరమ దంపతులకు ఇద్దరు పిల్లలు!
కుమారుడు రాహుల్ కుటుంబం జంగారెడ్డిగూడెంలో, కుమార్తె కవిత కుటుంబం యు.ఎస్.లో స్థిరపడ్డారు!
వర్మగారు చక్కని ఆరోగ్యంతో, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని మాబోటి కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను!
వర్మగారికి జన్మదిన శుభాకాంక్షలు!
డి. సోమసుందర్,
సీనియర్ పాత్రికేయుడు,
01- 07- 2021,