17/06/2026
17/06/26*420/333 రోజుల బైబిలు అధ్యయనము. మత్తయి 28-29.*
*మృతుల పునరుత్ధానము౼ మత్తయి 27: 52-53 అర్ధం చేసుకోవడం ఎలా?*
*మత్తయి 27:52–53* సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేకమంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.
యేసు చనిపోయిన వెంటనే సమాధులు తెరువబడ్డాయి. మృతులైన పరిశుద్ధులు లేచి పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఈ లేఖన భాగంలో మనకు కొన్ని సంశయములు కలగవచ్చు..
1. పునరుత్ధానము నొందిన ఈ పరిశుద్ధులు యేసు కంటే ముందుగా వీరు పునరుత్ధానము నొందారా?
2. ముందుగా పునరుత్ధానము పొందినప్పటికీ మరల సమాధిలోకి వెళ్లి మరల ఆయన లేచాక వీళ్ళు ఆయనను అనుసరించి లేచి అనేకులకు కనబడ్డారా? వీటిలో ఏది సంభవించి ఉండవచ్చు.
3. లేఖనాలలో మునుపు మృతులై సజీవులుగా చేయబడిన వారు పునరుత్ధానము చెందిన వారేనా?
వీటన్నింటికి సమాధానము పొందుకోవాలి అంటే ముందుగా లేఖనాలు ఏమి చెబుతున్నాయో జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇక్కడ రచయిత చెప్పిన అసలు ఉద్దేశ్యాన్ని గ్రహించగలము.
మత్తయి సువార్త 52, 53 వచనాలల్లో విషయాలు యేసు మరణించిన తరువాత జరిగిన ఆశ్చర్యక్రియలు, ఆలయపుతెర నడిమికి చిరగడం, బండలు బ్రద్దలు కావడం, భూమి కంపించడం, ఆకాశం నల్లబడడం, మరణం ఓడింపబడడం అన్నీ దేవుని కుమారుని దైవత్వ ప్రకటనకు గుర్తుగా రచయిత వాటిని అన్నింటిని ఒక్కమారుగా ప్రకటించాడు. అంతేకాని ఒకదాని వెంట ఒక్కటి అదే సమయంలో జరిగాయని వ్రాయలేదని గ్రహించాలి. అందుకే దానిని ధ్రువీకరిస్తూ ఆయన లేపబడిన తరువాత వారు లేపబడి పరిశుద్ధ పట్టణములో అనేకులకు కనబడ్డారు అని వ్రాశాడు రచయిత.
మత్తయి 27:54 శతాధిపతియు అతనితో కూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడినిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి.
మొట్టమొదట ఆయన పునరుత్ధానము జరిగిన పిమ్మటే మృతులైన పరిశుద్ధుల పునరుత్ధానము జరిగింది. ఎందుకనగా ఆయనే ప్రధమ ఫలముగా మృతులలో నుండి లేపబడ్డారు అని లేఖనాలు రుజువుపరుస్తున్నాయి. ఆయన మృతిని గెల్చి లేపబడని యెడల, మనము మృత్యువును జయించుట అసాధ్యము.
*1 కోరింథీయులకు 15:20 ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.*
ఆదాము నుండి మానవులకు మరణము సంప్రాప్తమాయెను. అలాగే కడపటి ఆదామైన క్రీస్తు పునరుత్ధానమును బట్టియే మరణము మ్రింగివేయబడి విజయము సంప్రాప్తమయ్యింది. సిలువశక్తిచే యేసు జయోత్సవము చేసిన పిమ్మట జరిగిన మార్పులు, మానవాళి విడుదలను మత్తయి అన్నింటిని కలిపి వ్రాశాడు తప్ప. క్రమాన్ని తప్పి క్రీస్తుకు ముందుగా పరిశుద్ధులు లేపబడ్డారు అని వ్రాయలేదని గ్రహించాలి.
