04/03/2026
ఇవి ఏవీ ఆయా దేశాల
సొంత సైనిక శిబిరాలు కావు. 80 దేశాల్లో 800 లకు పైగా ఉన్నవి అన్నీ విదేశీ సైనిక శిబిరాలే. అన్నీ అమెరికా సైనిక శిబిరాలు మాత్రమే.
ప్రపంచంలోని మొత్తం195 దేశాల్లో 80 దేశాలు అంటే సుమారు 40 శాతం ప్రపంచం అమెరికా సైనిక శిబిరాల నిఘాలో నిత్యం భద్రత అనే ముసుగులో భయంతో బిక్కుబిక్కు మంటూ మనుగడ సాగిస్తున్నారయని అర్థం చేసుకోవాలి.
ఈ 80 దేశాలు తనకు స్నేహితులని అమెరికా చెప్పుకుంటుంది.
కానీ అది పాక్షిక నిజం మాత్రమే. వాటిలో కొన్ని దేశాలు మాత్రమే అమెరికా మిత్ర దేశాలు. మిగతా దేశాలకు అమెరికాతో రకరకాల అవసరాలు, వ్యాపారాలు, వాణిజ్య లావాదేవీలు సహా అనేక అవసరాలు ఉంటాయి.
ఒక దేశానికి మరో దేశంలో సైనిక శిబిరం ఉండవలసిన అవసరం ఏమిటి?
ఆయా దేశాల
రక్షణ అవసరాల కోసం శిబిరాలను ఏర్పాటు చేశామని అమెరికా చెబుతుంది.
ఎవరి రక్షణ అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్న.
అవి తమ మిత్రదేశాలని, ఆ దేశాల భౌగోళిక రక్షణ కోసం తాము తమ సైనిక శిబిరాలను "స్నేహధర్మం"లో భాగంగా ఏర్పాటు చేసినట్లు అమెరికా చెబుతుంది. ఎనిమిది దశాబ్దాలుగా అమెరికా విదేశీ నీతి, రీతి అర్ధం చేసుకున్న వారికి అది ఎలాంటి "నీతో, స్నేహ ధర్మమో" తేలిగ్గానే బోధపడుతుంది.
తమ భౌగోళిక రక్షణను తామే చేసుకోలేని ఆయుధ సంపత్తి, సాయుధ బలగాలు లేని చిన్న, దేశాలు వాటిలో కొన్ని ఉంటాయి. వాటికి ఇరుగు పొరుగు దేశాలతో విభేదాలు, వైరాలు, శతృత్వం లాంటివి ఉండవచ్చు.
అలాంటి కొన్ని దేశాలు అమెరికాను రక్షణ సాయాన్ని కోరి ఉండవచ్చు. దీంతో అమెరికా అక్కడ శిబిరం ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఇలాంటి స్థితి కొన్ని దేశాలుకు మాత్రమే పరిమితం.కానీ సైనిక శిబిరాలు ఉన్న 80 దేశాల్లో ఆ స్థితే ఉంటుందా? అలాంటిది ఏమీ లేదు.
అమెరికా ఆర్థిక, ఆయుధ శక్తి పట్ల ఉన్న అంతులేని భయంతో శిబిరాల ఏర్పాటును తిరస్కరించలేని ఆ దేశాల అశక్తత మాత్రమే ఇక్కడ నిజం.
ఈ స్థితిని అర్ధం చేసుకో గలిగితే 80 లో చాలా దేశాలు ఒక విధంగా అమెరికాకు
సామంత రాజ్యాలే అని చెప్పాలి.
ఒక దేశం మరో దేశంలో సైనిక శిబిరం ఏర్పాటు చేయడం అంటే ఆ దేశాన్ని శిబిరం ఏర్పాటు చేసిన దేశం ఓడించినట్లుగానే అనుకోవాలి కదా. అలా కాని పక్షంలో శిబిరం ఏర్పాటు చేసిన దేశానికి ఆ దేశం లొoగిపోయినదైనా, లేక ఇతర అవసరాలు ఏవో ఉండి ఉండాలి.
80 యేళ్లక్రితం అమెరికాకు అలా లొoగి పోయిన జపాన్ సంగతిని చూద్దాం.
రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న సందర్భంలో 1945 ఆగస్ట్ ఆరవ తేదీన జపాన్ లోని హీరోషిమా నగరంపై, ఎనిమిదవ తేదీన నాగసాకి నగరంపై అమెరికా అణు బాంబులను ప్రయోగించింది.
అప్పటి వరకు అణు బాంబు ప్రభావం శక్తి ఏమిటో అమెరికాతో సహా ప్రపంచానికి తెలియనే తెలియదు.
మానవ జాతి చరిత్రలో
తొలి అణుబాంబు ప్రయోగాలవి.
వాటి ప్రయోగంతో
క్షణాల్లో లక్షలాది మంది మృత్యువాతన పడ్డారు, లక్షలాది మంది క్షతగాత్రులయ్యారు.రెండు నగరాలు శవాల దిబ్బలతో మరుభూములుగా మారిపోయాయి.
వంద కిలోమీటర్లకు పైగా అణుబాంబు దుష్ప్రభావం విస్తరించి పోయింది. క్షతగాత్రులై
బతికున్న వారు అణు ధార్మికత ప్రభావంతో క్యాన్సర్ లాంటి అనేక ప్రాణాంతకమైన వ్యాధుల భారిన పడ్డారు. రెండు నగరాలు బూడిద కుప్పలుగా మారిపోయాయి.
అప్పటి వరకు అలాంటి మానవ నిర్మిత కృత్రిమ విపత్తును ప్రపంచం చూసి ఉండలేదు.
అలాంటి దుస్ధితిలో అప్పటి వరకు అమెరికా శత్రు శిబిరంలో ఉన్న అణు బాంబు పీడిత, బాధిత జపాన్ దేశం అమెరికాకు పూర్తిగా లొoగిపోవలసి వచ్చింది. అలా తమ దేశంలోమూడు, నాలుగో శిబిరాల ఏర్పాటునకు జపాన్ అంగీకరించి ఉంటుంది.
అలా అప్పటి నుంచి అమెరికాకు జపాన్ ఒక మిత్రదేశంగా మారిపోయిందన్నమాట. అణుబాంబు ప్రయోగంతో ప్రపంచంపై అమెరికా పెత్తనం/ఆధిపత్యం అలా మొదలైందన్నమాట.
అణు బాంబు బూచి
భయంతో అనేక దేశాలు రాత్రికి రాత్రే అమెరికాకు మిత్ర దేశాలుగా మారిపోయాయి.
ఇప్పుడు ఇండియా అమెరికాకు అంటకాగుతూ ఉండవచ్చునేమో గాని, నాడు మాత్రం అమెరికాకు మిత్ర దేశంగా లేదు. రష్యా కూటమిలో కూడా లేదు. రష్యాతో ఒకవైపు స్నేహం చేస్తూనే, రెండు అంతర్జాతీయ ముఠాలకు ప్రత్యామ్నాయంగా అలీన దేశాల అంతర్జాతీయ కూటమిని ఒకదానిని ఏర్పాటు చేసింది ఇండియా. అమెరికా, రష్యా అనే రెండు అంతర్జాతీయ ముఠాలకు దూరంగా ఉంటూ ప్రత్యేక విదేశీ అలీన విధానాన్ని అనుసరించే వేదికను నిర్మించింది ఇండియా. ఆ వేదికలో అనేక దేశాలు భాగస్వాములయ్యాయి.
కాగా రష్యా కూటమికి వ్యతిరేకంగా అమెరికా ఆధిపత్యం రోజురోజుకూ విస్తరిస్తూ 80 దేశాల్లో 800 లకు పైగా సైనిక శిబిరాలను ఏర్పాటు చేసుకోగలిగింది. 1990 లో సోవియట్ యూనియన్ కూలి పోవటంతో అమెరికా ఏకపక్ష ఆధిపత్యం పెరిగి పోయింది.
ప్రపంచాన్ని వేలసార్లు సంపూర్ణంగా నాశనం చేయగల అణుబాంబులు ఇప్పటికే అమెరికా వద్ద గుట్టలు గుట్టలుగా పోగుపడి ఉన్నాయి.
