Kanchi Paramacharya Dharmika Seva Trust

Kanchi Paramacharya Dharmika Seva Trust కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

గో రక్షణ - వేద రక్షణ
ఆలయ రక్షణ - ధర్మ రక్షణ విరాళాలు పంపాల్సిన వివరాలు.
(1093)

A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ®

A/C. No : 50200059599164

IFSC Code : HDFC0001753

Branch : HDFC Bank, Kanakapura Raod, Bengaluru

UPI ID : 7259859202@hdfcbank

Gpay/Phone pay/BHIM/freecharge/paytm 7259859202

18/09/2026

ఎన్నడూ అబద్ధం చెప్పనివాడు

ఒక భక్తుడు నేపాల్ లోని పశుపతినాథ్ మందిరానికి వెళ్లి ఒక రుద్రాక్షమాలతో తిరిగొచ్చాడు. పరమాచార్య స్వామివారి ఆశీస్సులతో దాన్ని తను ధరించాలని అనుకున్నాడు. మహాస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు దాన్ని స్వామివారి ముందు ఉంచాడు. దాన్ని స్వామివారి తాకితే తనను అనుగ్రహించినట్టు అనుకున్నాడు.

“దీనితో నువ్వు ఏమి చెయ్యబోతున్నావు?” అని అడిగారు స్వామివారు.

“పెరియవ ఆశీస్సులతో దాన్ని నేను వేసుకుందామని అనుకుంటున్నాను” అని బదులిచ్చాడు.

పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.

“ఇప్పటినుండి నువ్వు అబద్దం చెప్పడం మానివెయ్యగలవా?” అని అడిగారు.

అతను ఆలోచిస్తున్నాడు. “హఠాత్తుగా ఈ ప్రశ్న ఏమిటి?”. కాని తప్పకుండా నిజమే మాట్లాడాలి ఏది ఏమైనా సరే.

“అబద్దాలు చెప్పకుండా ఉండలేను పెరియవ”

“ఏం? ఎందుకు?”

“నేను ఒక బ్యాంకు ఉద్యోగిని. కొద్దిగా అబద్దాలు వాడకుండా రికార్డ్స్ తయారుచెయ్యడం కుదరదు. వాటిని ఎలా తయారుచెయ్యాలో నా పై అధికారులు సూచిస్తారు. నేను కాదనలేను”

స్వామివారు ఆ రుద్రాక్ష మాలను తీసుకుని కాసేపు చేతులతో త్రిప్పుతూ, కొద్దిసేపటి తరువాత, “మరైతే ఎవరు అబద్దం ఆడరో వారికి దీన్ని ఇవ్వు” అని ఆదేశించారు.

అతను ఆశ్చర్యపోయాడు. అక్కడున్న సేవకులతో, “అచ్చంగా నా భార్య సూచించినట్టుగానే జరిగింది” అని అన్నాడు.

ఇతను యాత్ర ముగించుకుని ఆ రుద్రాక్ష మాలతో వచ్చిన తరువాత అతని భార్య అతనితో పూజ గదిలో ఉన్న పరమాచార్య స్వామివారి చిత్రానికి మాలగా వెయ్యమని చెప్పింది.

“పరమాచార్య స్వామివారు చెప్పినట్టే చేస్తాను” అని అతను రుద్రాక్ష మాలను ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే ఆ మాలను పరమాచార్య స్వామివారి చిత్రపటానికి అలంకరించాడు. తన ఇంటిలో ఎప్పుడూ అబద్ధం చెప్పని ఒక వ్యక్తీ ఉన్నారని ఆరోజే అతనికి అర్థం అయ్యింది.

అతని భార్య కోరికను పరమాచార్య స్వామివారు తీర్చారు. ఆమె కోరిక స్వామివారికి ఎలా తెలిసింది? టెలిపతి గురించి అందరకూ తెలిసిందే. కాని ఇది కేవలం గురుభక్తి. తరువాత ఒకసారి ఆ భక్తుని బంధువు ఒకరు దర్శనానికి వచ్చినప్పుడు అతని గురించి గొప్పగా చెబుతూ, “అతనిలో హరిశ్చంద్రుని పార్శ్వము కూడా ఉంది” అని అన్నారు మహాస్వామివారు.

--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#కంచిపరమాచార్యవైభవం

17/09/2026

కలకత్తాలో వేద భవనం

1957లో మద్రాసులోని ఎన్నోర్ దగ్గర్లోని కట్టుపల్లిలో పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్నారు. అప్పుడు నేను కలకత్తాలో నివసిస్తుండేవాడిని. వ్యాపార నిమిత్తమై మద్రాసుకు వచ్చాను. కొద్దిగా సమయం చేసుకొని మహాస్వామివారి దర్శనానికై కట్టుపల్లి వెళ్దామని నిర్ణయించుకున్నాను. ఆరోజు సాయింత్రం మూడుగంటలకే మద్రాసు తిరిగివెళ్ళాలనే ఆలోచనతో ఉదయం పదిన్నరకు కట్టుపల్లి చేరుకున్నాను. అప్పుడు స్వామివారు ప్రాతఃకాల పూజ చేస్తున్నారు. కాని నా మనసంతా మద్రాసుకెళ్ళిపోవాలని ఉంది.

