Telangana JAC

Telangana JAC Telangana Joint Action Committee Official Page.

విద్యుత్ సరఫరా...అప్పుడు...ఇప్పుడు...******************ఈ రోజు అత్యధిక విద్యుత్ డిమాండు 10097 మెగావాట్లు...గత సంవత్సరం ఇద...
05/05/2024

విద్యుత్ సరఫరా...
అప్పుడు...ఇప్పుడు...
******************
ఈ రోజు అత్యధిక విద్యుత్ డిమాండు 10097 మెగావాట్లు...
గత సంవత్సరం ఇదేరోజు అత్యధిక డిమాండు 8073 మెగావాట్లు...
అంటే గత సంవత్సరం కన్నా 25% ఎక్కువ...
ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా...
******
అయినా రాష్ట్రమంతా విద్యుత్ కోతలంటూ మనోడు బస్సుయాత్రలో గగ్గోలు పెడుతుండు...!
**********
చింత చచ్చినా...
అబద్దాలు చావలేదు...
**********
నిజాలు చెబితే మనోడి తల వెయ్యివక్కలైతదని శాపమున్నట్టుంది...!!
**********

https://youtu.be/k_fSBgQHKhA?si=ow3tMftNQHh2uHeM
13/04/2024

https://youtu.be/k_fSBgQHKhA?si=ow3tMftNQHh2uHeM

ాళేశ్వరం- కేసీఆర్ 6అబద్దాలు! కంచర్లరఘు వ్యాసంపై జర్నలిస్ట్ రఘు విశ్లేషణ | Journalis...

కాళేశ్వరం ప్రాజెక్టు: కుంగింది నాలుగు పిల్లర్లు మాత్రమే కాదు...అబద్దాల పునాదులు కూడా!************(పూర్తి వ్యాసం)********...
10/04/2024

కాళేశ్వరం ప్రాజెక్టు: కుంగింది నాలుగు పిల్లర్లు మాత్రమే కాదు...అబద్దాల పునాదులు కూడా!
************
(పూర్తి వ్యాసం)
************
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన తరువాత గత పాలకులనుండి, వారిని సమర్ధించే పెద్దమనుషుల నుండి ప్రతీ రోజూ వింతైన వాదనలను, ఆరోపణలనూ మనం వింటున్నాం...ఉద్దేశ్యపూర్వకంగానే కొత్త ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తున్నదని వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలనుండి, ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తీవ్రమైన అవకతవకలనుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి… ప్రజలను ఒక గందరగోళంలోకి నెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవి. గత పాలకుల వాదనలపై ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ క్రింది ప్రధానమైన వాదనలపై, ఆరోపణలపై ఒక స్పష్టత అవసరం. ఇవి అర్దమైతే గత పాలకులు చేస్తున్న అనేక వాదనలు ఎంత ఆర్దరహితమో అవగతమౌతుంది:
1. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగినవి నాలుగు పిల్లర్లు మాత్రమే. ఇది చాలా చిన్న సమస్య.
2. కాళేశ్వరం ప్రాజెక్టంటే కేవలం మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు... అదో పెద్ద వ్యవస్థ...అందులో మేడిగడ్డ ఒక చిన్న భాగం మాత్రమే...
3. ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీని కొట్టుకుపోయేలా కుట్ర చేస్తున్నది.
4. మేడిగడ్డ బ్యారేజీ కుంగినా నీళ్ళను ఎత్తిపోయడానికి ఇబ్బందేమీ లేదు. ఈ ప్రభుత్వానిది అవగాహనా రాహిత్యం.
5. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 45 లక్షల టన్నుల నుండి 3 కోట్ల టన్నులకు పెరిగింది.
6. ప్రాజెక్టు అవినీతిపై కాగ్ నివేదికను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారికి సాంకేతిక పరిజ్ఞానం ఉండదు.

ఒక్కో వాదనను విపులంగా చూద్దాం.
1. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగినవి నాలుగు పిల్లర్లు మాత్రమే. ఇది చాలా చిన్న సమస్య:
“మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలో సుమారు 200 పిల్లర్లు ఉన్నయ్...అందులో కుంగింది నాలుగంటే నాలుగు పిల్లర్లు... ఈ మాత్రానికే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు ముప్పు వచ్చినట్టు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నది...”. ఇదీ గత పాలకుల వాదన.
మేడిగడ్డలో కుంగినవి నాలుగు పిల్లర్లే కావచ్చు. కానీ ఇది ఎందుకు తీవ్రమైన సమస్యనో వివరంగా చూద్దాం.
i. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఏటా ఎత్తాల్సిన మొత్తం 215 టి‌ఎం‌సి ల నీళ్ళలో, 195 టి‌ఎం‌సి లు కేవలం మేడిగడ్డ నుండే ఎత్తాలి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కావాల్సిన 90% నీరు మేడిగడ్డనుండే రావాలి. అందుకే మేడిగడ్డను కాళేశ్వరం ప్రాజెక్టుకు “గుండెకాయ” అని పిలుస్తారు. అలాంటి మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పియర్లు (వాడుకలో జనం “పిల్లర్లు” అని పిలుస్తారు) 21 అక్టోబర్, 2023 నాడు కుంగి, క్రాకులిచ్చినయ్. ఇలాంటి పరిస్థితుల్లో నీళ్ళు నిలువ చేస్తే బ్యారేజీకి మరింత ప్రమాదమని కేంద్ర నిపుణుల బృందం హెచ్చరించింది. దీంతో ఆ బ్యారేజీలో నీళ్ళను నిలువచేయడం లేదు. దీనికి రిపేర్లు చేసి మళ్ళీ వినియోగంలోకి తీసుకురావాలి. అప్పటిదాకా ఒక్క చుక్కా ఎత్తే అవకాశం లేదు. అంటే కాళేశ్వరం “గుండెకాయ” ఆగినట్టే... సమస్య చిన్నదెలా అవుతుంది?


