CITU Nalgonda

CITU Nalgonda Labour Union . works for Working force in Nalgonda

ప్రెస్ నోట్:16-08-2026ఎల్‌నినో ప్రభావం.. వరి సాగుకు స్వస్తి పలకాలినాగార్జునసాగర్‌పై ఆధారపడి కొత్తగా వరి నాట్లు వేయొద్దుప...
16/08/2026

ప్రెస్ నోట్:
16-08-2026
ఎల్‌నినో ప్రభావం.. వరి సాగుకు స్వస్తి పలకాలి
నాగార్జునసాగర్‌పై ఆధారపడి కొత్తగా వరి నాట్లు వేయొద్దు
పప్పు, నూనెగింజలు, చిరుధాన్యాల వైపు రైతులు మళ్లాలి
*వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ. ఆల్దాస్ జానయ్య సూచన*
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు కొనసాగుతున్న నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించి పప్పు దినుసులు, నూనెగింజలు, చిరుధాన్యాలు వంటి మెట్ట పంటల వైపు రైతులు మళ్లాలని *వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ అల్దస్ జానయ్య. సూచించారు.* ఆదివారం నాడు నల్లగొండలో వ్యవసాయ రంగంపై ఎల్ ని నో ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై రైతు సంఘం సెమినార్ నిర్వహించడం జరిగింది. సెమినార్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అల్దాస్ జానయ్య మాట్లాడుతూ నాగార్జునసాగర్‌, ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై ఆశలు పెట్టుకుని కొత్తగా వరి నాట్లు వేయడం సరికాదని స్పష్టం చేశారు. ఇప్పటికే నార్లు పోసిన రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు.
నల్లగొండ పట్టణంలోని డైనింగ్‌ హాల్‌లో ఆదివారం వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావం, పంటల మార్పిడి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన సెమినార్‌లో వీసీ మాట్లాడారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే ప్రస్తుతం సుమారు 10–12 శాతం వర్షపాతం లోటు నమోదైందని, ఎనిమిది జిల్లాల్లో లోటు మైనస్‌ 30 శాతం వరకు చేరిందని తెలిపారు.
ఎల్‌నినో కొత్తేమీ కాదు
గత 30 ఏళ్లలో సుమారు ఆరు ఎల్‌నినో సంవత్సరాలను ఎదుర్కొన్నామని, ఇది కొత్త పరిణామం కాదని వీసీ తెలిపారు. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావంతో సంభవించే నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టడం శుభపరిణామమన్నారు.
వర్షాలు తగ్గాయని రైతులు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ఒక అవకాశంగా మలుచుకుని పంటల వైవిధ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.
వరి విస్తీర్ణం తగ్గించాల్సిందే
రాష్ట్రంలో అవసరానికి మించి వరి ఉత్పత్తి జరుగుతోందని, వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని వీసీ పేర్కొన్నారు. అదే సమయంలో బోర్ల సంఖ్య పెరగడంతో భూగర్భ జలాల వినియోగం కూడా అధికమైందన్నారు. ఈ ఏడాది వర్షాలు తగ్గడంతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోయాయని, భవిష్యత్తులో భూగర్భ జలాలు కూడా మరింత తగ్గే అవకాశం ఉందన్నారు.
వరి సాగుకు అధికంగా నీరు, రసాయన ఎరువులు అవసరమవుతాయని, వరి విస్తీర్ణాన్ని తగ్గించడం ద్వారా నీటి వనరులను కాపాడుకోవచ్చన్నారు. నాలుగు ఎకరాల్లో వరి సాగు చేసే రైతు కనీసం రెండు ఎకరాల్లో పప్పు దినుసులు, నూనెగింజలు లేదా ఇతర మెట్ట పంటలు సాగు చేయాలని సూచించారు.
సాగర్‌ నీళ్లపై ఆశలు వద్దు
నాగార్జునసాగర్‌లో ఈసారి నీరు నిండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని గత రెండు నెలలుగా ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, నీటిపారుదల శాఖ రైతులను అప్రమత్తం చేస్తున్నాయని వీసీ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచడంతో పాటు విత్తన మేళాలు కూడా నిర్వహించినట్లు చెప్పారు.
అయినప్పటికీ సాగర్‌ నీళ్లు వస్తాయన్న ఆశతో కొంతమంది రైతులు వరి నార్లు పోసుకున్నారని తెలిపారు. బావులు, బోర్లు ఉన్న ప్రాంతాల్లో కొంతమేర పంటను కాపాడుకునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం సాగర్‌ నీటిపైనే ఆధారపడిన వరి సాగుకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు లేవన్నారు.
కొత్తగా నాట్లు వేయొద్దు
ఇప్పటి నుంచి కొత్తగా వరి నాట్లు వేయొద్దని వీసీ స్పష్టం చేశారు. ఇప్పటికే నారు పోసుకున్న రైతులు పరిస్థితిని గమనించాలని, కేవలం సాగర్‌ నీటిపై ఆధారపడి నాట్లు వేసుకోవడం వల్ల తర్వాత నీటి కొరతతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
వాతావరణ పరిస్థితుల ప్రకారం సెప్టెంబర్‌ వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. హిందూ మహాసముద్రంలో ఐఓడీ ) సానుకూలంగా మారితే ఎల్‌నినో ప్రభావం కొంత తగ్గి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే అలాంటి వర్షాలు వచ్చినా ప్రస్తుత వానాకాలం వరి పంటకు కాకుండా రెండో పంట లేదా ముందస్తు యాసంగికి మాత్రమే ఉపయోగపడే అవకాశం ఉందన్నారు.
ప్రకృతిని ఎదుర్కోలేం.. ప్రత్యామ్నాయమే మార్గం
సాగర్‌ నుంచి నీరు రాకపోవడం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది కాదని, ప్రస్తుత పరిస్థితులు ప్రకృతి ఆధారితమైనవని వీసీ పేర్కొన్నారు. ప్రకృతి అనుకూలించని సమయంలో పరిస్థితులను అర్థం చేసుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచించారు.
పప్పు దినుసులు, నూనెగింజలు, చిరుధాన్యాలు వంటి పంటలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు రైతులు కొంత ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎల్‌నినోను కేవలం సంక్షోభంగా కాకుండా పంటల వైవిధ్యాన్ని పెంచుకునే అవకాశంగా చూడాలని రైతులకు పిలుపునిచ్చారు.
వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, రైతు సంఘాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం సమన్వయంతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