స్వామివారు పూజ అయిపోగానే విశ్రాంతికి వెళ్తూ శిష్యులతో నన్ను భోజనం చేసి ఇక్కడే ఉండమని నాకు చెప్పమని చెప్పారు. సాయింత్రం అయిదు గంటలప్పుడు మహాస్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వడానికి వచ్చారు. దాదాపు ఒక నూటయాభై మంది ఉన్నారు అక్కడ. నన్నే మొదట పిలిచి నేను వెళ్ళడానికి అనుమతి అస్తారు అని భావించాను. కాని చివరిగా రమ్మన్నది నన్నే. అప్పుడు సమయం ఆరున్నర అయ్యింది. అక్కడ ఉన్నది నేను ఒక్కడినే. మహాస్వామివారు నన్ను వారి గదికి పిలిచి నన్ను కూర్చుండబెట్టి నన్ను అడిగిన మొదటి ప్రశ్న “ఉదయం వచ్చినప్పటినుండి తిరిగివెళ్ళడానికి చాలా ఆత్రుతగా ఉన్నావు. అవునా?” అని. నేను నిర్ఘాంతపోయాను. అవును, కాదు అని కూడా చెప్పలేని పరిస్థితి. నా మనస్సును సాంతం చదివేశారు. నన్ను ఆ సాయింత్రం దాకా అక్కడే ఉంచడం వెనుక పెద్ద కారణం ఉంది. మహాపురుషుల అలోచనల వెనుక మానవాళికి చాలా పెద్ద ఉపయోగమే ఉంటుంది.

కలకత్తా నడిబొడ్డున ఒక పెద్ద భవంతిని కొని బెంగాలీ బాలుర కోసం అందులో ఒక సామవేద పాఠశాలను నెలకొల్పాల్సిందిగా స్వామివారు నన్ను ఆదేశించారు. నం. 50, లేక్ అవెన్యు, కలకత్తాలో దక్షిణభారత భజన సమాజం వారు ఇప్పుడు అద్దెకున్నారు. “నువ్వు ఈ భవంతిని కొన్న తరువాత ఆ భజన సమాజం వారు అక్కడే ఉండేలా చూడు” అని ఆదేశించారు. నేను వినయంగా స్వామివారితో అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని నాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పాను. వెంటనే స్వామివారు, “అన్నాదురై అయ్యంగార్ వద్ద యాభైవేలు తీసుకుని వెళ్ళు” అని చెప్పారు. నేను అదే వినయంతో ఆ యాభైవేలు నాకు యాభై కోట్లతో సమానం అని చెప్పి, విరాళాలు సేకరించిన తరువాత ఆ సొమ్మును మఠానికి ఇస్తానని చెప్పాను.

మరుసటిరోజు ఉదయం విమానంలో కలకత్తా చేరిన వెంటనే నేను చేసిన మొదటి పని భూస్వామి శ్రీ అశుతోష్ ముఖర్జీని కలవడం. నేను ఈ విషయం గురించి చెప్పకముందే ఆయనే నాతో, “రాత్రి నాకు కలలో కాళి అమ్మవారు కనిపించి ఆ భవనాన్ని నీకు అమ్మమని ఆదేశించింది. ఇక ఆ పని మొదలుపెడదాము” అని చెప్పారు.

ఇంతకంటే చెప్పడానికి ఇక ఏం ఉంది? పరమాచార్య స్వామివారే కాళి రూపంలో స్వప్నదర్శనం ఇచ్చి ఆ భవనాన్ని అమ్మమని చెప్పారు. మూడు నెలల్లో మొత్తం పని పూర్తి అయ్యింది. “వేద భవనం” పేరుతో ఈనాటికీ సుస్వరమైన వేద ధ్వని ఆ భవంతి నుండి వినవస్తోంది.

--- “కైంకర్య శిరోమణి” డా. యస్.వి. నరసింహన్

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#కంచిపరమాచార్యవైభవం

16/09/2026

దారంతో కట్టిన పూలు

చెన్నై నుండి ఒక భక్తుడు చాలా పూలు తెచ్చి శ్రీమఠంలో ఒక పెద్ద రాశిగా పోసాడు. అందులో చాలా రకాలైన పూలు ఉన్నాయి, గుబురుగా కట్టిన మల్లెదండలు, పరిమళం వెదజెల్లే చాలా రకాలైన రంగురంగు పూలతో కళాత్మకంగా తీర్చిదిద్దిన దండలు ఉన్నాయి. కాని, వాటిని శ్రీచంద్రమౌళీశ్వరునకు అలంకరించడానికి పనికిరావు. ఆ పూలదందలన్నీ దారంతో కట్టబడ్డాయి అరటి బెరడు దారంతో కాదు. శ్రీమఠంలో దారంతో కట్టిన మాలలను చంద్రమౌళీశ్వరునకు అలంకరించరు. ఆ భక్తుని నిరాశ మాటలలో చెప్పలనవి కాదు. అతను చాలా ప్రయాసతో ఆ పూలను తెచ్చాడు కాని ఒక చిన్న మల్లె దండ కూడా అలంకారానికి పనికిరాదు.

పరమాచార్యస్వామి వారు పూజ ముగించుకుని బయటకు వచ్చారు. వెళ్తూ బుట్టలలో ఉన్న పూలను చూసారు.

మహాస్వామి వారు పరిచారకులతో ”వీటిని ఎందుకు పూజకు తీసుకుని రాలేదు?’ అని అడిగారు.