ii. మేడిగడ్డ బ్యారేజీని మొత్తం 8 బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకులో సుమారు 10-11 పియర్ల చొప్పున, మొత్తం 85పియర్లు ఉన్నాయి. ఏ ఒక్క పియర్ లో సమస్యలు తలెత్తినా, కనీసం ఆ బ్లాకులోని మొత్తం పియర్లను తొలగించాల్సిందే... అంటే ఇప్పుడు కుంగిన 7 బ్లాకులో ఉన్న 12 పియర్లను తొలగించి, మళ్ళీ కట్టాలి. ఈ కాంక్రీట్ పియర్లను తొలగించడం అంత ఈజీ కాదు. బాంబులు పెట్టి పేల్చేసి తొలగిస్తే మొత్తం బ్యారేజీ కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి “డైమండ్ కట్టింగ్” ద్వారా నెమ్మదిగా ఈ పియర్లను జాగ్రత్తగా తొలగించాలి. కాబట్టి ఈ పియర్లను కట్ చేసి పునర్నిర్మించడానికి కొన్ని నెలల సమయం పడుతుంది.

iii. మేడిగడ్డ పియర్లు కుంగడం మరింత తీవ్రమైన సమస్యఅయ్యే అవకాశం ఉంది ... ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజీ కట్టినచోట ఇసుక లోతు ఎక్కువగా ఉంది. నదీగర్భంలో గట్టి రాయి తగిలిన దగ్గరి నుండీ కాంక్రీటు పునాదులు నిర్మించాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ బ్యారేజీని ఇసుకపైనే నిర్మించారు. అంటే మొదటగా నదికి అడ్డంగా ఇసుకపైనే ఈ ఒడ్డు నుండి ఆవలి వడ్డు వరకు 1625 మీటర్ల పొడవు, 110 మీటర్ల వెడల్పు, సుమారు 2.50 మీటర్ల మందం ఉన్న ఒక కాంక్రీటు బేసుమెంట్ (Raft-రాఫ్ట్ అని పిలుస్తారు) నిర్మించారు. ఈ మొత్తం బేసుమెంటును ఒకే నిర్మాణంలా (Monolithic) ఎక్కడా ఎలాంటి గ్యాపు లేకుండా నిర్మిస్తారు. ఈ బేసుమెంటు పైననే మొత్తం పియర్లను నిర్మిస్తారు. ప్రతీ రెండు పియర్ల మధ్యలో గేట్లు పెట్టి పై నుండి వచ్చే నీటిని నియంత్రించడం జరుగుతుంది. ఈ పియర్లపైనుండి నదిని దాటడానికి ఒక రోడ్డు బ్రిడ్జ్ కూడా నిర్మించారు.

మరి ఇసుక మీద బేసుమెంటు ఉంటే, పైన గేట్లు వేసినప్పుడు కింద నుండి నీరు వెళ్ళి ఇసుక కొట్టుకు పోయి బ్యారేజీ కుంగుతుంది కదా...? అని అనుమానం రావచ్చు. ఇలా ఇసుక కొట్టుకు పోకుండా బేసుమెంటుకు రెండు వైపులా కిందికి, నిట్టనిలువుగా సుమారు 10 మీటర్ల లోతు వరకు గోడలను కడతారు. ఈ గోడలను “కట్-ఆఫ్-వాల్స్” (Cut-off-Walls) అంటారు. ఈ “కట్-ఆఫ్-వాల్స్” ను “సీకెంట్ పైల్స్” (Secant Piles)తో నిర్మిస్తారు. సీకెంట్ పైల్స్ అంటే గుండ్రటి పిల్లర్లు. ఈ సీకెంట్ పైల్స్ ను ఒకదానిని మరొకటి ఆనుకునే విధంగా నిర్మించడం ద్వారా బేసుమెంటుకు రెండువైపులా “కట్-ఆఫ్-వాల్స్” నిర్మాణం చేస్తారు. ఇసుకకు పైన బేసుమెంటు, రెండువైపులా “కట్-ఆఫ్-వాల్స్” ఉంటాయి కాబట్టి మధ్యలో ఉన్న ఇసుక నదీ ప్రవాహానికి ఎటూ కొట్టుకుపోకుండా ఉంటుంది.



ఇక మేడిగడ్డలో జరిగిందేమిటి? పియర్ల కింద నిర్మించిన బేసుమెంటు ఒక చోట మీటరున్నర మేరకు కుంగింది. బేసుమెంటు కుంగడంతో బేసుమెంటు పైన ఉన్న నాలుగు పియర్లు కూడా కుంగి క్రాకులు వచ్చాయి. పియర్లు కుంగడంతో పైన ఉన్న రోడ్ బ్రిడ్జ్ కూడా కుంగింది. (మనకు మేడిగడ్డ ఫోటోలలో కుంగినట్టు కనబడుతున్నది ఈ బ్రిడ్జే). ఇక్కడే అసలు విషయం ఉంది. కుంగిన బేసుమెంటు మొత్తం ఎలాంటి గ్యాప్ లేకుండా ఇసుకపై నిర్మించిన కట్టడం. ఇది కుంగిందంటే కేవలం ఆ రెండు పిల్లర్లకే కాదు, ఇతర బ్లాకుల్లోని మిగతా పియర్లకూ సమస్య వ్యాపించే అవకాశాలను తోసిపుచ్చలేము. అయితే ఈ క్రాకులు మిగతా పియర్లలో ఇప్పుడే బయటకు కనబడక పోవచ్చు. కానీ మిగతా పియర్లకు కూడా అంతర్గతంగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రిపేర్లు ఒక బ్లాకులోని పియర్లకే కాకుండా, కింద ఉన్న బేసుమెంటుకు, మరిన్ని పియర్లకు చేయాల్సి రావచ్చు. అప్పుడు బ్యారేజీ రిపేర్ల సమయం మరింత పెరుగుతుంది.
iv. మరొక సమస్య... అసలు బేసుమెంటు ఎందుకు కుంగింది. అంటే ఒకే ఒక కారణం కిందనున్న ఇసుక కొట్టుకుపోవడమే. ఇసుక కొట్టుకు పోయిందంటే బేసుమెంటుకు రెండు వైపులా కట్టిన సీకెంట్ పైల్స్ లో సమస్య ఉన్నట్టే... సీకెంట్ పైల్స్ తో కట్టిన కట్-ఆఫ్-వాల్ కొంత భాగం విరిగి, దాని నుండి నీరు ప్రవేశించి బ్యారేజీ కిందనున్న ఇసుకను తొలగించింది... మరి సీకెంట్ పైల్స్ ఎందుకు విరిగినట్టు? దీనికి కారణం కేవలం నిర్వహణ వైఫల్యమేనా...? లేక డిజైన్ వైఫల్యం కూడానా? బ్యారేజీ కుంగిన వెంటనే వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (NDSA) కమిటీ ఇది సీకెంట్ పైల్స్ డిజైన్ వైఫల్యం అని ప్రాధమికంగా అంచనా వేసింది. మేడిగడ్డ బ్యారేజీతో పాటు ఇతర బ్యారేజీలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన నిపుణుల కమిటీ అధ్యయనంలో పూర్తి వివరాలు బయట పడతాయి. వారి సిఫార్సులను బట్టి రిపేర్లకు పట్టే సమయం ఆధారపడుతుంది. నిజంగానే డిజైన్ వైఫల్యం అయితే రిపేర్లకు చాలా సమయం పడుతుంది.

