30/08/2026
*గురువు చేతుల్లోనే రేపటి సమాజం*
*కె.ఎస్. లక్ష్మణరావు, మాజీ శాసనమండలి సభ్యులు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు 83099 65083*
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అంటే కేవలం ఉపాధ్యాయులను సన్మానించుకునే రోజు కాదు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రను మరోసారి గుర్తుచేసుకునే రోజు. పాఠశాల గదిలో నిలబడి పాఠం చెప్పే వ్యక్తిని మాత్రమే ఉపాధ్యాయుడు అనలేం. ఒక తరాన్ని ఆలోచింపజేసే వ్యక్తి, ప్రశ్నించే ధైర్యాన్ని నింపే వ్యక్తి, తప్పును సరిదిద్దే వ్యక్తి, సమాజం పట్ల బాధ్యతను కల్గించే వ్యక్తి నిజమైన ఉపాధ్యాయుడు. పుస్తకంలోని అక్షరాలను విద్యార్థి మెదడులో నింపడం మాత్రమే బోధన కాదు. ఆ అక్షరాల వెనుకనున్న జీవితాన్ని, సమాజాన్ని, మానవ సంబంధాలను అర్థం చేసుకునేలా చేయడమే అసలైన విద్య. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారతదేశ విద్యా వ్యవస్థకు, ఉపాధ్యాయ వృత్తికి ఆయన అందించిన గౌరవం అపారమైంది. ఆయన్ను స్మరించు కోవడం అంటే కేవలం పూలమాలలు వేయడం కాదు. ఆయన కలలుగన్న విద్యా విలువలను ఆచరణలోకి తీసుకురావడం, విద్యార్థుల్లో విజ్ఞానంతోపాటు వివేకాన్ని, స్వేచ్ఛా ఆలోచనను, మానవత్వాన్ని పెంపొందించడం. అదే నిజమైన ఉపాధ్యాయ దినోత్సవం.
మనిషి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రభావం చూపే వ్యక్తి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులు బిడ్డకు జీవితం ఇస్తే, ఉపాధ్యాయుడు ఆ జీవితానికి దిశానిర్దేశం చేస్తాడు. ఇంటి నుంచి పాఠశాలకు వచ్చిన *చిన్నారి మనసును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడి పాత్ర అపారమైంది. ఒక మంచి మాట, ఒక చిన్న ప్రోత్సాహం, ఒక సానుకూల సూచన విద్యార్థి జీవితాన్నే మార్చగలదు. అదే నిరుత్సాహపర్చే మాట అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొచ్చు. అందుకే ఉపాధ్యాయుడు పాఠ్యాంశ నిపుణుడిగానే కాకుండా విద్యార్థుల మనసులను అర్థం చేసుకునే మార్గదర్శిగా ఉండాలి.* విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించాలి. అతని బలహీనతలను అర్థం చేసుకోవాలి. వెనుకబడటానికి కారణాలను తెలుసుకోవాలి. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, భాషా సమస్యలు, సామాజిక నేపథ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రేమతో, ఓర్పుతో, నమ్మకంతో విద్యార్థిని ముందు కు నడిపించాలి. ప్రతి విద్యార్థి ఒకేలా ఉండడు. కొందరు చదువులో ముందుంటారు. మరికొందరు *క్రీడల్లో ప్రతిభ చూపుతారు. ఇంకొందరు కళలు, సంగీతం, రచన, విజ్ఞాన ప్రయోగాల్లో రాణిస్తారు. మరికొందరికి ప్రత్యేక శ్రద్ధ అవసరం కావొచ్చు. అందరినీ ఒకే కొలమానంతో కొలవడం సరైంది కాదు. ప్రతి బిడ్డలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి వెలికితీయడం ఉపాధ్యాయుడి బాధ్యత. నువ్వు ఏమీ చేయలేవు అనే మాట ఒక చిన్నారి ఆత్మవిశ్వాసాన్ని జీవితాంతం దెబ్బ తీయొచ్చు*. అదే 'నీకు ఇది సాధ్యమే' అనే మాట అతని జీవితాన్ని