”వాటన్నింటిని దారంతో కట్టారు” అని చెప్పారు.

వాటిని తెచ్చిన ఆ భక్తుడు అక్కడ నిలబడి ఉన్నాడు. తన అజ్ఞానానికి స్వామి వారు ఏమంటారో అని కొంచం ఆందోళనగా ఉన్నాడు. కాని మహాస్వామి వారు కరుణా సముద్రులు.

”దారంతో కట్టిన పూలు స్వామి అలంకరణకు పనికిరావు. కాని నాకు పనికివస్తాయి” అని అన్నారు.

అక్కడున్న భక్తులు ఆనందపడ్డారు. పరమాచార్య స్వామి వారు ఒక చెక్క పీఠంపైన కూర్చున్నారు. తెచ్చిన పూలను మాలలను స్వామి వారికి అలంకరించారు. అది చూడడానికి పూలంగి సేవ లాగా కనపడింది. ఆ దృశ్యాన్ని చూసి భక్తులు ఆశ్చర్యచకితులయ్యారు.

”సాక్షాత్ తిరుపతి వెంకటాచలపతి” అన్నాడొక భక్తుడు.

”సాక్షాత్ తిరుచెదూర్ మురుగన్” అన్నారు మరొకరు.

”సాక్షాత్ కంచి కామాక్షియే” అన్నారింకొకరు.

ఒక వేదాంతి పారవశ్యంతో అన్నాడు. “ఈ ప్రపంచం జగన్ మిథ్య అని చెప్పేవారందరూ ఒక్క క్షణం అలోచించండి. ఈ క్షణం వాస్తవం సత్యం. బ్రహ్మం సత్యం. దేవుడు ఉన్నాడు అన్నది నిజం (సగుణ బ్రహ్మం పరమ సత్యం). దేవుడు గుణాహితుడై పరిపూర్ణ గుణములచేత ప్రకాశించి ఉన్నాడు. పెరియవ... రూపహితుడైన దేవుడు. దైవం మానవ రూపంలో అన్నది నిజం (సగుణం ... సద్గుణం). గుణముల చేత ప్రకాశించువారే శ్రేష్టమైనవారు. పెరియవ సగుణబ్రహ్మం... బ్రహ్మానందం”

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#కంచిపరమాచార్యవైభవం

జయ జయ శంకర !! హర హర శంకర !!పరమపవిత్రమైన ఈ చాతుర్మాస్య సమయంలో జగద్గురువులు కంచి కామకోటి పీఠం ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శ్...
15/09/2026

జయ జయ శంకర !! హర హర శంకర !!

పరమపవిత్రమైన ఈ చాతుర్మాస్య సమయంలో జగద్గురువులు కంచి కామకోటి పీఠం ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు ఉత్తరాధికారి శిష్యులు శ్రీ శ్రీ శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివార్లను దర్శనం చేసుకోవడం జరిగింది.

ట్రస్ట్ తరుపున చేస్తున్న కార్యక్రమాలను, చాతుర్మాస్యం సందర్బంగా చేస్తున్న నిత్య భిక్షావందనాన్ని స్వామివారు మెచ్చుకున్నారు. చాతుర్మాస్య నిత్య భిక్షావందనం చాలా మంచి స్కీం అని చెప్పి మనం సమర్పించిన చెక్కును, రసీదును అంతేవాసులోకరి చేత ఫోటో తీయించారు.

సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారికి నమస్కారం చెయ్యగానే "ప్రవచనం ఎలా జరిగింది?" అని అడగడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. దాదాపు నెల రోజుల క్రితం స్వామివారికి ఈ ప్రవచనం విషయం తెలియజేసాను.

ట్రస్ట్ కార్యక్రమాల గురించి కూడా అడిగారు, ప్రస్తుతం ఏమేమి చేస్తున్నారు? ఇంకా ఏమేమి చెయ్యాలనుకుంటున్నారు అని ఎంతో ప్రేమతో మాట్లాడారు.

ట్రస్ట్ సభ్యుల (దాతలు కాదు మనందరమూ ట్రస్ట్ సభ్యులమే) సర్వోన్నతి కోసం కామాక్షి అమ్మవారిని, జగద్గురువులను ప్రార్థించాను.

15/09/2026

సండూర్ సేవకుడు

హంపి - హొస్పేట్ ప్రాంతంలో ఉన్న సండూర్ సంస్థానం రాజుల ఏలుబడిలో ఉండేది. ఇప్పుడు అది బళ్ళారి జిలాలో భాగంగా ఉంది. సండూర్ సంస్థాన రాజ కుటుంబీకులు శ్రీ కంచి కమకోటి పీఠానికి గొప్ప భక్తులు.

ఒకసారి పరమాచార్య స్వామివారు హొస్పేటలో మకాం చేసినప్పుడు, అక్కడున్న శివాలయంలో నవరాత్రి సందర్భంగా విశేష పూజలు చేస్తున్నారు.

హొస్పేట్ నుండి సండూరుకు ముప్పై కిలోమీటర్ల దూరం. మహాస్వామి వారి దర్శనం కోసం సండూరు మహారాజు ఆ ముప్పై కిలోమీటర్లు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నడిచి వచ్చారు. వారితో పాటుగా యువరాజు శ్రీ వై. ఆర్. ఘోర్పడే కూడా వచ్చారు.