v. మరొక కీలకమైన విషయం. మేడిగడ్డ, అన్నారం పంపుహౌజులు జూలై, 2022 లో మునిగిపోయాయి. ఈ ప్రమాదం జరిగిన తరువాత రాష్ట్ర నీటిపారుదల శాఖ కేంద్ర జల సంఘానికి (Central Water Commission-CWC) ఈ వివరాలు పంపుతూ సలహా కోరింది. అప్పుడు CWC మొత్తం బ్యారేజీల, పంపుహౌసుల నిర్మాణాలపై, వాటి భద్రతపై అనేక కీలకప్రశ్నలను లేవనెత్తింది. బ్యారేజీల స్థలం ఎంపికలో, నిర్మాణాలలో అనేక తప్పులను వేలెత్తి చూపించింది. ఇదే అభిప్రాయాన్ని ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా వెలిబుచ్చితే, మొత్తం బ్యారేజీ భవిష్యత్తే ప్రశ్నార్ధకమౌతుంది. ఒకవేళ కేవలం రిపేర్లకే పరిమితమైనా, ఖర్చు తడిసి మోపెడవుతుంది.
కాబట్టి ప్రస్తుత సమస్య కేవలం మేడిగడ్డకే పరిమితం అనుకున్నా, సమస్య చాలా తీవ్రమైనదని అర్దమౌతున్నది.

2. కాళేశ్వరం ప్రాజెక్టంటే కేవలం మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు... అదో పెద్ద వ్యవస్థ...అందులో మేడిగడ్డ ఒక చిన్న భాగం మాత్రమే...
ఇక్కడ గత పాలకుల వాదన ఈ విధంగా ఉంది. “ఒక్క మేడిగడ్డకు సమస్య వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకే సమస్య వచ్చినట్టు కాదు... కాళేశ్వరం ప్రాజెక్టంటే కేవలం మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు... అదో పెద్ద వ్యవస్థ... అందులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంపు హౌజులు, 19 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు ....”. వీళ్ళ ఉద్దేశ్యం సమస్య కేవలం మేడిగడ్డ పరిమితం... మిగతా అంతా సవ్యంగా ఉంది అని చెప్పడం...కాబట్టి మేడిగడ్డ సమస్యను పట్టించుకొనవసరం లేదు.
నిజంగా వీళ్ళు చెబుతున్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టులో సమస్య కేవలం మేడిగడ్డకే పరిమితమైందా? మేడిగడ్డ బ్యారేజీ కుంగక ముందే కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక తీవ్రమైన సమస్యలు వచ్చాయి. అవేంటో చూద్దాం...

i. దెబ్బతిన్న మూడు బ్యారేజీల ఆప్రాన్ లు, సిమెంటు కాంక్రీటు బ్లాకులు:
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణం 2019లో పూర్తయ్యింది. అదే ఏడాది నవంబరులో వచ్చిన గోదావరి వరదలలో ఈ మూడు బ్యారేజీల ఆప్రాన్ లు, సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు మొత్తం కొట్టుకు పోయాయి. బ్యారేజీలనుండి వరద వేగంగా కిందికి ప్రవహిస్తున్నప్పుడు, బ్యారేజీకి దిగువభాగంలో నున్న భూమి కొట్టుకు పోకుండా ఇవి రక్షణ నిస్తాయి. ఈ ప్రమాదం 2019 లో జరిగితే, ఇప్పటి వరకూ ఎలాంటి రిపేర్లకు ఇవి నోచుకోలేదు. ప్రతీ ఏటా వరదలలో వీటి పరిస్తితి మరింత దిగజారింది. ఈ ఆప్రాన్ లు, సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు బ్యారేజీ రక్షణలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. బ్యారేజీకి వీటి రక్షణ కొరవడినప్పుడు పియర్లకింద వేసిన సీకెంట్ పైల్స్ కు ప్రమాదం ఏర్పడుతుంది. నిజానికి ఈ రక్షణ కవచం దెబ్బతినడమే ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి ఒక ప్రధానకారణమని తెలుస్తున్నది.


ii. దెబ్బతిన్న అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు:
మూడు బ్యారేజీల ఆప్రాన్ లు, సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోవడంతో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతోపాటు, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల కింద నీటి బుంగలు ఏర్పడ్డాయి. ఈ బుంగలు బ్యారేజీ కిందనుండి ఇసుక కొట్టుకుపోవడంతో ఏర్పడతాయి. గత పాలకులు చెబుతున్నట్టు ఇవి లీకేజీలు కావు...మరొక భారీ వరద వస్తే ఈ బ్యారేజీలు కూడా కుంగవనే గ్యారెంటీ లేదు. గత ప్రభుత్వం వీటికి తాత్కాలిక మరమ్మత్తులు చేసి వదిలేసింది.