ఎల్నినో ప్రభావంతో పంటల మార్పిడి తప్పనిసరి
రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో రైతులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడిపై దృష్టి సారించాలని *అఖిలభారత కిసాన్‌సభ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సూచించారు* ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, వర్షపాతం పరిస్థితులను అంచనా వేసుకుని తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
*నల్లగొండలోనే రైతు మహాసభకు ప్రత్యేకత అఖిల భారత కిసాన్‌సభ 36వ మహాసభను నల్లగొండలో నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమని జూలకంటి రంగారెడ్డి అన్నారు.* వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నల్లగొండ కేంద్రంగా నిలిచిందని, వేలాది మంది రైతులు ప్రాణత్యాగాలు చేసిన చారిత్రక ప్రాంతమని గుర్తుచేశారు. ఆ పోరాట ఫలితంగా భూ పంపిణీ, వెట్టిచాకిరీ రద్దు వంటి కీలక మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది రైతు ప్రతినిధులు నాలుగు రోజులపాటు మహాసభలో పాల్గొంటారని తెలిపారు.
లక్ష మంది రైతులతో ర్యాలీ
మహాసభను కేవలం ప్రతినిధులతో నిర్వహించి తీర్మానాలు చేయడం కాకుండా, రైతాంగాన్ని పెద్దఎత్తున కదిలించే కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. నవంబర్‌ 15న లక్ష మంది రైతులతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటికో వ్యక్తి, గ్రామానికో బస్సు లేదా రెండు ట్రాక్టర్లు కదిలేలా రైతులను సమీకరించాలని పిలుపునిచ్చారు. రాబోయే మూడు నెలల్లో రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా గ్రామాల్లో పర్యటించాలని కోరారు.
రైతుల సహకారంతోనే మహాసభను నిర్వహించాలన్నదే తమ నిర్ణయమన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 1.30 లక్షల రైతు కుటుంబాలను నేరుగా కలవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల కుటుంబాలను సంప్రదించనున్నట్లు వెల్లడించారు.
మహాసభకు అవసరమైన బియ్యం, కూరగాయలు, పప్పులు తదితర సరుకులతో పాటు ఆర్థిక సహకారాన్ని రైతులు అందించాలని కోరారు.
గిట్టుబాటు ధరకు చట్టం రావాలి
రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండిస్తున్నప్పటికీ గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారని జూలకంటి ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు ధర నిర్ణయించే అధికారం రైతుకు లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందన్నారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్‌ ధరలకు అనుగుణంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.
కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, ఎరువుల కొరత, బ్యాంకు రుణాల సమస్యలు రైతులను తీవ్రంగా వేధిస్తున్నాయని తెలిపారు. రైతుల సమస్యలపై అఖిల భారత కిసాన్‌సభ మహాసభలో విస్తృతంగా చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. *రైతు సంక్షేమమే దేశాభివృద్ధికి పునాది రైతులు సంక్షేమంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని జూలకంటి రంగారెడ్డి అన్నారు*. వ్యవసాయ రంగం దెబ్బతింటే దాని ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతుల సమస్యలపై పోరాటాలు కొనసాగుతున్నాయని, రైతాంగాన్ని ఐక్యంగా కదిలించి హక్కుల సాధనకు ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
నల్లగొండలో తొలిసారిగా నిర్వహిస్తున్న అఖిల భారత రైతు మహాసభను విజయవంతం చేసేందుకు రైతులు, ప్రజా ఉద్యమాల నాయకులు, కార్యకర్తలు అన్ని విధాలుగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సెమినార్ లో *విశ్రాంత ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీరపల్లి వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, బండ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.*