భక్తుల రద్దీని నియత్రించడానికి కుదరలేదు. చివరకు పోలీసులు కాస్త లాఠీచార్జి చేసినా జనం కదలలేదు. మహాస్వామి వారిని దర్శించి వారు ఆశీస్సులు తీసుకున్న తరువాతనే ప్రజలు అక్కడి నుండి వెళ్లారు.

ఆ పండుగ సందర్భంలో శ్రీమఠం భద్రత కోసం సండూర్ మహారాజు పది మందిని నియమించాడు. ఉదయం పూట ఎదుగురిని, రాత్రి పూట ముగ్గురిని. అలా భద్రత కోసం వచ్చిన ఒక వ్యక్తే శంకర్ శివరాం పవార్.

శ్రీ మఠం మకాం హొస్పేట్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయింది. పది మంది కాపలావాళ్ళలో తొమ్మిది మంది సండూరుకు తిరిగి వెళ్ళిపోయారు. పవార్ మాత్రం వెళ్లలేదు; శ్రీమఠంతోనే ఉండిపోయాడు. శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు మఠంతోనే ఉండిపోమ్మని చెప్పారు.

“నేను ఇక్కడ మహాస్వామి వారి బృందావనం దగ్గర విధులు నిర్వహిస్తాను. నా జీతం సండూర్ నుండి పంపబడుతుంది. సండూర్ మహారాజు కుటుంబ సమేతంగా అప్పుడప్పుడు ఇక్కడకు వస్తుంటారు. వారి మానవడికి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు. అతని పేరు ఏకాంబర్. ఆ పిల్లవాడు ఒకరోజు కంచి తాతను చూడాలని మొండిపట్టు పట్టాడు. వెంటనే మహారాజు గారు ఒక వ్యక్తిని తోడుంచి ఇక్కడకు పంపారు”.

“ఇప్పుటికీ యశ్వంత్ రావు, మహారాణి, యువరాజు ఇక్కడకు దర్శనానికి వస్తుంటారు” అని చెబుతాడు పవార్.

--- శ్రీమఠం సేవకులు. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#కంచిపరమాచార్యవైభవం

14/09/2026

దీనజన పరాయణుడు

విల్లుపురం దగ్గర్లోని ఒక చిన్న పల్లెటూరు. నారికురవ సంచార జాతికి చెందిన ఒక వ్యక్తి కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రైల్వే స్టేషనుకు వచ్చి రైలు పట్టాలకు దగ్గరగా కూర్చున్నాడు. తరువాత వచ్చే రైలు కిందపడి చనిపోవాలని వేచి చూస్తున్నాడు.

కొద్దిసేపటికి నిద్ర వచ్చింది. కలలో ఒక స్వామి వచ్చి ఎదురుగా నిలబడి, “నువ్వు చనిపోవాల్సిన పనిలేదు. వచ్చి నన్ను దర్శించు. నీకు ప్రశాంతత కలుగుతుంది” అని అంతర్ధానమయ్యారు. ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు. శరీరంలో ఏదో సరికొత్త అనుభూతి కలిగింది.

కలలో వచ్చిన సాధువు ఎవరో కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు. ఎంతోకాలంగా తాను వేలికి ధరించిన బంగారు ఉంగరాన్ని ఆమ్మేసి, దాంతో వచ్చిన డబ్బులతో స్వామిని వెతకడం మొదలుపెట్టాడు. ఊరి నుండి ఊరికి అలా ఎన్నో ఊర్లు తిరిగి, ఎందరో సాధువులను చూశాడు. కానీ ఎవరూ కలలో వచ్చిన స్వామితో సరిపోలలేదు. ఎంత నిరుత్సాహపడినా వెతకడం మాత్రం ఆపలేదు.

అప్పుడు పరమాచార్య స్వామివారు వెల్లూరుకు దగ్గర్లోని ఏకాంబరకుప్పం అన్న గ్రామంలో మకాం చేస్తున్నారు. అటువైపుగా వచ్చిన అతను ఒకరోజు సాయంత్రం స్వామివారిని చూశాడు. స్వామివారు ఉన్న స్థలం ప్రవేశద్వారం ముందర నిలబడి, “ఓ సామి! ఈ సామియే ఆ సామి! నన్ను రమ్మని చెప్పావు. రా! బయ్తకు రా!” అని అరుస్తున్నాడు. మహాస్వామి వారు రాజమ్మాళ్ ని పిలిచి, “అతను ఎవరో కనుక్కుని, భోజనం పెట్టు. రేపు ఉదయం అతణ్ణి నేను చూస్తాను” అని చెప్పారు.

రాజమ్మాళ్ అతనివద్దకు వెళ్ళి, “అప్పా, ఎవరు నువ్వు? నీకు భోజనం పెడతాను రా. స్వామి నిన్ను రేపు ఉదయం నీతో మాట్లాడతారు” అని చెప్పింది. “అవును, అమ్మా! నా ఇద్దరు భార్యల్తో గొడవపడ్డాను. మరో అమ్మాయిని చేసుకున్నాను. ఆమె ఒకరోజు నాకు పెట్టబోయే ఆహారంలో విషం కలపడం చూశాను. నేను కలతచెంది జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఈ సామి నా కలలో కనబడి దర్శనం చేసుకోమన్నారు” అని చెప్పాడు.

