16/08/2026
సంస్కృతికి సిరిగంధపు పూత చేనేత!
చీరలెన్నో పేర్లు అన్ని! వాసం అంటే చీర. దానికే కోక, రాసి, కార్పాసము... ఇలా ఎన్నో మారుపేర్లు. కౌశేయం అంటే- ప్రధానంగా పట్టుచీర. క్షామమంటే- నారచీర. వనవాసానికి పోతున్న రాముడికి- 'మందర జాగ్రత్త పెట్టినట్టి నారచీరలను తెచ్చి చేతికిచ్చింది కైక. రాముడెలాగో చుట్టబెట్టుకున్నాడు కానీ, కంకంటి పాపరాజు మాటల్లో 'రంగారు బంగారు చెంగావులు ధరించే' జనక మహీపతి కూతురు కదా! సీతకు కట్టుకోవడం చేతకాలేదు. రాముడే 'తానుగా కదియుచు పట్టుచీరపయి కట్టెను సీతకు నారచీరలన్' అన్నారు కల్పవృక్షంలో విశ్వనాథ. ఆ ముతకచీరలను చూస్తూనే, అరుంధతికి కోపం వచ్చింది. 'తూకము అయిదుమళ్లు, తొమ్మిది మూరల నారచీర కట్టినావె సీతకు! ఆమె మోయలేదు, అందు మున్గియపోవు. కాళ్లకు అడ్డము పడి కదలలేదు' అని కన్నీళ్లు పెట్టుకుందట! ఆ బరువెంతో తెలిస్తే తప్ప, 'పదహారు మడతల సిందూర వర్ణపు చీరెను అగ్గిపెట్టెలో ఎగుమతి చేసిన ఖ్యాతి తనది' అంటూ సిరిసిల్ల ఘన చరిత్రను వర్ణించిన కవి వంశీకృష్ణ ఆవేదన అర్థం కాదు. ఆత్రేయ చెప్పిన - గాలిలోన తేలిపోయే జిలుగువెలుగుల 'చీరశిల్పం' గొప్పదనం తెలియదు.
తయారీ సంగతి సరే, చీర కట్టుకోవడం చాలా సొగసైన కళ. పట్టు చీర కట్టుబడి మరీను. బుటా అందం, కొంగు జరీ కళ్లకు కట్టేలా- పట్టుచీరను కట్టుకోవడం అందరికీ పట్టుబడే విద్యకాదు. 'పట్టుచీర కట్టుకున్న పుత్తడిబొమ్మ! నీ కట్టుబడికి తరించింది పట్టుపురుగు జన్మ' అని ఊరికే అనలేదు. మరి వేటూరి! ఆ ఒడుపు తెలిసిన అతివ- నేవళీకంగా చీరకట్టి, వెడల్పు అంచును కాలిబొటనవేళ్లతో విలాసంగా ఎగరేస్తూ ఎదురొస్తే- నడిచొస్తున్న శ్రావణ లక్ష్మిలా తోస్తుంది. అందుకే చీరలంటే స్త్రీలందరూ అంతగా ఇష్టపడతారు. బీరువా తెరవగానే - కాళ్లమీద పడిపోయేటన్ని తెచ్చి, మధ్యలో కలరా ఉండలు ఉంచి దాచి పెడతారు. చీర భారతదేశ సాంస్కృతిక విశేషం. చరిత్రకు ప్రతీక. సంప్రదాయ సూచిక. 'నేనొక ప్రత్యేకమైనదాన్ని' అనే గర్వ వీచికను స్త్రీలో రేకెత్తించే అద్భుత మంత్రదండమది! చీర- స్త్రీలకు సౌభాగ్య సౌందర్య చిహ్నం! దాని కొంగుమాటున దాగే వారందరూ "తల్లి చాటు బిడ్డలే!"
పుట్టిననాటినుంచీ అడవుల్లోనూ, మునులతోనూ గడిపిన రుష్యశృంగుణ్ని తమదేశానికి తీసుకెళ్లామని వచ్చారు విలాసినులు. 'ఇవి అపూర్వంబులైన వల్కలములు(చీరలు) అనుచు వారి పట్టు పుట్టంబులను' పదేపదే తాకుతూ ఆనందపడిన ఆయన అమాయకత్వాన్ని రామాభ్యుదయంలో అయ్యలరాజు రామభద్రుడు వర్ణించాడు. అంటే, ఆ స్త్రీల ఆకర్షణ సైతం ఆ చీరల అందం ముందు వెలవెలబోయిందని! కొనే ముందు స్త్రీలంతా గమనించాల్సిందేమంటే- చీరవల్ల తమలో ఆత్మవిశ్వాసం పెరగాలి. కట్టిన తీరువల్ల చీరకు అందం రావాలి. ప్రతిచీర- స్త్రీ మనోభావాన్ని, అభిరుచిని ప్రతిబింబించాలి. ఆమె హృదయాన్ని అలా లోకానికి ఆవిష్కరించే చేనేత కార్మికుల జీవితాలు మటుకు శిథిలమైపోతూండటం విషాదకరం. '22 అంగుళాల జీవితాకాశం మీద నేసిన నూతన వస్త్రాన్ని వెన్నెల చాపంలా ఆరెయ్యడం' తెలియని బడుగు బతుకులే అయినా, కళాకౌశలం మాత్రం ఎన్నటికీ వన్నె తగ్గదని- సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్ నిరూపించారు. 5.5 మీటర్ల చీరను కేవలం రెండున్నర గంటల్లో నేసి- ఒక అగ్గిపెట్టెలో ఇమిడ్చారాయన. 'మానవుడే మహనీయుడు' అని ఊరికే అన్నారా ఆరుద్ర!