*వీరపల్లి వెంకటేశ్వర్లు*
జిల్లా ప్రధాన కార్యదర్శి

ప్రెస్ నోట్ తేదీ:16.08.2026. నల్గొండ. గ్రామపంచాయతీ కార్మికులకు 26 వేల వేతనాన్ని వెంటనే అమలు చేయాలి. మల్టీ పర్పస్ విధానాన...
16/08/2026

ప్రెస్ నోట్ తేదీ:16.08.2026. నల్గొండ.

గ్రామపంచాయతీ కార్మికులకు 26 వేల వేతనాన్ని వెంటనే అమలు చేయాలి.

మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి.

లేదంటే నిరవధిక సమ్మెకు సిద్ధమవుతాం.

యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్ హెచ్చరిక.

గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 26వేల కనీస వేతనాన్ని వెంటనే అమలు చేయాలని మల్టీపర్ప విధానాన్ని రద్దు చేయాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతారని యూనియన్ *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్* ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆదివారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నల్గొండ *జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్ లో* పి సర్వయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 60 వేల మంది గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాల పారిశుధ్య నిర్వహణ, పన్నుల వసూలు, మంచినీళ్లు సరఫరా వీధిలైట్ల నిర్వహణ చేస్తూ ప్రభుత్వం నిర్వహించే అనేక కార్యక్రమాల అమల్లో కీలక భూమిక పోషిస్తున్నా కనీస వేతనాలు లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందర మేం అధికారంలోకి వస్తే కనీస వేతనాలు అమలు చేస్తామని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని ఆరోగ్య ప్రమాద బీమా కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రెండున్నర సంవత్సరాలు గడిచిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కార్మికులను వేధిస్తున్నారని విమర్శించారు.
యూనియన్ *జిల్లా కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ* మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు టిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో పోరాడుతుంటే టెంట్ల దగ్గరికి వచ్చి మద్దతిచ్చి పోరాడండి అని ధైర్యం చెప్పిన నేతలే నేడు ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారని అయినా గ్రామపంచాయతీ కార్మికుల బతుకులు మారడం లేదని అన్నారు. జిల్లాలో తొలగించిన కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని, పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. హామీల అమలు కోసం ఈనెల 18,19 తేదీల్లో మండల ఎంపీడీవో ఆఫీస్ ల ముందు దీక్షలు, 24,25 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ ముందు దీక్షలు అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏర్పుల యాదయ్య, లింగయ్య,జానయ్య, లింగస్వామి, రమేష్, యాదయ్య, బాలమ్మ, మల్లేష్, వెంకన్న, ఆంజనేయులు, అరుణ, నరసింహ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

15/08/2026
పత్రికా ప్రకటన తేదీ:14.8.2026ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు తేదీ:14.8.2026 న ప్రజావాణి అధికారులకు వినత...
14/08/2026

