08/09/2024
అవి పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు కావు. కులం పెళ్ళిళ్ళు!
'అరేంజ్డ్ మ్యారేజ్, పెద్దలు కుదిర్చిన పెళ్ళి' అనేది పచ్చి అబద్ధం. వాటిని 'కులం పెళ్ళిళ్ళు' అనాలి.
ఎందుకంటే పెద్దలు కుదిర్చే పెళ్ళి కేవలం కులం లో మాత్రమే జరుగుతాయి. రెండవ పెళ్ళి, ఆలస్య వివాహం, etc., వంటి సందర్భాలలో తప్ప, ఒక్కరు కూడా కులం తో సంబంధం లేకుండా సంబంధాలు వెతకరు.
కులం పెళ్ళిళ్ళు చేసేది కులాన్ని బలపర్చడానికి, కుల సమాజాన్ని బలోపేతం చేయడానికి, స్త్రీలని, వారి లైంగిక స్వేచ్ఛ ని అణచివేయడానికి, తద్వారా పురోహిత భావజాలాన్ని ముందుతరాలకు అందించడానికి మాత్రమే. అందులో ఎటువంటి పవిత్రత లేదు. రాజ్యాంగానికి, కనీస మానవ హక్కులకు వ్యతిరేకం ఈ కులం పెళ్ళిళ్ళు! ఇంతటి దిక్కుమాలిన వ్యవస్థకి పెట్టిన పవిత్రమైన పేరే "అరేంజ్డ్ మ్యారేజ్ - పెద్దలు కుదిర్చిన పెళ్ళి".
అసలు పెళ్ళి అంటేనే ప్రేమతో మొదలయ్యేది. ప్రేమ లేని నాడు అంతమయ్యేది. కాబట్టి ప్రత్యేకంగా ప్రేమ వివాహం అని చెప్పడం సరికాదు! నా దృష్టిలో ప్రేమ వివాహానికి అసలైన పేరు కేవలం ‘పెళ్ళి’ లేదా వివాహం అనాలి! It should be called a Marriage. Not love marriage.
ఇద్దరు కలిసి బ్రతకడానికి మూడోవాడు ముహూర్తం పెట్టడమేమిటి? పెళ్ళి అంటే - కేవలం ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారం. అందులో మూడోవారి పాత్ర చాలా అనవసరం. కుటుంబమైనా, స్నేహితులు అయినా ఆ జంట నిర్ణయాన్ని గౌరవించటం, వీలుంటే తోడ్పడటం, లేకుంటే మనకున్న అభ్యంతరాలు - సలహాలు సూచించటం వరకే పరిమితం కావాలి. ఇద్దరు కలిసి బతకడానికి మూడో వాడు ముహూర్తం పెట్టడం నాకైతే జగుప్సాకారంగా అనిపిస్తుంది.
ఎస్.సీ., ఎస్.టీ లు మాత్రం కులాంతర వివాహాలు చేసుకోవాలి అనుకున్నప్పటికీ అవతల వారు ముందుకు రావడం అరుదు కాబట్టి తప్పక వారి కులంలోనే పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తుంది. డబ్బులు ,పలుకుబడి, పేరు, ఉంటే కులం సంబంధం లేదు అని కామెడీ కహానీలు చెప్పకండి. వేల సంఖ్యలో కేసులు చూపిస్తా! ఎక్కడో దాకా ఎందుకు? నేను కులాంతర వివాహం చేసుకొని 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా అంగీకారం లేదు.! ఎస్.సీ., ఎస్.టీ లని తిరస్కరించడానికి ఎక్కడలేని వ్యక్తిత్వ హననాలు చేస్తారు. అవే కంప్లైంట్స్ పెద్ద కులపోలు మీద ఉంటే అవి అలంకారాలు!
రిజర్వేషన్లు వద్దు అని నొక్కి చెప్పే ప్మేధావులు - దేశభక్తులు మొదలు కులం వద్దు అని చెప్పి… మూడో వాడి దగ్గర ముహూర్తాలు పెట్టించుకోవడం ఆపి, కులం పెళ్ళిళ్ళు కాకుండా… కేవలం “పెళ్ళి” చేసుకోవాలి!
గమనిక: పెళ్లి చేసుకుంటేనే జీవితం అని నేను చెప్పట్లేదు. అది ప్రతి ఒక్కరి వ్యక్తిగతం. ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే కులరహితంగా చేసుకుంటే మంచిది. మీకు కూడా దేశానికి కూడా అని చెప్తున్నాను. కాదు అంటే… మాది అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పుకోవడం మానేసి, నేను కులం పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పుకోండి.
శ్రీకాంత్ చింతల