27/04/2025
*Sunburn: ఎండ కొట్టే.. దొంగ దెబ్బ!*
🔥❗✍🏻❗🔥👤🌞
*తిరుపతి జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువకుడు రెండు రోజుల నుంచీ మిట్ట మధ్యాహ్నం ఎండలో పనులు చేస్తూ.. అస్వస్థతకు గురై కన్నుమూశాడు.*
4 min read
Eenadu icon
By Andhra Pradesh News Desk
Updated : 27 Apr 2025 04:51 IST
🔥తిరుపతి జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువకుడు రెండు రోజుల నుంచీ మిట్ట మధ్యాహ్నం ఎండలో పనులు చేస్తూ.. అస్వస్థతకు గురై కన్నుమూశాడు.
🔥వరంగల్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల గృహిణి నాలుగు రోజులుగా పచ్చడి పెట్టేందుకు మామిడి కాయలు కొట్టే పని చేస్తూ ఉన్నారు. హఠాత్తుగా మృత్యువాత పడ్డారు.
భానుడి భగభగలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వేడి వాతావరణంలో అతిగా శారీరక శ్రమ చేయడం వల్ల తగిలే ‘ఎగ్జర్షనల్ సన్‌స్ట్రోక్’ ప్రాణాంతకమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా వడదెబ్బ మృతుల్లో యువకుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
*మరి దీన్నుంచి ఎలా కాపాడుకోవాలి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి?*
*ఎండ కొట్టే.. దొంగ దెబ్బ!*
*ఏమిటీ దెబ్బ...*
వడదెబ్బల్లో మొదటిది సాధారణమైనది (క్లాసిక్). దీన్ని ఎపిడమిక్ హీట్ స్ట్రోక్‌గా పిలుస్తారు.
ఎండకు వెళ్లే వృద్ధులు, పిల్లలు, గర్భిణులు ఎక్కువగా దీని బారిన పడతారు. ఈ రకం వడదెబ్బలో చెమట ద్వారా రక్తంలో ఉన్న నీరు ఆవిరై పొడిబారతారు.
*శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీల ఫారెన్‌హైట్ వరకు వెళుతుంది. రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా శరీరంలోని అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.*
*రెండోది ఎక్కువగా శ్రమిస్తే వస్తుంది. దీన్ని ఎగ్జర్షనల్ సన్‌స్ట్రోక్ అంటారు. ఇది ఎక్కువగా ఆటగాళ్లు, కార్మికులు, వ్యాయామం చేసేవారికి తగులుతుంది. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.*
*చెమట ఎక్కువగా పట్టడం వల్ల డీ హైడ్రేషన్‌కు లోనవుతారు. కండరాలు దెబ్బతిని మొదట మూత్ర పిండాలు విఫలమవుతాయి.*
*తర్వాత మిగిలిన అవయవాలూ దెబ్బతిని మృత్యువాత పడే ప్రమాదం ఉంది. వడదెబ్బకు ప్రత్యేక పరీక్షలు ఉండవు.*
*బాధితులు ఎంత సేపు ఎండలో ఉన్నారన్నదాన్ని బట్టి నిర్ధారించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు....*
*వీరు జాగ్రత్త...*
దినసరి కూలీలు, ఉపాధిహామీ, భవన నిర్మాణ కార్మికులు, వాహనాల డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, ట్రాఫిక్ పోలీసులు, ఎక్కువ వ్యాయామాలు చేసేవారు.
*ప్రథమ చికిత్స ఇలా..*
ఎవరికైనా వడదెబ్బ తగిలినట్టు గుర్తిస్తే పక్కనున్నవారు వెంటనే ప్రథమ చికిత్స చేయాలి.
వారిని నీడ ఉన్న ప్రదేశానికి తీసుకొచ్చి శరీరంపై నీరు చల్లి గాలి వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. తడి బట్టతో శరీరాన్ని తుడుస్తూ శరీర ఉష్ణోగ్రత తగ్గేలా చేయాలి.
అందుబాటులో ఉంటే ఫ్యాన్ లేదా కూలర్, ఏసీ గాలి తగిలే ఏర్పాటు చేయాలి.
వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు.
*ఏం చేయాలంటే..!*
ఎండలో అతిగా శ్రమించడం, వ్యాయామం చేయడం వల్ల ఎగ్జర్షనల్ సన్‌స్ట్రోక్ వస్తుంది.
యువతీ యువకులు తీవ్రమైన వేసవిలో సైతం మాకేం కాదులే అనే ధీమాతో ఎక్కువ కష్టపడతారు. దీనివల్ల ఈ రకమైన వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.
దీనిబారిన పడితే తలనొప్పి, వాంతులు, ఫిట్స్ వచ్చి చివరకు అపస్మారక స్థితిలోకి వెళతారు. నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఎండల్లో పనిచేసేవారు అరగంటకోసారి విశ్రాంతి తీసుకోవాలి. నీడ పట్టున కాసేపు కూర్చుని మళ్లీ పనిచేయాలి.
ఎండలు ముదిరాక తెలియకుండానే డీహైడ్రేషన్‌కు లోనవుతాం.
అందుకే దాహం వేయకున్నా అరగంటకోసారి నీరు తాగాలి.
ఎండలో తిరిగే వారు ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలి. లేదా కొబ్బరి బోండాలు, నిమ్మకాయ మజ్జిగ ఎక్కువగా తాగాలి. తాగునీటిలో ఉప్పు, నిమ్మకాయ కలిపి తాగినా ప్రయోజనం ఉంటుంది.
నూనె పదార్థాలు, మసాలాలు తినకూడదు.
శుభ్రమైన నీరు తాగాలి. శీతల పానీయాలు, బీర్లు, ఆల్కహాల్ జోలికి వెళొద్దు.
వడదెబ్బ తగిలిన వ్యక్తులకు ఉష్ణోగ్రత అధికమవుతుంది. ఆ సమయంలో పారాసిటమల్ వంటి మాత్రలు పనిచేయవు. పెయిన్ కిల్లర్లు కూడా ఇవ్వద్దు.
వైద్యుడిని సంప్రదిస్తే అవసరమైతే ఐవీ ఫ్లూయిడ్లు పెడతారు.
మానసిక సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు, పార్కిన్సన్ వ్యాధులకు ఔషధాలు వాడే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
ముదురు రంగు దుస్తులు కాకుండా తెల్లవి, కాటన్ దుస్తులు వదులుగా ఉండేవి ధరించాలి.
యువత టైట్ జీన్స్‌లు వేస్తుంటారు. వేసవిలో అవి పనికిరాదు.
- *డాక్టర్ ఎం.వి.రావు, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్, యశోద ఆసుపత్రి, హైదరాబాద్..*
- *ఈనాడు, హైదరాబాద్...*✍🏻