మరుసటిరోజు ఉదయం స్వామివారు బయటకు వచ్చారు. అతను వెంటనే, “సామి, నువ్వు నా అమ్మలాగా కనిపిస్తున్నావు. చెత్త ఏరుకుంటూ నేను ఇక్కడే నీతోనే ఉండిపోతాను” అని శోకిస్తున్నాడు.

“మీ ఊరికి వెళ్లిపో. ఇక నుండి మీవాళ్లు నిన్ను గౌరవంగా చూసుకుంటారు. నీకు ఎప్పుడైనా కష్టం కలిగితే నన్ను తలచుకో. అంతా సర్దుకుంటుంది” అని ఆదేశించారు స్వామివారు. అతనికి పళ్లను ఇచ్చారు. అక్కడున్న వారి వద్దనుండి డబ్బులు సేకరించి అతనికి ఇచ్చి, ఊరికి పంపారు.

ఈ సంఘటన నాకు పుదుక్కోట్టై రాజమ్మాళ్ చెప్పింది. ఈ సంఘటన జరిగినప్పుడు తిరుచ్చి సుబ్బలక్ష్మి, తిరుచ్చి ధర్మంబాళ్ మరియు ఇతర ఆడువారు కొందరు ఉన్నారు అప్పుడు.

--- రాధా రామమూర్తి, పుదుక్కోట్టై. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#కంచిపరమాచార్యవైభవం

13/09/2026

పెళ్లిరోజు - పరమాచార్య

నా పేరు వెంకటేశన్. మేము తిరుచ్చిలో ఉంటాము. నేనేమీ ఊహ తెలిసిన నాటినుండే పరమాచార్య స్వామివారి భక్తుడను కాను. నేను చెన్నైలో పని చేసేటప్పుడు నెలకు ఒకటి రెండుసార్లు శ్రీమఠానికి వెళ్లేవాణ్ణి. భక్తుల అనుభావల పుస్తకాలు చదవడం కూడా మొదలుపెట్టాను.

ఆ అనుభవాలు పొందిన భక్తులు కొందరు మహాస్వామివారికి అత్యంత సన్నిహితులైతే కొందరు అసలు శ్రీవారి గురించి ఏమీ తెలియని వారు. అటువంటి వారు కూడా స్వామివారి కరుణకు పాత్రులైనారు. ఇక నా విషయానికి వస్తే,

ఒకసారి మా పెల్లిరోజున నేనూ, మా ఆవిడ కలిసి శ్రీమఠంలో వారి సన్నిధానానికి వెళ్ళాము. ఆరోజు ఎదో విశేషమైన రోజు అవ్వడంతో మహాస్వామి వారి బృందావనం వద్ద పెద్ద పూజ జరుగుతోంది. నా భార్య ఒరిక్కై పరమాచార్య స్వామివారి ఆలయానికి వెళ్ళాలని కోరింది. కాని అప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో నేను వద్దన్నాను.

తరువాత మేము అన్నదాన మఠంలో భోజనాదులు ముగించాము.
మేము బయటకు వస్తుండగా ఒక ముసలాయన మమ్మల్ని ఒరిక్కై వెళ్లవలసినదిగా కోరాడు. మేము మఠం నుండి బయటకు రాగానే, ఒక ఆటో డ్రైవర్ మమ్మల్ని పిలుస్తూ, ఒరిక్కై వెళుతున్నాను మిమ్మల్ని అక్కడ వదులుతాను రండి అని చెప్పాడు.

మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో ఒరిక్కై చేరుకున్నాము.

దేవాలయం తలుపులు మూయబడి ఉన్నాయి. అక్కడున్న ఒకాయన మరలా నాలుగు గంటలకే తెరుస్తారు అని చెప్పాడు. మా పెళ్లిరోజు పరమాచార్య స్వామివారి దర్శనం కలగపోవడం నిరాశ కలిగించింది. అక్కడ కూర్చుని స్వామివారిని ప్రార్థించాను.

ఇక చేసేదిలేక తిరిగి వెళ్దామని లేవబోయేంతలో హఠాత్తుగా నీరసంగా అనిపించి ఒక్క అడుగు కూడా వేయలేకపోయాను. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను అని నా భార్యతో చెప్పి నిద్రలోకి జారుకున్నాను. మెలకువ వచ్చి చూసేసరికి, నా భార్య పరమాచార్య స్వామివారి భక్తుడొకాయతో మాట్లాడుతూ ఉంది. పడుహేను నిముషాల తరువాత దేవాలయ అర్చకులు పరుగులాంటి నడకతో వచ్చి, గర్భాలయం తలుపు తెరిచారు.

ఆశ్చర్యపోయి ఇంత త్వరగా ఎందుకు తెరుస్తున్నారని అడుగగా, మహాస్వామివారు ఆయనతో, “దంపతులోకరు నా దర్శనం కోసం కాచుకుని ఉన్నారు. ఈరోజు వాళ్ళ పెళ్లిరోజు. ఆలయం తెరిచి వాళ్లకు ప్రసాదం ఇవ్వు. అందుకే వచ్చాను” అని చెప్పారు.

పరమాచార్య స్వామివారికి ఏమీ తీసుకుని రాలేదని అప్పుడు గుర్తుకు వచ్చింది. నా భార్యతో మాట్లాడుతున్నా ఆయన ఒక పెద్ద తులసిమాలను ఇచ్చారు స్వామివారికి సమర్పించామని.