మార్చగలదు. అందుకే ఉపాధ్యాయుడి ప్రతి మాటకు విలువ ఉంది. ప్రతిచర్యకు ప్రభావం ఉంది. మారుతున్న ప్రపంచంలో పెరిగిన బాధ్యత సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న కాలమిది. కృత్రిమ మేధస్సు, డిజిటల్ తరగతులు, అంతర్జాల విద్య, స్మార్ట్ పరికరాలు విద్యా ప్రక్రియ స్వరూపాన్నే మార్చుతున్నాయి. విద్యార్థి చేతిలో పుస్తకంతోపాటు మొబైల్ ఉంది. ఒక ప్రశ్నకు సమాధానం కోసం గ్రంథాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రపంచంలోని అపారమైన సమాచారాన్ని క్షణాల్లో పొందగలుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుడి పాత్ర తగ్గలేదు. వాస్తవానికి మరింత పెరిగింది. సమాచారం అందుబాటులో ఉండటం ఒక విషయం; దానిని విశ్లేషించి జ్ఞానంగా మార్చు కోవడం మరో విషయం. ఏది నిజం? ఏది అబద్ధం? ఏది శాస్త్రీయ సమాచారం? ఏది తప్పుడు ప్రచారం? ఏది నమ్మదగిన ఆధారం? ఏది పుకారు? అనే విషయాలను గుర్తించే వివేకం విద్యార్థిలో పెంపొందించాలి. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించడం, ఇతరుల హక్కులను గౌరవించడం, ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకోవడం, భిన్నాభిప్రాయాలను గౌరవించడం వంటి లక్షణాలను యంత్రాలు మాత్రమే నేర్పలేవు. వాటికి మానవీయ అనుభవం అవసరం. ఆ అనుభవాన్ని విద్యార్థికి అందించగలిగేది ఉపాధ్యాయుడే. కృత్రిమ మేధస్సుకు భయపడటం లేదా పూర్తిగా నిషేధించడం పరిష్కారం కాదు. దానిని బాధ్యతగా, సృజనాత్మకంగా ఉపయోగించడం నేర్పాలి. విద్యార్థి స్వయంగా ఆలోచించకుండా యంత్రం ఇచ్చిన సమాధానాన్ని కాపీ చేస్తే విద్యా ప్రక్రియ దెబ్బతింటుంది. సాంకేతికత ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదు. ఉపాధ్యాయుడి సామర్థ్యాన్ని పెంచే సాధనం.
*మార్కుల కంటే మనిషి ముఖ్యం*
మన విద్యా వ్యవస్థలో పరీక్షలు, మార్కు లు, ర్యాంకులు, ఉద్యోగాలు ప్రధాన లక్ష్యాలు గా మారిపోయాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి మార్కులు సాధించాలని కోరుకోవడం సహజం. విద్యార్థి మంచి ఉద్యోగం సంపాదిం చాలని ఆశించడం కూడా తప్పు కాదు. కానీ విద్యను కేవలం ఉద్యోగానికి ప్రవేశపత్రంగా పరి మితం చేస్తే దాని అసలు లక్ష్యం నశిస్తుంది. పరీక్షలో వందకు వంద మార్కులు సాధించిన విద్యార్థి తన పక్కనున్న మనిషి బాధను అర్థం చేసుకోలేకపోతే ఆ విద్య సంపూర్ణం కాదు. పెద్ద ఉద్యోగం సాధించిన వ్యక్తి సమాజంలోని బలహీనవర్గాల పట్ల మానవత్వం చూపకపోతే అతని విద్యలో లోపం ఉన్నట్టే. విజ్ఞానం పెరిగి వివేకం తగ్గితే సమాజానికి అది ప్రమాదకరం. అందుకే ఉపాధ్యాయుడు విద్యార్థిని కేవలం ఉద్యోగార్థిగా కాకుండా బాధ్యతగల పౌరుడిగా తీర్చిదిద్దాలి. గణితం, విజ్ఞానం, భాష, చరిత్ర, భూగోళశాస్త్రంతోపాటు 'మనిషిగా ఎలా జీవించాలి?' అనే ప్రశ్నకు సమాధానం వెతికేలా చేయాలి. ఇతరులను గౌరవించడం, సమానత్వాన్ని నమ్మడం, కులం, మతం, లింగం, ఆర్థికస్థితి ఆధారంగా వివక్ష చూపకపోవడం, ప్రకృతిని ప్రేమించడం, ప్రజా ఆస్తిని కాపాడటం, రాజ్యాంగ విలువలను గౌరవించడం విద్యలో అంతర్భాగం కావాలి.
*శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించాలి*
తరగతి గదిలో ఉపాధ్యాయుడిని ప్రశ్నించే విద్యార్థిని భయపడేలా చేయకూడదు. ప్రశ్నించడం అజ్ఞానానికి గుర్తు కాదు. తెలుసుకోవాలనే తపనకు గుర్తు. 'ఎందుకు?' అని అడిగే పిల్లవాడిని ప్రోత్సహించాలి. 'ఇలా ఎందుకు జరుగు తోంది?', 'ఇది సరైనదేనా?', 'దీనికి మరో మార్గం లేదా?' అని ఆలోచించే విద్యార్థులను తయారు చేయాలి. *శాస్త్రీయ ఆలోచనకు మూలం ప్రశ్న.* మూఢనమ్మకాలను ఎదుర్కొనే శక్తికి మూలం ప్రశ్న, సామాజిక అన్యాయాన్ని గుర్తించే చైతన్యానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తికి కూడా ప్రశ్నే మూలం. అందుకే ఉపాధ్యాయుడు ప్రశ్నలను అణచివేయకుండా వాటిని చర్చగా మార్చాలి. వాదనకు ఆధారాలు చూపించాలి. సాక్ష్యాలతో విషయాలను అర్థం చేసుకోవాలి. ఇలా ఆలోచించే తరాన్ని తయారు చేయడం ద్వారానే శాస్త్రీయ దృక్పథం కలిగిన సమాజాన్ని నిర్మించగలం.
*విద్యకు రాజ్యాంగ విలువలు పునాది*
స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలు పాఠ్యపుస్తకాల్లో మాత్రమే ఉండకూడదు. విద్యార్థుల జీవితాల్లో ప్రతిబింబించాలి. పిల్లవాడు తన సహ విద్యార్థి ఏ కులానికి, ఏ మతానికి చెందినవాడో ముందుగా చూడాల్సిన అవసరం లేదు. అతని లో ఒక మనిషిని చూడాలి. పాఠశాల సమానత్వానికి తొలి వేదిక కావాలి. కుల వివక్ష, మత విద్వేషం, లింగ వివక్ష, ప్రాంతీయత, భాషా ద్వేషం వంటి సామాజిక వైరుధ్యాలు పిల్లల మన సుల్లోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. కుటుంబం, ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు ప్రభావం చూపుతున్న కాలంలో పాఠశాల ప్రజా స్వామ్య సంస్కారాలకు బలమైన స్థలంగా మారాలి. భిన్న కుటుంబాలు, సామాజిక నేపథ్యాలు, మతాలు, భాషలు, ప్రాంతాలకు చెందిన పిల్లలు కలిసి చదువుకోవడం, ఆడుకోవడం, ఎదగడం భారతీయతకు గొప్ప సందేశం. ఉపాధ్యాయుల గౌరవం గురించి ప్రతి సంవత్సరం గొప్పగా మాట్లాడుతున్నాం. కానీ ఆ గౌరవం వారి వృత్తి పరిస్థితుల్లో కనిపిస్తున్నదా? ఇది మనం ఆలో చించాల్సిన ప్రశ్న.