అయితే మేడిగడ్డ పియర్లే ఎందుకు ముందుగా కుంగాయి? దీనికి ప్రధానకారణం మేడిగడ్డకు ప్రధాన గోదావరి నీళ్ళతో పాటు, ముఖ్యమైన ప్రాణహిత నీటి వరద కూడా తోడవడం అనుకోవచ్చు. సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలకు ప్రాణహిత వరద రాదు. అయితే అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల డిజైన్లు కూడా మేడిగడ్డకు అనుసరించిన డిజైన్లే కాబట్టి ఈ బ్యారేజీలు కూడా మేడిగడ్డ ఎదుర్కొన్న సమస్యనే ఇప్పుడు ఎదుర్కొంటున్నాయి.

iii. మునిగిన మేడిగడ్డ, అన్నారం పంపు హౌసులు:
జూలై, 2022 వరదలకు మేడిగడ్డ, అన్నారం పంపు హౌసులు మునిగాయి. మేడిగడ్డ పంపు హౌసులో రక్షణ గోడ కూలి అనేక మోటార్లు తుక్కు తుక్కుగా మారాయి. దీంతో వందల కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పటికీ కొన్ని మోటార్లకు రిపేర్లు పూర్తి కాలేదు. ఈ మునకకు అప్పటి పెద్దలు చెప్పిన కారణం, “ ఇలాంటి వరద 500 ఏళ్లలో ఎప్పుడూ రాలేదు” అని. ఇది శుద్ద అబద్దం. ఈ పంపు హౌసులను ఉద్దేశ్యపూర్వకంగానే తక్కువ ఎత్తులో కట్టారని చెప్పడానికి అనేక ఆధారాలు ఇప్పటికే లభించాయి. మొదట ఎక్కువ ఎత్తులో ప్రతిపాదించిన డ్రాయింగులు, తదుపరి ఎత్తు తగ్గించి విడుదల చేసిన డ్రాయింగులు బయట పడ్డాయి.




ఇలా ఎత్తు తగ్గించి పంపు హౌసులు కట్టడానికి కారణం, త్వరిత గతిన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పైనుండి పెద్దలు తెచ్చిన వత్తిడా? లేక కాంట్రాక్టరుకు మేలు చేయడానికా? లేక డిజైన్ లోపమా?... అన్న విషయం తెలియాలి. CWC కూడా తెలంగాణ ఇరిగేషన్ శాఖకు 24 మార్చ్, 2023 నాడు రాసిన లేఖలో ఇలా తక్కువ ఎత్తులో పంపు హౌసులు కట్టడాన్ని తప్పు పట్టింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా పనిచేసిన ఒక పెద్ద మనిషి కూడా తాను చేసిన సూచనలను పక్కకు పెట్టి పంపు హౌసులు తక్కువ ఎత్తులో కట్టారని బహిరంగంగానే ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. అంటే భారీ వరదలు వచ్చిన ప్రతీసారి ఈ పంపు హౌసులు మునిగే ప్రమాదం ఉంది. మునిగిన ప్రతీసారి వందల కోట్ల నష్టం తప్పదు.

iv. భూకంప జోన్ లో మల్లన్న సాగర్:
గతంలో ప్రాణహిత-చేవెళ్ళ పధకంలో భాగంగా మెదక్ జిల్లాలో (ఇప్పటి సిద్దిపేట జిల్లా) 1.50 టి‌ఎం‌సిల సామర్ధ్యంతో తడకపల్లి రిజర్వాయర్ ను ప్రతిపాదించారు. ఆ సామర్ధ్యం చాలదని, కాళేశ్వరం ఎత్తిపోతల పధకంలో భాగంగా గతంలో ప్రతిపాదించిన రిజర్వాయర్ ప్రదేశానికి కొంత ఎగువన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను చేపట్టారు. దీని సామర్ధ్యం 50 టి‌ఎం‌సిలు.
50 టి‌ఎం‌సిల నిలువ సామర్ధ్యం అంటే, హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్దనున్న హుస్సైన్ సాగర్ జలాశయం నిలువకు సుమారు 60 రెట్లు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కట్ట పొడవు 22.60 కిలోమీటర్లు. కట్ట ఎత్తు 40 మీటర్ల నుండి 60 మీటర్లు ఉంటుంది. అంటే 15 అంతస్తుల భవనం ఎత్తుతో సమానం. ఈ రిజర్వాయర్ తో సుమారు 20,000 ఎకరాల భూమి నీట మునిగింది. అనేక గ్రామాలు జలాశయంలో మునిగాయి. వందల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.
మల్లన్నసాగర్ జలాశయం దాని అనుబంధ రిజర్వాయర్ల కింద తలపెట్టిన ఆయకట్టు 10.30 లక్షల ఎకరాలు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టు 19.63 లక్షల ఎకరాలు. అంటే ఒక్క మల్లన్నసాగర్ నుండే మొత్తం కాళేశ్వరం ఆయకట్టులో 52.50% ఆయకట్టుకు నీరందాలి. ఈ రిజర్వాయర్ నిర్మాణ ఖర్చు 6126 కోట్లు. ఇంతటి కీలకమైన, భారీ ఖర్చుతో కూడుకున్న రిజర్వాయర్ నిర్మాణం అత్యంత జాగ్రత్తగా జరగాలి. కానీ జరిగిందేమిటి? భారీ రిజర్వాయర్లకు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు పాటించకుండా, హడావిడిగా ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. దీంతో మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన లక్షలాది ప్రజల ప్రాణాలు ముప్పులో పడ్డాయి. ఇదెలాగో చూద్దాం...

మల్లన్నసాగర్ నిర్మాణం అక్టోబర్-డిసెంబర్, 2017 లో మొదలైంది. ఈ రిజర్వాయర్ డిజైన్లు, డ్రాయింగులు తయారు చేసింది తెలంగాణ ఇరిగేషన్ శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనిజేషన్ (CDO). ప్రాధమిక డ్రాయింగులకు ఆమోదం తెలుపుతూ మల్లన్నసాగర్ నిర్మాణ ప్రదేశంలో నేషనల్ జియో ఫిసికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్‌జి‌ఆర్‌ఐ) లాంటి పేరెన్నికగన్న సంస్థలతో భూకంప పరిశోధనలు చేపించాలని ఒక నిబంధన పెట్టింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం నేషనల్ జియో ఫిసికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI)కు డిసెంబర్, 2016, ఆగస్ట్, 2017, అక్టోబర్, 2017 లో లేఖలు రాసింది. కానీ ఎన్‌జి‌ఆర్‌ఐ నివేదికకొసం ఆగకుండా మల్లన్నసాగర్ పనులు డిసెంబర్, 2017 లో కాంట్రాక్టర్ కు అప్పగించింది.