మహాస్వామివారి అనుగ్రహాన్ని తలచుకుని కన్నీళ్ళ పర్యంతం అయ్యాము. అది మా జీవితాల్లో మరచిపోలేని సంఘటన.

కేవలం మహాస్వామి వారిని ప్రార్థించడమే కాదు, వారు ఉన్నారని మనం నమ్మాలి. ఆయనే తల్లి, తండ్రి, హితుడు, స్నేహితుడు, గురువు, దైవం అన్నీ. శ్రీవారు అంతటా ఉన్నారు. మనలో కూడా ఉన్నారు. స్వామివారి గురించి రాయడానికి మాటలు చాలవు. మనం కోరుకున్నది స్వామివారు ఇవ్వరు, మనకు ఏమి కావాలో వాటిని తప్పక ఇస్తారు.

ఇది చాలా సామాన్యమైన విషయం. ఎప్పుడు మనం పరమాచార్య స్వామివారి వైపు చూస్తామో, అప్పుడు ఆయన మన వైపు చూస్తారు.

--- వెంకటేశన్ సుబ్రమణియన్, కంచి పెరివ ఫోరం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#కంచిపరమాచార్యవైభవం

12/09/2026

పూల కిరీటం – పండిత గౌరవం

సదాశివం సేలంలో నివసించే ఒక బ్రహ్మచారి యువకుడు. మహాస్వామి వారిపై అతనికి ఎనలేని భక్తి. ఒక హోటలు గదిలో అద్దెకు నివసించేవాడు.

సేలంలోని కంచి మఠంలో 1990 లో ఒక పెద్ద హోమం జరిగింది. దాదాపు అరవై మంది వేద పండితులను, విధ్వాంసులను దూరప్రాంతాల నుండి పిలిపించారు. ఆ హోమం పదకొండు రోజుల పాటు జరిగింది. ఆ యాగానికి కావాల్సిన పూలను సర్దుబాటు చెయ్యడం సదాశివం బాధ్యత.

సశాస్త్రీయంగా వైదిక నిష్ఠతో హోమం ముగిసింది. నిర్వాహకుల తదుపరి కర్తవ్యం మరుసటి రోజు ఆ తీర్థ కలశాలను, హోమ రక్షను మహాస్వామి వారికి సమర్పించి వారి ఆశీర్వాదం పొందటం. ముగ్గురు ప్రముఖులతో కలిసి వైదిక పండితులు బృందం మూడు వాహనాల్లో కాంచీపురానికి బయలుదేరారు. మొత్తం హోమానికి పూలను సమకూర్చిన, పూల అలంకారాలు చేసిన సదాశివం కూడా వారితో బయలుదేరాడు. కాంచీపురం వెళ్ళే మార్గమంతా బాగా వర్షం పడుతోంది. కొన్ని గంటల ప్రయాణం తరువాత వారు హోమ భాగాలతో కంచి చేరుకున్నారు.

మహాస్వామి వారిని దర్శించుకుని వారు తెచ్చిన కలశ తీర్థంతో పాటు హోమము భాగములన్నిటిని పరమాచార్య స్వామి ముందు పెట్టారు. వాటిని చూడగానే మహాస్వామి వారు చాలా మహాదానందపడ్దారు. ఎందుకంటే వారికి మాత్రమే తెలుసు జరిగిన ఆ హోమము యొక్క ఫల్ము బలము ఎంతటిదో. మహాస్వామి వారు లోపలికి వెళ్ళి హోమ కలశ నీటిని తీసుకురమ్మన్నారు. వాటిని అందుకుని కొన్ని మంత్రములు చెప్పి తలపై చెల్లుకున్నారు. మరల బయటకు వచ్చి, వారి కోసమని తెచ్చిన ఒక పెద్ద పూలమాలను వారి మెడలో అలంకరించుకున్నారు. తరువాత ఆ పూలమాలతో పాటు తెచ్చిన పూల కిరీటాన్ని చేతిలోకి తీసుకుని దాన్ని కొద్దిసేపు పరిశీలనగా చూసారు. అది చాలా బాగా అలంకరింపబడి ఉంది.

“ఎవరు చేసారు దీన్ని?” మహాస్వామి వారు అడిగారు. వాహనాల్లో వచ్చిన వారు సమాధాన పూర్వకంగా సదాశివం వైపు చెయ్యి చూపించారు. నడుముకు లుంగి చుట్టుకుని పైన ఎర్ర చొక్కా వేసుకున్న అతను గుంపు నుండి ముందుకు వచ్చాడు.

పరమాచార్య స్వామి వారు ఆ పూల కిరీటాన్ని తమ తలపై ఉంచుకుని, పెదవుల పై చిరునవ్వుతో “నాకు బాగా కనిపిస్తోందా?” అని అడిగారు

ఆనందంలో ఏమి మాట్లాడాలో తెలియక చుట్టూ ఉన్నవారు బావుందన్నట్టు తల పంకించారు. పరమాచార్య స్వామి వారికి సాష్టాంగం చేసారు. ఈలోగా సదాశివం తన చొక్కా విప్పి, ముందుకువెళ్ళి మహాస్వామి వారి ముందు నిలుచున్నాడు. శ్రీవారితో ఏమి చెప్పాలో అతనికి తెలియదు. చేతులు కట్టుకుని వారి ముందు నిలబడ్డాడు. కళ్ళల్లో నుండి కన్నీరు ఉబికి వస్తూ ఉంది. పరమాచార్య స్వామి వారు వారి తలపై నుండి ఆ పూల కిరీటం తీసారు. సదాశివాన్ని చూసి చిన్నగా నవ్వి, కొద్దిగా ముందుకు వొంగమన్నారు. వెంటనే తమ చేతులలో ఉన్న ఆ కిరీటాన్ని అతని తలపై ఉంచారు. అహా ఎంతటి అదృష్టం !!