*బోధనేతర పనులు వద్దే వద్దు*
ఉపాధ్యాయుడు బోధనకు తగిన సమయం పొందాలి. అనవసరమైన బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలి. పాఠశాలల్లో తగిన మౌలిక వసతులు ఉండాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం జరగాలి. నిరంతర శిక్షణకు అవకాశాలు కల్పించాలి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు అవసరమైన వనరులు అందించాలి. ఉపాధ్యాయుడి వృత్తి స్వాభిమానాన్ని కాపాడే వాతావరణం ఉండాలి. ఉపాధ్యాయులను ప్రతి సమస్య కు బాధ్యులుగా చూపడం ద్వారా విద్యా వ్యవస్థ బలోపేతం కాదు. ఉపాధ్యాయుడిపై నమ్మకం ఉంచి, అతని వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి, అవసరమైన సహకారం అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. మంచి పని వాతావరణం, వృత్తిపరమైన స్వేచ్ఛ, సామాజిక గౌరవం, నిరం తర శిక్షణ, పరిశోధనకు అవకాశం, తగిన బోధ నా సామగ్రి, ఒత్తిడిలేని బోధనకు అవసరమైన సౌకర్యాలు కూడా అవసరం. అదే సమయంలో ఉపాధ్యాయుల ఆర్థిక భద్రతను ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఉద్యోగ భద్రత, సమయాను కూల వేతనాలు, ఉద్యోగోన్నతులు, ఉద్యోగ విరమణ అనంతర భద్రత వంటి అంశాల్లో స్పష్టమైన, న్యాయమైన విధానాలు ఉండాలి. ఆర్థికంగా, వృత్తిపరంగా భద్రత ఉన్న ఉపాధ్యాయుడే విద్యా ర్థులపై పూర్తి దృష్టి పెట్టగలడు.
*ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అత్యవసరం*
ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలే ప్రధాన ఆధారం. ప్రభుత్వ విద్య బల హీనపడితే సామాజిక అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం అత్యంత ప్రాధాన్యమైన సామాజిక బాధ్యత. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తగిన తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, గ్రంథాలయం, ప్రయోగశాలలు, క్రీడా సదుపాయాలు ఉండాలి. డిజిటల్ సౌకర్యాలు అందుబాటులోకి రావాలి.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు పట్ట ణాల్లోని పిల్లలతో సమానమైన విద్యా అవకాశాలు కల్పించాలి. పేద కుటుంబానికి చెందిన పిల్ల వాడు ప్రతిభలో ఎవరికీ తీసిపోడు. అవకాశాలు లభించడంలోనే తేడా ఉంటుంది. ఆ అవకాశాన్ని సమానంగా అందించడం ప్రభుత్వ బాధ్యత. విద్య సామాజిక చలనశీలతకు ప్రధాన సాధనం. పేద కుటుంబంలో పుట్టిన పిల్లవాడు తన ప్రతిభతో ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య మార్గం చూపుతుంది. ఆ మార్గాన్ని బలహీనపరిస్తే అస మానతలు తరతరాలకు కొనసాగుతాయి. అందు వల్ల విద్యను వ్యాపార వస్తువుగా మాత్రమే చూడ కుండా ప్రజా హక్కుగా బలోపేతం చేయాలి. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పెట్టుబడులు పెంచాలి. పేద, గ్రామీణ, వెనుకబడిన తరగతుల పిల్లలకు ప్రత్యేక సహాయ కార్యక్రమాలు ఉండాలి.
*బాలికల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం*
ఒక బాలిక చదువుకుంటే ఒక వ్యక్తి మాత్రమే చదువుకున్నట్టు కాదు. ఒక కుటుంబం చైతన్యవంతమవుతుంది. ఒక తరం ప్రభావితం అవుతుంది. అందువల్ల బాలికల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. పాఠశాల బాలికలకు భద్రమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించాలి. వారిహక్కులపై అవగాహన కల్పించాలి.
స్వయం నిర్ణయ సామర్థ్యాన్ని పెంచాలి. వారి కలలకు పరిమితులు పెట్టకుండా ప్రోత్సహించాలి. 'అమ్మాయిలకు ఈ రంగం కాదు' వంటి సామాజిక ధోరణులను ప్రశ్నించే ధైర్యాన్ని ఇవ్వాలి. అబ్బాయిలకు కూడా లింగ సమానత్వం గురించి బోధించాలి. మహిళలను గౌరవించడం, ఇంటి పనులను పంచుకోవడం, సహచరుల స్వేచ్ఛను గౌరవించడం వంటి విలువలు చిన్ననాటి నుంచే నేర్పాలి. లింగ సమానత్వం పాఠ్యాంశం మాత్రమే కాదు; అది జీవన విధానం కావాలి.