మార్చ్, 2018 లో ఎన్‌జి‌ఆర్‌ఐ తన ప్రాధమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో అనేక కీలకమైన అంశాలను ఎన్‌జి‌ఆర్‌ఐ ప్రస్తావించింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ ప్రదేశంలో భూగర్భంలో మూడు జతల భారీ లీనమెంట్లు (లీనమెంట్లు అంటే భూగర్భంలో భారీ పగుళ్లు) ఉన్నాయనీ... వీటివల్ల మల్లన్నసాగర్ కు ప్రమాదం ఉందని తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ లీనమేంట్లను దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయి భూకంప/భూగర్భ పరిశోధనలు చేయాలని సూచించింది. కానీ ప్రభుత్వం ఈ నివేదికను పట్టించుకోకుండా మల్లన్నసాగర్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. CDO విడుదల చేసిన డ్రాయింగులన్నింటిలోనూ భూకంప పరిశోధనలను చేపించాలని సూచించింది. డ్రాయింగులను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసర్చ్ స్టేషన్ (CWPRS) లాంటి నిపుణులతో వెట్టింగ్ చేయించాలని కోరింది. ఇలా డ్రాయింగులను వెట్టింగ్ చేసినట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదని కాగ్ తన నివేదికలో పేర్కొన్నది.

పై అంశాన్ని కాగ్ తన నివేదికలో ప్రస్తావించింది. దీనికి ప్రభుత్వం స్పందిస్తూ మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను భూకంపాలు తట్టుకునే విధంగా డిజైన్/నిర్మాణం చేశారనీ, పైగా CWPRS అధ్వర్యంలో సూడో-స్టాటిక్ భూకంప విశ్లేషణ చేపించామనీ, ఈ విశ్లేషణలో రిజర్వాయర్ సురక్షితమని తేలిందనీ సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం సరైంది కాదని కాగ్ పేర్కొన్నది. ఎందుకంటే, రాష్ట్ర ప్రభుత్వం చేసినవి NGRI సూచించిన పరీక్షలు కావు. భూకంప పరీక్షలు అక్కడ భూగర్భంలో ఉన్న భారీ పగుళ్లను దృష్టిలో ఉంచుకొని చేయాలి. ఇక్కడ ఇది జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ భారీ లీనమేంట్లను దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయి భూకంప పరీక్షలను ప్రభుత్వం చేయించాలి అని కాగ్ సూచన చేసింది. లేకుంటే భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని కాగ్ హెచ్చరించింది.

ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. “కాళేశ్వరం ఎత్తిపోతల పధకం: రీ ఇంజనీరింగ్ – భారీ ఇంజనీరింగ్ తప్పిదం” అనే పుస్తకాన్ని ఈ వ్యాస రచయిత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టి‌జే‌ఏ‌సి) తరపున 2018లోనే ప్రచురించారు. ఇందులో మల్లన్నసాగర్ భూగర్భంలో ఉన్న భారీ లీనమేంట్ల గురించి విపులంగా వివరిస్తూ, ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సూచనలను పెడచెవిన పెట్టడమే కాకుండా, కొందరు ప్రభుత్వ పెద్దలు “మల్లన్నసాగర్ ఉన్న ప్రదేశంలో గట్టి గ్రానైట్ రాయి ఉందనీ, పగుళ్ళ ముచ్చటే లేదనీ, ఇవన్నీ అవాస్తవాలేననీ బదులిచ్చారు. ఇప్పుడు టి‌జే‌ఏ‌సి చెప్పిందంతా నిజమేనని తేలింది. అప్పట్లో ఈ వివరాలన్నీ టి‌జే‌ఏ‌సి కొందరు సైంటిస్టులతో చర్చించి పై విషయాలు బయటపెట్టింది. ప్రస్తుతం ఆ సైంటిస్టులు చెబుతున్నదేంటంటే, మల్లన్నసాగర్ ఎప్పటికీ 50 టి‌ఎం‌సి ల నీరు నింపడానికి యోగ్యం కాదనీ, ప్రస్తుతం నింపిన 10-15 టి‌ఎం‌సి ల నీటికే ఈ రిజర్వాయర్ చుట్టుపక్కల ప్రాంతాలలో “బాయిలింగ్” (భూపొరలనుండి ఉపరితాళానికి నీరు తన్నుకు రావడం) గమనించామనీ, కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో ఈ రిజర్వాయర్ ను 10 టి‌ఎం‌సిలకు మించి నింపకూడదనీ హెచ్చరిస్తున్నారు. 10 టి‌ఎం‌సిల నీటికి కూడా భూకంప ప్రమాదాన్ని తోసిపుచ్చలేమనీ, కాబట్టి లీనమేంట్లను దృష్టిలో పెట్టుకొని పరిశోధనలను ప్రభుత్వం తక్షణం చేపట్టాలనీ ఈ సైంటిస్టులు సూచిస్తున్నారు.

మల్లన్నసాగర్ కట్ట తెగితే ఏమవుతుంది?
దురదృష్టవశాత్తూ మల్లన్నసాగర్ కట్టతెగితే...? క్షణాల్లో రిజర్వాయర్ లోని నీరు బయటకు తన్నుకు వస్తుంది. రిజర్వాయర్ ను ఆనుకుని ఉన్న కూడలేరు వాగు ప్రవాహమార్గం ద్వారా ఈ నీరు 10 నుండి 15 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ చుట్టుపక్కన ఉన్న గ్రామాలను ముంచేస్తూ ఎగువ మానేరు రిజర్వాయర్ చేరుతుంది. ఎగువ మానేరు రిజర్వాయర్ సామర్ధ్యం కేవలం 2.20 టి‌ఎం‌సిలు మాత్రమే. 50 టి‌ఎం‌సి ల నీరు వేగంగా వచ్చినప్పుడు, ఎగువమానేరు డ్యామ్ కొట్టుకు పోతుంది. ఆ నీరంతా మానేరు నదీ మార్గాన ప్రవహించి మొదట మధ్య మానేరు రిజర్వాయర్ ను, ఆ తరువాత దిగువమానేరు రిజర్వాయర్ నూ పునాదులతో పెకిలించి దారి పొడవూతా భీభత్సం సృష్టిస్తూ, లక్షలాది మంది ప్రజల ప్రాణాలను, వేల కోట్ల రూపాయల ఆస్తులను ముంచెత్తుతూ గోదావరి నదిని చేరుతుంది. 50 టి‌ఎం‌సిల నీరు గంటల వ్యవధిలో గోదావరి నదిని చేరడమంటే మామూలు విషయం కాదు. గోదావరిని కలిసిన తరువాత కూడా ఈ ప్రవాహం సముద్రంలో కలిసే దాకా ఈ విధ్వంసం కొనసాగుతుంది.