అక్కడున్న వారందరికి తన్మయత్వంతో ఒళ్ళు పులకరించింది. అప్పటి దాకా పండితులు, విద్వాంసులకు మాత్రమే మహాస్వామి వారు తమ స్వహస్తాలతో పూల కిరీటం పెట్టి గౌరవించేవారు.

బహుశా తనను పూలతో ఇలా ఆరాధించి పూజిస్తున్న ఇతనికి కూడా ఆ గౌరంవం ఇవ్వాలని స్వామివారికి అనిపించిందేమో !!!

--- ఆర్. వెంకటసామి, శక్తి వికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#కంచిపరమాచార్యవైభవం

11/09/2026

ఆకలి - అమృతం

తంజావూరు జిల్లాలోని సేతినిపురం అన్న చిన్న గ్రామంలో శ్రీమఠం మకాం.
పరమాచార్య స్వామివారు తెల్లవారుఝామున మూడు గంటలకే పూజ మొదలుపెట్టి, తొమ్మిది గంటలకి ముగించి భిక్ష చేశారు. భోజనాలు ముగించమని సేవకులందరినీ ఆదేశించారు. కొద్దిసేపటి తరువాత అక్కడకు ఎనిమిది మైళ్ళ దూరంలో ఉన్న మరొక గ్రామానికి ప్రయాణమయ్యారు.

రోజువారీ కంటే ముందుగానే అసంపూర్ణంగా భోజనం చెయ్యడం వల్ల, అందరూ ఆ గ్రామం చేరుకునేటప్పటికి మంచి ఆకలిమీదున్నారు. కానీ వారు ఏమి చెయ్యగలరు? వారు ఏమి చేసినా పరమాచార్య స్వామివారికి తెలిసిపోతుంది. రాత్రి భిక్ష ఎప్పుడు అన్న విషయం వారికి ఎవరికి తెలియదు.

వారంతా బయట కూర్చుని ఉండాగా, మహాస్వామివారు తమ పెట్టెను తెరిచారు. అందులోనుండి నోరూరించే మైసూర్ పాక్ బయత్కు తీసి, ఒక్కొక్క ముక్కనే వేళ్ళతో నలుపుతూ పొడి చేసి, ఒక పెద్ద గిన్నెలో ఉంచారు. దగ్గరలోనే పండిన మామిడిపళ్లు ఉన్నాయి. కొన్ని పళ్ళను తీసుకుని, తరిగి, వాటినుండి రసం తీసి, గిన్నెలో ఉన్న మైసూర్ పాక్ పొడిపైన వేశారు. అలా స్వయంగా స్వామివారే మైసూర్ పాక్, మామిడి రసం మిశ్రమాన్ని తయారుచేశారు.

ఒకసారి చిటికె వేశారు. ఒక సేవకుడు స్వామివారి వద్దకు వెళ్ళాడు. “ఇప్పుడు ఇది అందరూ తీసుకోండి”. స్వామివారి మాటలు, స్వామివారు తయారుచేసిన పదార్థం రెండూ దేవామృతంలా అనిపించాయి అందరికీ.

స్వామివారికి తమ సేవకులపై అంతటి ప్రేమ, కరుణ.

--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#కంచిపరమాచార్యవైభవం

10/09/2026

జీవిత సత్యం బోధించారు

అది 1966వ సంవత్సరం. ఆ సంవత్సరం జూన్ లో చీఫ్ సెక్రెటరి కే. వీ. అనంతరామన్ గారు నన్ను పిలిచి వెంటనే చిత్తూరు వెళ్లి జిల్లా కలెక్టరు మెజిస్ట్రేటుగా అధికారాలు తీసుకోవాలని ఆదేశించారు. అదే సంవత్సరం స్వామివారు వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో మకాం చేశారు.

మహాస్వామివారు ఒక వేద ఆగమ పండిత సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నారు. వారు అక్కడుండగానే శ్రీ నటరాజ రంగస్థలాన్ని, దాని వెనుక కొండపై ఉన్న రాతి చక్కడాలను కనుగొన్నారు. దేవాలయాల కళలను అధ్యయనం చేస్తున్న విద్యార్థిగా ఇప్పుడు వాటిని పరిశోధించి అవి ఆరవ శతాబ్దానికి చెందినవిగా పల్లవుల కళలకు సంబంధించినదిగా చెప్పడం నా బాధ్యత.