*పుస్తక పఠనం ఆలోచనకు పునాది*
మొబైల్ స్క్రీన్పై గడిపే సమయం పెరుగుతున్న కొద్దీ పుస్తక పఠనం తగ్గిపోతున్న ఆందోళన ఉంది. పుస్తకం కేవలం సమాచారాన్ని ఇవ్వదు. ఊహాశక్తిని పెంచుతుంది. మనసును విశాలం చేస్తుంది. ఇతరుల జీవితాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రతి పాఠశాలలో సజీవమైన గ్రంథాలయం ఉండాలి. పిల్లలు స్వేచ్ఛ గా వెళ్లి పుస్తకాలు తీసుకుని, చదివే వాతావర ణం ఉండాలి. ఉపాధ్యాయుడు స్వయంగా పుస్తకాలు చదివి విద్యార్థులకు పరిచయం చేయాలి. వారితో పుస్తకాలపై చర్చించాలి. సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, జీవిత చరిత్రలు, బాలసాహి త్యం, సామాజిక చైతన్య రచనలు పిల్లల్లో విస్తృ తమైన ఆలోచనలను పెంచుతాయి పుస్తకం.
*నిర్వీర్యానికి కుట్రలు*
గత కొన్నేళ్లుగా పరిశీలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా విద్యాప్రమాణాలు గణనీయంగా పెరుగుతుండటాన్ని గమనించొచ్చు. దీనికి ఉపాధ్యాయులే కారణం. ఇప్పుడు టెట్ పరీక్షలతో వారు ఒత్తిడికి గురౌతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యావిధానంలో కూడా మార్పులు చోటుచేసుకోవడం, నివేదికలు సమర్పించడం వంటి పనులు కూడా వారికి భారంగా మారుతున్నాయి. ఆయా ప్రభుత్వాల విధానాలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ నానాటికి నిర్వీర్యమౌతుంది. పాఠశాలల అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించక పోవడం, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయక పోవడం, మౌలిక వసతులు అవసరమైన స్థాయిలో కల్పించక పోవడం ఈ కోవకుచెందినవే. ఉపాధ్యాయులపై బోధనేతర పనిభారం పెంచుతారు. విద్యార్థుల సంఖ్య తగ్గినప్పుడు దానికి మూల కారణాలను పరిశీలించకుండా పాఠశాలల విలీనాలు చేపడతారు. గత కొన్ని దశాబ్దాలుగా జరుగు తున్న పరిణామాలు అలాంటివే. చివరకు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లోనే నమ్మకం తగ్గే పరిస్థితిని సృష్టిస్తారు. ఆ తర్వాత 'ప్రైవేటు పాఠశాలలకు డిమాండ్ ఉంది' అని చెప్పడం సులభం. కానీ ఆ డిమాండ్ను ఎవరు సృష్టించారు? ప్రభుత్వ విద్యను బలహీనపరిచే విధానాలే కారణం. ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గితే వెంటనే ఆ పాఠశాల అవసరం లేదని నిర్ణయించడం సరైన విధానం కాదు. అసలు విద్యార్థులు ఎందుకు తగ్గారో పరిశీలించాలి. పాఠశాలలో ఉపాధ్యాయులు సరిపోతున్నారా? మౌలిక వసతులు ఉన్నాయా? ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా సదుపాయాలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? పిల్లలకు వ్యక్తిగత శ్రద్ద లభిస్తున్నదా? తల్లిదం డ్రులతో పాఠశాలకు సన్నిహిత సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకకుండా 'పిల్లలు లేరు కాబట్టి పాఠశాల విలీనం' అనడం సమస్యను పరిష్కరించడం కాదు. అది సమస్య నుంచి ప్రభుత్వం తప్పించుకోవడం, ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే ప్రభుత్వ పాఠశాలపై ప్రజల విశ్వాసం పెరుగుతుంది. ఆవిశ్వాసాన్ని పెంచకుండా పాఠశాలల సంఖ్యను తగ్గించడం పరిపాలనా సంస్కరణగా చెప్పుకోవడం వాస్తవాన్ని దాచిపెట్టడమే.