మల్లన్నసాగర్ ఉదంతంతో గత పాలకులకు ప్రజల ప్రాణాలపట్ల ఏమాత్రం పట్టింపు లేదన్న విషయం స్పష్టం అవుతుంది.. ఇప్పుడు సమగ్ర భూకంప పరీక్షల్లో ప్రమాదం ఉందని తేలితే? ఇప్పటికే నింపిన 10-15 టి‌ఎం‌సిల నీటికే ప్రమాదం జరిగిఉంటే? పోయే లక్షలాది అమాయక ప్రాణాలకు బాధ్యత ఎవరిది? అంతే కాకుండా వందలాది కుటుంబాలను భూసేకరణ పేరుతో రోడ్డున పడేయడమే కాకుండా వేలకోట్ల రూపాయలు బూడిదలో పోసినట్టుకాదా?

అదృష్టవశాత్తూ పరీక్షల్లో ప్రమాదం లేదని తేలితే...? అప్పటి పాలకులు తీసుకున్న నిర్ణయం సరైనదైపోతుందా? ప్రజల ప్రాణాలతో, ప్రజా ధనంతో జూదం ఆడే హక్కు పాలకులకు ఎవరిచ్చారు? ఇంతటి బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించిన వారిపై కఠినాతి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది...

కాళేశ్వరం ప్రాజెక్టులో పైన పేర్కొన్న లోపాలు మచ్చుకు కొన్ని మాత్రమే... ఇంకా ఏటా కూలుతున్న ప్రధాన కాలువలు, పెచ్చులూడుతున్న సొరంగాలు, మొరాయిస్తున్న పంపులు… కోకొల్లలు. కాబట్టి మేడిగడ్డ సమస్య చిన్నదీ కాదు... అలాగే సమస్య మేడిగడ్డకు పరిమితమూ కాదు... సమస్య మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుది... రెండు పిల్లర్లు రిపేరు చేస్తే సమస్య సమసిపోతుందనే ప్రచారం ప్రధాన సమస్యను పక్కదోవపట్టించడానికే...

3. ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీని కొట్టుకుపోయేలా కుట్ర చేస్తున్నది:
“ఈ ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్లు చేయకుండా కావాలని ఆలస్యం చేస్తున్నది... వచ్చేది వర్షాకాలం... అప్పుడు వరదలొస్తే మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగే ప్రమాదం ఉంది... కాళేశ్వరం ప్రాజెక్టును మూలకు పడేసే కుట్ర ఇది... మేమే అధికారంలో ఉంటే వేలకొద్దీ హిటాచీలను పెట్టి రెండు నెలల్లో మేడిగడ్డను రిపేర్ చేసేవాళ్లం...”

ఈ ఆరోపణల్లో ఎంత నిజముందో చూద్దాం...
మేడిగడ్డ బ్యారేజీ 21 అక్టోబర్, 2023 నాడు కుంగింది. బ్యారేజీ కుంగిన తరువాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (NDSA) నిపుణులు బ్యారేజీని 23-25 అక్టోబర్, 2023 నాడు సందర్శించి 01 నవంబర్, 2023 నాడు ఒక రిపోర్టును విడుదలచేశారు. ప్లానింగు, డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ మొదలైన అంశాలలో వైఫల్యం మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణమై ఉంటుందని వారు తమ ప్రాధమిక నివేదికలో తేల్చారు. పూర్తి వివరాలకై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయించాల్సి ఉంటుందని వారు తమ నివేదికలో పేర్కొన్నారు.

NDSA నిపుణుల నివేదికపై గత పాలకులు భగ్గుమన్నారు. ఈ సందర్భంగా ఈ పెద్దమనుషులు మాట్లాడిన మాటలు గుర్తుకుతెచ్చుకోవాలి:
“ అసలు సమస్య ఏమిటో తెలుసుకోడానికే కనీసం ఆరేడు నెలలు పడుతుంది. అలాంటిది రెండు రోజులలో బ్యారేజీ కుంగుబాటుకు కారణాలు ఇవీ అని నిపుణుల కమిటీ ఎలా తేల్చింది? నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వ పెద్దల రాజకీయ వత్తిళ్లకు లొంగి ఈ నివేదిక ఇచ్చింది...”
“కేవలం స్వతంత్ర నిపుణుల కమిటీ తోనే మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు బయటకు వస్తాయి.”
“ఖర్చులన్నీ కాంట్రాక్టరే భరిస్తాడు. ఈ మేరకు కాంట్రాక్టరే బహిరంగంగా ప్రకటన చేశాడు. ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు...”
“మా నాయకుడే అధికారంలో ఉంటే వేల హిటాచీలు పెట్టి రెండు నెలల్లో మేడిగడ్డ రిపేర్లు పూర్తి చేసే వాళ్ళం...”

పై మాటలతో గత పాలకులకు రెండు విషయాలపై స్పష్టత ఉన్న విషయం మనకు తెలుస్తున్నది. మొదటిది, మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు తెలుసుకోడానికే చాలా సమయం పడుతుందని. వారి మాటలలో ఆరేడు నెలలు పడుతుంది. రెండవది, స్వతంత్ర నిపుణుల కమిటీ పూర్తిస్థాయి దర్యాప్తు ద్వారానే వాస్తవాలు బయటపడతాయి.