ఆ అధ్యయనం నన్ను మొత్తం దేవాలయాన్ని అధ్యయనం చేయాలనే కోరికను కలిగించింది. నేను మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ నాగిరెడ్డి కలిసి ఒక కాళహస్తి దేవస్థానం తరుపున “శ్రీ కాళహస్తి టెంపుల్” అను పేర ఒక పత్రము ప్రచురించాము. దేవస్థానం వారు నాకు కాంస్య శివపార్వతుల ఆలింగన మూర్తిని బహూకరించారు. అది ఇప్పటికి నా టేబల్ పైన ఉంది. కాని దానికంటే అదృష్టం ఏంటంటే పరమాచార్య స్వామివారు ఇచ్చిన శ్రీముఖం.

ఈ పుస్తకం అచ్చయ్యి రెండు ప్రతులు నా దగ్గర ఉన్నాయి. అప్పుడు నేను కలెక్టర్ల సమావేశం కోసమని గుంటూరుకు వెళ్లాను. జిల్లా కలెక్టరు అధ్యక్షుడిగా జిల్లా అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చెయ్యాలనే విషయం గురించిన సమావేశం అది. వేలత్తూర్ లొ పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్నారని నాకు తెలిసింది. నేను అక్కడకు వెళ్లి స్వామివారికి నమస్కరించాను.

జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి చరణ కమలాలకు అంకితమిచ్చిన “శ్రీ కాళహస్తి టెంపుల్” పుస్తకాన్ని స్వామివారికి సమర్పించాను. 1966లో కాళహస్తిలో స్వామివారు చాతుర్మాస్యంలో ఉండగా పంచముఖ లింగాన్ని కనుగొన్నారు. స్వామివారి ఆదేశం ప్రకారం ఆ స్థలాన్నంతా శుభ్రపరచి జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు.

రుద్రాభిషేకానికి పూర్వాంగంగా చేసే మహాన్యాసంలోని శివుని యొక్క పంచముఖాలను కీర్తించే శ్లోకాన్ని నాకు ఇచ్చారు. “స్ఫటిక వర్ణంలోని సద్యోజాత పడమర ముఖము; అరుణ వర్ణంలోని వామదేవ ఉత్తర ముఖము; ధూమ్ర వర్ణంలోని అఘోర దక్షిణ ముఖము; బంగారు వర్ణంలోని తత్పురుష తూర్పు ముఖము; ఈశాన ఊర్ధ్వ ముఖము; పరమశివుని ఈ ఐదు ముఖములు మీ కోరికలను తిర్చుగాక!”

ఆ పుస్తకంలోని మొదటి పేజిలో ఈ శ్లోకాన్ని అచ్చువేయించాము. అలాగే శ్రీవారు తెలుగులో ఇచ్చిన శ్రీముఖం కూడా. ఆ శ్రీముఖంలో చిత్తూరు జిల్లా కలెక్టరు చేసిన పరిశోధనతో పాటు శ్రీ జ్ఞానప్రసూనాంబికా సామెత శ్రీ కాళహస్తిశ్వర స్వామివారి ఆశిస్సులు కూడా అందించారు.

అదే సమయంలో గ్రీసు దేశపు రాణి ఫ్రెడెరిక మరియు యివరాణి ఇరీన్, ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి గారితో కలిసి పరమాచార్య స్వామివారిని దర్శించుకున్నారు. 1990లో జనతా హయాంలో ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ శ్రీ కృష్ణకాంత్, మహమ్మదీయ నాయకులు జానాబ్ బుల్కారితో కలిసి చాలా సార్లు కంచిలో స్వామివారిని కలిశారు. నేను కూడా స్వామివారిని దర్శించుకొని, కామాక్షి అమ్మవారికి నమస్సులు అర్పించుకునే వాడిని.

నా ఉద్యోగకాలంలో తరచూ మహాస్వామివారిని కంచి దగ్గరలోని వినాయకుని గుడి వద్ద ఒక ఆశ్రమంలో కలుసుకునేవాడిని. ఇది ఒక విశేషమైన దేవాలయం. ఇక్కడి గణపతి సోమస్కందుడిలా, తల్లి తండ్రులతో కలిసి ఉంటాడు. స్వామివారు సాక్షాత్ గణపతి అవతారం. ఇప్పుడు స్వామివారి దర్శనం ఆశ్రమంలోని బావి వద్ద నుండే. నాకు స్వామివారు ఏమీ చెప్పలేదు, ఏ ఉపదేశమూ చెయ్యలేదు అనే అసంతృప్తి ఉండేది.

కాని స్వామి చెప్పకనే నాకు కొన్ని విషయాలు చెప్పారు. గాయత్రిని ఎప్పటికి మరువరాదు/విడువరాదు. రెండవసారి మహాస్వామివారు ఒక పుస్తకం చదువుతుండగా చూశాను; అంటే ప్రతిరోజూ భగవన్నామ జపము, ఈశ్వరార్చన జరపాలి. మూడోసారి స్వామివారు పద్మాసనంలో ధ్యానం చేసుకుంటూ కూర్చుని ఉన్నారు. చేతిలో ఉన్న పూలను తలపై వేసుకున్నారు. అంటే మనమే బ్రహ్మము. అదే సత్యం, దాన్ని తెలుసుకోవాలి.

--- పి. సీతాపతి, రిటైర్డ్ IAS.

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#కంచిపరమాచార్యవైభవం

Address

Bangalore
560062

Website

Alerts

Be the first to know and let us send you an email when Kanchi Paramacharya Dharmika Seva Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kanchi Paramacharya Dharmika Seva Trust:

Shortcuts

Share