1945 నాటి
అణుబాంబు శక్తి, ప్రభావం చూసిన తరువాత పలు దేశాలు వాటి తయారీపై ప్రయోగాలను మొదలు పెట్టి అణుశక్తులుగా తయారయ్యాయి.చాలా దేశాలు వాటి తయారీ, ప్రయోగాల్లో నిమగ్నమై పోయాయి. ఇప్పటి వరకు తొమ్మిది దేశాల వద్ద
అణుబాంబులున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అవి... అమెరికా,రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయిల్, ఉత్తర కొరియా అనే తొమ్మిది దేశాలు.
మొత్తం అణుబాంబుల్లో 90 శాతం రష్యా, అమెరికా అనే రెండు దేశాల వద్దనే ఉన్నాయి. చెరో ఐదు వేల చొప్పున బాంబులు ఈ రెండు దేశాలు వద్ద మాత్రమే ఉన్నాయి. తొమ్మిది దేశాల వద్ద మొత్తం12,000 లకు పైగా అణుబాంబులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అణుబాంబు ప్రభావం, శక్తి అర్ధమైన తరువాత వాటి ప్రయోగాలు,తయారీలపై నియంత్రణ, నిఘా మొదలైంది. దీంతో అనేక దేశాలు రహస్య ప్రయోగాలను మొదలు పెట్టాయి. దీంతో అణు ప్రయోగాలపై నిషేధం విధించబడిoది.
నిషేధ అధికారం వాటికి ఎవరు ఇచ్చారో గాని నిషేధం మాత్రం అమలులోకి వచ్చింది. అమలు కూడ కఠినంగానే ఉన్నది. ఏదైనా దేశం అణు ప్రయోగాలు చేస్తున్నదనే అనుమానం కలిగితే నిషేధ అమలు సంస్థ ఆ దేశానికి వెళ్లి తనిఖీలు చేస్తుంది.
అలాంటి స్థితిలో స్వీయ ఆత్మ రక్షణ కోసం అణుశక్తిని సము పార్జిoచుకునే ప్రయోగాలు చేస్తున్న ఇరాన్ పై ఐదు రోజుల క్రితం అమెరికా, ఇజ్రాయిల్ లు సంయుక్తంగా బీకర దాడిని చేశాయి. అణు ప్రయోగాలు చేస్తున్నదనేది దాడికి చూపుతున్న ఒక సాకు మాత్రమే. అమెరికా ఇజ్రాయిల్ దాడికి ప్రతిగా
ఇరాన్ పరిసరాల్లో ఉన్న పదికి పైగా దేశాల్లోని అమెరికా సైనిక శిబిరాలపై ప్రతి దాడులను మొదలు పెట్టింది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగి పోయాయి. అనేక దేశాలకు క్రూడ్ ఆయిల్ సరఫరాకు కీలక సముద్ర మార్గమైన హెర్మూజ్ జలసంధి నుంచి సరుకు రవాణా స్తంభించి పోయింది.
రష్యా, చైనాలు ఇరాన్ కు మిత్ర దేశాలు అనే సంగతి ఇక్కడ చెప్పుకోవాలి.
ఈ రెండు పెద్ద దేశాలు ఇరాన్ కు మద్దతుగా యుద్ధంలోకి ప్రవేశిస్తే అది మూడవ ప్రపంచ యుద్దానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోయే పెను ప్రమాదం పొంచి ఉంటుంది.
ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు అమెరికాకు తోడుగా యుద్ధంలో పాల్గొంటాయని ఆ దేశాలు ప్రకటించాయి. ఈ స్థితి ఎటు వైపు మలుపు తిరుగుతుందో , ఐదు రోజులు క్రితం మొదలైన యుద్ధం ఏ స్థాయికి వెళుతుందో చెప్పలేని స్థితి ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్నది.
యుద్ధం ఎంత కాలం కొనసాగుతుందో, అది ఎక్కడికి దారి తీస్తుందో ఎన్ని దేశాలను యుద్ధంలోకి లాగుతుందో అనే భయాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమౌతున్నాయి.
ఇదీ ఆధునిక, నాగరిక 21 వ శతాబ్దపు ప్రపంచం.