అంటే, అసలు సమస్యను గుర్తించడానికే ఆరేడు నెలలు పడితే, ఇక సమస్యను గుర్తించి పూర్తి స్థాయిలో రిపేర్లు చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఇదివరకే చెప్పినట్టు సమస్య కేవలం ఆ 7 వ బ్లాకు లోని 12 పిల్లర్లకా...? లేక మిగతా పిల్లర్లలో కూడా సమస్య ఉందా...? బ్యారేజీ ముందు, వెనుక ఉన్న కట్-ఆఫ్-వాల్స్ పరిస్తితి ఏంటి? CWC ఇప్పటికే చెప్పినట్టు బ్యారేజీ స్థలం ఎంపికే సరిగ్గా జరగలేదా...? అప్పుడు ఏం చేయాలి...? ఎన్‌డి‌ఎస్‌ఏ కమిటీ ప్రాధమిక నివేదిక ప్రకారం డిజైన్ వైఫల్యమే అయితే దానిని పూర్తి స్థాయిలో సరి చేయడం సాధ్యమా...?

సమస్య ఇంత జటిలంగా ఉంటే, మా నాయకుడే ఉంటే, వేలాది హిటాచీలు పెట్టి ఈ పాటికి మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేసి ఉండేవాడు అనడం ఎంత హాస్యాస్పదం...? వీళ్ళ మాటలు నమ్మడానికి తెలంగాణ సమాజం మరీ అంత అజ్ఞానంలో ఉందని వీళ్ళు భ్రమిస్తున్నారా...?

వేల హిటాచీలు అప్పుడేమైనట్టు...?
వేల హిటాచీలు పెట్టి యుద్ద ప్రాతిపదిక మీద రిపేర్లు పూర్తిచేసేవారమన్న పెద్దల నిర్వాకం ఇప్పటికే చూశాం. (హిటాచీలంటే మట్టితీసే యంత్రాలు). నవంబరు 2019 గోదావరి వరదలలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల ఆప్రాన్ లు, సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు మొత్తం కొట్టుకుపోతే నాలుగేళ్ళు దాటినా ఎలాంటి రిపేర్లకు ఇవి నోచుకోలేదన్న విషయం మనకు తెలుసు. బ్యారేజీకి రక్షణ కవచంలా ఉండే ఇవి దెబ్బతినడమే ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి ఒక ప్రధానకారణం. బ్యారేజీలకు ప్రమాదం ఉందని తెలిసీ నిర్లక్ష్యానికి కారణం ఏమిటి...? మరి ఎప్పుడో నాలుగేళ్ల క్రితం బ్యారేజీలకు ఇంత తీవ్ర సమస్య వస్తే ఇప్పటివరకూ ఈ పెద్దమనుషులకు హిటాచీలే దొరకలేదా...? ఇన్ని తప్పులు తమవైపు పెట్టుకొని ఎదుటివారిపై బురద చల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు...

రిపేర్ల ఖర్చు భరించేదేవరు...?
మేడిగడ్డ బ్యారేజీ కుంగగానే అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆఘమేఘాలమీద కాంట్రాక్టర్ల ప్రతినిధులతో రిపేర్ల ఖర్చంతా తామే భరిస్తామనే ప్రకటన ఇప్పించారు. ఎలక్షన్లయిపోగానే కాంట్రాక్టరు ప్లేటు ఫిరాయించాడు. రిపేర్లకు, తమకు ఎలాంటి సంబంధం లేదనీ, “డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్”- అంటే పని పూర్తయ్యాక నిర్మాణంలో ఏదైనా సమస్యలొస్తే రిపేర్లకు అయ్యే ఖర్చు కాంట్రాక్టరే భరించాల్సిన సమయం- అయిపోయిందనీ…, అసలు డిఫెక్ట్ లయబిలిటీ సమయంతో సంబంధం లేకుండా తాము నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్ల ప్రకారమే నిర్మాణం పూర్తి చేశాం కాబట్టి రిపేర్లకు తాము బాధ్యత వహించబోమనీ బాంబు పేల్చారు.

కాంట్రాక్టరు మాట నిజమే అనుకుంటే ఇప్పుడు రిపేర్లకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలన్నమాట. మొదట కాంట్రాక్టరే ఖర్చు భరిస్తాడని చెప్పిన గత పాలకులు ప్రస్తుతం మాట మార్చారు. ఎన్ని వేల కోట్ల రూపాయల ఖర్చైనా ప్రభుత్వం భరించాలనీ, అంత భారీ ప్రాజెక్టులో ఇవన్నీ సర్వ సాధారణమేననీ, గతంలో అనేక ప్రాజెక్టులలో ఇలాంటి సమస్య లొచ్చాయనీ మాట మార్చారు. .

ఇది చాలా తీవ్రమైన విషయం... ఎందుకంటే, కొత్త ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు అమలులో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. పనులు మొత్తం పూర్తయ్యాక “డిఫెక్ట్ లయబిలిటీ సమయం” మొదలైనట్టు ఇవ్వాల్సిన సర్టిఫికేట్, పని పూర్తి కాకుండానే అధికారులు కాంట్రాక్టరుకు ఇచ్చినట్టు అనేక ఆధారాలు లభించాయి. (“డిఫెక్ట్ లయబిలిటీ సమయం” అంటే బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యాక రెండేళ్ళలో బ్యారేజీలో ఏదైనా సమస్య బయటపడితే కాంట్రాక్టరు తన సొంత ఖర్చుతో రిపేర్లు చేయాలి). కాంట్రాక్టు నిబంధనలపై సమగ్ర అధ్యయనం చేయకుండా మొత్తం రిపేరు ఖర్చు ప్రభుత్వమే భరించడమంటే వేలకోట్ల భారం ప్రజలపై పడ్డట్లే. అలా కాకుండా మొదట పని కానిచ్చి, తరువాత బాధ్యత కాంట్రాక్టరుదా...? లేక డిపార్టుమెంటుదా...? అని నిర్ణయిద్దామంటే, ఈ అంశం తేలేదాకా కాంట్రాక్టరు పని మొదలు పెట్టె అవకాశం లేదు. ఈ మొత్తం అంశంలో అనేక న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. ఇవన్నీ సమగ్రంగా విశ్లేషణ చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే 2019 నవంబరులో ఆప్రాన్ లు, కాంక్రీటు బ్లాకులు కొట్టుకుపోయినప్పుడు నష్టం ఎవరు భరించారు?
2019 వరదలకు బ్యారేజీ ఆప్రాన్ లు, కాంక్రీటు బ్లాకులు కొట్టుకుపోయి జరిగిన నష్టం 180 కోట్ల రూపాయలు. “డిఫెక్ట్ లయబిలిటీ సమయం” పూర్తికాలేదు కాబట్టి ఈ ఖర్చునంతా కాంట్రాక్టరే భరిస్తాడని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. రిపేర్ల ఖర్చు 476 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. అయితే బ్యారేజీని ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల ప్రకారమే పనులు చేశాము కాబట్టి, ఈ ఖర్చు తాము భరించబోవడంలేదని కాంట్రాక్టరు ఖరాఖండిగా చెప్పేశాడు. కాంట్రాక్టరే ఖర్చు భరిస్తాడని ప్రభుత్వం చెప్పినా, దీనికి ఎలాంటి ఆధారాలు లేవని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది.