పత్రికా ప్రకటన
తేదీ:14.8.2026

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు తేదీ:14.8.2026 న ప్రజావాణి అధికారులకు వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ప్రజావాణి నోడల్ అధికారి విద్యాసాగర్ గారు మరియు వారి బృందం అధికారులు ఆశా యూనియన్ (citu) నాయకులతో చర్చలు జరిపారు. మన వైపు నుండి వినతిపత్రంలో ఉన్న డిమాండ్స్ ను అధికారులకు వివరించాము. ప్రతి నెల 1 వ తేదీన పారితోషికాలు ఇవ్వాలని, రూ.18,000/- లు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని,pf,esi సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పని భారం తగ్గించాలని, టార్గెట్స్ ను రద్దు చేయాలని,ncd తదితర ఆన్లైన్ పనులను చేయించకూడదని, స్పూటం డబ్బాలు మోసే విధానాన్ని రద్దు చేయాలని, ప్రమోషన్స్ సౌకర్యం ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర వినతి పత్రంలో ఉన్న డిమాండ్స్ అన్నింటిని పరిష్కరించాలని కోరటం జరిగింది. అధికారులు స్పందిస్తూ ఆశాల సమస్యలను పరిశీలించాలని పరిష్కారం కోసం కృషి చేయాలని ఆరోగ్య శాఖ కమిషనర్ గారికి రాయడం జరిగింది. ప్రత్యేకంగా ఆరోగ్యశాఖ అధికారులతో ఆశాల సమస్యలను చర్చిస్తామని కూడా ప్రజావాణి అధికారులు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. నీలా దేవీ, రాష్ట్ర కోశాధికారి పి.గంగమణి, ఆశా రాష్ట్ర నాయకులు యాదమ్మ, సావిత్ర, అమృత, యశోద, శశికళ, కళావతి, జయమ్మ, బాలమణి, బుచ్చమ్మ, జాన్సీ, సుశీల, చంద్రకళ, వెంకటమ్మ, పుష్ప,కవిత తదితరులు పాల్గొన్నారు.

14/08/2026

ప్రెస్ నోట్ 14-08-2026
*కార్పొరేట్ల కబంధహస్తాల నుండి భారతదేశాన్ని కాపాడుకుందాం--- సిఐటియు*
సామ్రాజ్యవాదం పై పోరాడి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వీరుల త్యాగపలితాన్ని నేడు బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల కు అప్పచెప్పుతుందని *సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం యంగ్ వర్కర్ స్టీరింగ్ కమిటీ జిల్లా కన్వీనర్ చినపాక లక్ష్మీనారాయణ* ఆరోపించారు
శుక్రవారం మైసయ్య విగ్రహం నుండి ఎగ్బాల్ మినార్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పితూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులను హరించి వేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ జైల్లో నిర్బంధిస్తున్నారని అన్నారు. లౌకిక భారత రాజ్యాంగాన్ని మార్పులు చేస్తూ మతరాజ్యంగా మార్చడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు మతసామరస్యాన్ని కాపాడుకుందాం అని ప్రజలంతా కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలపై సంఘటితంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
*ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, యంగ్ వర్కర్స్టీరింగ్ కమిటీ జిల్లా కోకన్వీనర్ బీమాగాని గణేష్ జిల్లా కమిటీ సభ్యులు గుండాల నరేష్ సలివోజు సైదాచారి నలపరాజు సైదులు, గంజి రాజేష్ వివిధ సంఘాల నాయకులు గంజి నాగరాజు ఎడ్ల తరుణ్ బొమ్మకంటి లక్ష్మీపతి పేర్ల సంజీవ, జీడిమెట్ల నరసింహ బకరం మహేందర్ సిరాజుద్దీన్ శ్రీనివాస చారి,బొల్లు రవీందర్, ఎల్లేశ్, పందుల లింగయ్య దున్న అనిల్ తదితరులు పాల్గొన్నారు*

14/08/2026

CITU యంగ్ వర్కర్స్ స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు నల్లగొండ లో కాగడాల ప్రదర్శన లో మాట్లాడుతూన్న సిఐటియు నల్లగొండ టౌన్ కన్వీనర్ అవుట రవీందర్ గారు

14/08/2026

CITU యంగ్ వర్కర్స్ స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు నల్లగొండ లో కాగడాల ప్రదర్శన లో మాట్లాడుతూన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య గారు

14/08/2026

CITU యంగ్ వర్కర్స్ స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు నల్లగొండ లో కాగడాల ప్రదర్శన లో మాట్లాడుతూన్న యంగ్ వర్కర్స్ జిల్లా కన్వీనర్ చిన్నపాక లక్ష్మీనారాయణ గారు

14/08/2026

CITU యంగ్ వర్కర్స్ స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు నల్లగొండ లో కాగడాల ప్రదర్శన లో మాట్లాడుతూన్న సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం గారు

Address

Nalgonda
508001

Telephone

+919490098334

Website

Alerts

Be the first to know and let us send you an email when CITU Nalgonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category