*కొలస్సీయులకు 1:18 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.*
క్రీస్తు మరణం ప్రభావంతో దానికి అనుగుణంగా, సకల పరిశుద్ధులు పాప మరణం నుండి నీతివంతమైన జీవితానికి లేస్తారు. వారు ఆయనతో పాటు దైవిక మరియు ఆధ్యాత్మిక జీవితానికి లేపబడతారు; వారు పరిశుద్ద నగరంలోకి వెళతారు, దాని పౌరులుగా మారతారు (యెహెఙ్కేలు 37:12).
*పునరుత్ధానము ఎందుకు?*
క్రీస్తు మృతులలో నుండి లేపబడకపోతే మన విశ్వాసము మృతము. క్రీస్తు మృతులలో నుండి లేపబడుటను బట్టియే, క్రీస్తును విశ్వసించిన మనమనందరం లేపబడి తండ్రితో సహవాసము కల్గియుండుటకు పరమునకు కొనిపోబడుతున్నాము. క్రీస్తు మరణము, పునరుత్ధానము ద్వారా మనము మరణము నుండి జీవములోనికి దాటియున్నాము.
క్రీస్తు లేపబడిన పిమ్మట లేపబడిన పరిశుద్ధులు మనందరం ఒకానొక రోజు ఆయన మహిమతో మేఘారూరుడై వచ్చునప్పుడు మన మృతులైన పరిశుద్ధులను తిరిగి జీవితులుగా పొందుకుంటామనే గొప్ప నిరీక్షణను సూచిస్తోంది. క్రీస్తు పునరుత్ధానుడైనప్పుడు జరిగిన మృతుల పునరుత్ధానము మరల రెండోరాకడ వరకు సంభవించదు.
1 కోరింథీయులకు 15:23 ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రది కింపబడుదురు.
1 థెస్సలొనికయులకు 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.
రెండో రాకడ ఇది క్రీస్తు రహస్య రాకడ నిద్రించిన వారు లేపబడతారు, జీవించియున్న విశ్వాసులు ఎత్తబడి మధ్యాకాశములో ఆయన్ను ఎదుర్కొంటారు. మనము పరలోకతండ్రితో కోల్పోయిన సహవాసము, నిత్య ఆనందము ఇలా తిరిగి పొందుకుంటాము.
1 థెస్సలొనికయులకు 4:16 ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.
1 థెస్సలొనికయులకు 4:17 ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
*మునుపు మృతులైన సజీవులు పునరుత్ధానము చెందారా?*
పాత, క్రొత్త నిబంధనలలో మృతులై ప్రవక్తల చేత, యేసు చేత, శిష్యులచేత మృతినొంది జీవము నొందిన వారు ఉన్నారు. కానీ వీరు తాత్కాలికంగా వారి ప్రియులైన వారికి దుఃఖము కలుగకుండునట్లు సజీవులుగా అప్పగింపబడ్డారు. కానీ వారి కాలం అయిపోయాక మరల మృతులై పాతిపెట్టబడ్డారు. వీరు పునరుత్ధానము చెందిన వారు కారు. అయితే వీరిలోనే క్రొత్త నిబంధన పరిశుద్ధులు క్రీస్తు పునరుత్ధానుడైనప్పుడు వీరు పునరుత్ధానులై యుండవచ్చు. పాత నిబంధన పరిశుద్ధులు పరదైసులో ఉన్నట్లు, వీరిని *ఎఫెసీయులకు 4:8* ప్రకారం ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.
పునరుత్థానంలో యేసు మనకు ఇచ్చిన బహుమతులు - పాప క్షమాపణ, పాపాలకు పరిహారం, నూతన జీవ వాగ్దానం, పరిశుద్దాత్మ తోడ్పాటు, ఆయన మహిమలో పాలుపంపులు.
క్రీస్తునందు మీసహోదరి,
శ్రీదేవి పాల✍🏻