అంటే గతంలో పాలకులు సకాలంలో బ్యారేజీల రిపేర్లు చేయకపోవడం… దాని పర్యవసానంగా బ్యారేజీలు కుంగడం... దానివల్ల పడే భారాలు... టెండరు కండిషన్లు... రిపేర్ల భారం కాంట్రాక్టరు మోయాలా? ప్రభుత్వామా? ఇవన్నీ సంక్లిష్టమైన న్యాయపరమైన అంశాలతో కూడుకున్నవి. తొందరపాటుతో చిన్న తప్పు చేసినా, పాత డ్యామేజీలకు రిపేరు ఖర్చులు, ఇప్పుడు బ్యారేజీల కుంగుబాటు రిపేరు ఖర్చులు, భవిష్యత్తులో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చే రిపేర్లు... అన్నింటిపై దాని ప్రభావం ఉంటుంది...వేలకోట్ల రూపాయల భారాలతో కూడిన అంశం కాబట్టి ప్రభుత్వం ఆచి తూచి అడుగు వేయాల్సి ఉంటుంది.

పై విషయాలన్నింటినీ దాచి, తమ పాలనలో ప్రాజెక్టు నిర్వహణలో చూపిన పూర్తి అశ్రద్ద కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రస్తుత దయనీయ పరిస్తితి దాపురించిందనే విషయం పక్కన పెట్టి, గతపాలకులు ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం అత్యంత జుగుప్సాకరంగా ఉంది.

4. మేడిగడ్డ బ్యారేజీ కుంగినా నీళ్ళను ఎత్తిపోయడానికి ఇబ్బందేమీ లేదు. ఈ ప్రభుత్వానిది అవగాహనా రాహిత్యం.
“మేడిగడ్డ పియర్లు కుంగినా నీళ్ళు ఎత్తిపోయడానికి వచ్చిన సమస్యేమీ లేదు...కొన్ని ఇసుక బస్తాలు నదికి అడ్డంగా వేసి మేడిగడ్డ పంపు హౌసు నుండి నీటిని ఎత్తిపోయవచ్చు...” ఇదీ గత పాలకుల వాదన.

పై వాదన ఎంత ఆర్దరహితమో చూద్దాం...
గోదావరి నదిలో ప్రాణహిత ఉపనది కలిసిన తరువాత మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారు. ఇప్పుడు బ్యారేజీ కుంగడంతో నిపుణుల కమిటీ ఆదేశాల మేరకు అక్కడ నీళ్ళు నిలవ ఉంచడంలేదు. అయితే ప్రాణహిత నుండి వచ్చే నీళ్ళను మేడిగడ్డ పంపు హౌసు వైపు మళ్లించి అక్కడ నుండి ఎత్తిపోయవచ్చనేది వీరి వాదన. మేడిగడ్డ గేట్లు ఎత్తే ఉంటాయి కాబట్టి బ్యారేజీలో నీళ్ళు నిలువ ఉండవు... కాబట్టి మేడిగడ్డ బ్యారేజీపై వత్తిడి ఉండదు. బ్యారేజీకి వచ్చే ప్రమాదమేమీ లేదు. ఇక్కడి వరకూ నిజమే అనుకున్నా అసలు సమస్య మేడిగడ్డ పంపు హౌసు నుండి నీటిని అన్నారం బ్యారేజీలో వేసిన తరువాతనే వస్తుంది.


ఎందుకంటే, మేడిగడ్డ నుండి ఎత్తిన నీళ్ళు మొదట అన్నారంలో నిలువ చేయాలి. అన్నారం గేట్లు మూసి కనీసం 10 మీటర్ల నీటిని అన్నారంలో నిలువ చేస్తే కానీ బ్యారేజీ నీరు పైన ఉన్న అన్నారం పంపు హౌసు వరకు చేరదు. అన్నారం బ్యారేజీ గేట్లు మూస్తే బ్యారేజీపై వత్తిడి పడుతుంది. ఇప్పటికే అన్నారం బ్యారేజీకి భారీ బుంగలు పడి, పియర్లు కుంగే పరిస్తితి ఉంది. NDSA నిపుణుల ఆదేశాల మేరకు అన్నారం బ్యారేజీలో నీటిని నిలువచేయడం కుదరదు. కాబట్టి మేడిగడ్డనుండి నీళ్ళు ఎత్తిపోసినా అన్నారం బ్యారేజీలో నిలువ చేయడం సాధ్య పడదు. నీళ్ళు బ్యారేజీలో నిలువ చేయకుండా అన్నారం పం

అబద్దాల పునాదులు కుంగినయ్...(Part 1/2)***************మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన తరువాత గత పాలకులనుండి, వారిని సమ...
09/04/2024

అబద్దాల పునాదులు కుంగినయ్...
(Part 1/2)
***************
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన తరువాత గత పాలకులనుండి, వారిని సమర్ధించే పెద్దమనుషుల నుండి ప్రతీ రోజూ వింతైన వాదనలను, ఆరోపణలనూ మనం వింటున్నాం...ఉద్దేశ్యపూర్వకంగానే కొత్త ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తున్నదని వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలనుండి, ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తీవ్రమైన అవకతవకలనుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి… ప్రజలను ఒక గందరగోళంలోకి నెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవి. గత పాలకుల వాదనలపై ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ క్రింది ప్రధానమైన వాదనలపై, ఆరోపణలపై ఒక స్పష్టత అవసరం. ఇవి అర్దమైతే గత పాలకులు చేస్తున్న అనేక వాదనలు ఎంత ఆర్దరహితమో అవగతమౌతుంది
*******
https://epaper.v6velugu.com/c/74878489

Address

Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when Telangana JAC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share