25/11/2025
మా స్కూల్ కి ఇవ్వొచ్చుగా
*** ******* ********by Pathan Sanwar
ఉదయం 3.40 కి లేచి,రెడీ అయి,4.30 కి బస్టాండ్ చేరుకున్నా. 4.50 కి బస్ బయలు దేరింది.
బస్ లో కూర్చుని సెల్ తీసి గూగుల్ ఫోటోస్ చూస్తుంటే ఈ ఫోటో కనిపించింది. వెంటనే మా స్కూల్ సమస్యలు గుర్తుకు వచ్చాయి.
ఈ మధ్య కాలంలో ప్రభుత్వ స్కూల్స్ మౌలిక సౌకర్యాల పరంగా చాలా అభివృద్ధి చెందా యి. ప్రభుత్వం స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద హైస్కూల్ కు ఏడాదికి రూ:37,500 కేటాయిస్తుంది. ఈ గ్రాంట్ చాక్ పీసులు,డస్టర్లు,పొరకలు కొనడానికి సరిపోవు.
410 మంది విద్యార్థిని, విద్యార్థులు,20 మంది ఉపాధ్యాయులు,4 వంటవాళ్ళు, 2 స్కావెంజర్ లు ఉన్నారు.
6 టాయిలెట్ లు, 5 యూరినల్స్, 1 బాత్రూమ్ ఉంది.
ఇవి కాక ఆర్.ఓ ప్లాంట్ రూమ్, వంటగది ఉన్నాయి.
4 గదులు ఉండి, 4 నివసించే ఇంటికి...ఎలక్ట్రికల్,ప్లంబింగ్, గౌండ, కార్పెంటర్,శానిటరీ, పెయింటింగ్,రిపేర్లకు ఏడాదికి ఎంత లేదన్న 40 వేలు ఖర్చు వస్తుంది.
ఇన్ని రూమ్ లు,ఇంత మంది విద్యార్థులు ఉన్న బడికి ప్రభుత్వం ఇచ్చే రూ: 37,500 ఏ మూలకు సరిపోవడం లేదు.
రాత్రిపూట ఆకతాయిలు, తాగుబోతులు బడికి సంబంధించిన ఆస్తులకు, పరికరాలకు నష్టం కలిగిస్తారు...ఇది అదనం.
మా బడి లో రకరకాల సమస్యలు ఉన్నాయి.. అవి.....
1.బడి కి వెనక వైపు కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల..పశువులు రాత్రిపూట ప్రవేశించి విశ్రాంతి తీసుకొని పెంట పెంట చేస్తున్నాయి. విద్యార్థులు ఆడుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది.
తాగుబోతులు తాగి సీసాలు పగలగొట్టడం వల్ల.. మైదానం లో ఆడుకొనే విద్యార్థులకు అవి గుచ్చుకొని గాయపడుతున్నారు. ఈ 5 నెలలలో లక్ష రూపాయల నష్టం కలిగించారు. 200 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
2.ఆర్.ఓ ప్లాంట్ రిపేర్ లో ఉంది. మోటార్ వైన్డింగ్, కెపాసి టర్, కండెన్సర్ కాలిపోయాయి. ఫిల్టర్ లు కూడా మార్చవలసి ఉంది.
3.ఇక్కడ పాముల బెడద ఎక్కువ గా ఉంది. నాలుగు రోజులకు ఒక పామైన తరగతి గదులలోకి ప్రవేశిస్తుంది. పది రోజుల కు ఒక పామైన చంపుతాం. కిటికీలకు మెష్ వేయిస్తే...ఈ సమస్యను 90% పరిష్కరించవచ్చు.
4. బడికి నైట్ వాచ్మెన్ పోస్ట్ ఉన్నప్పటికీ.. జీతం నెలకు 6 వేలు కావడం వల్ల ఎవరూ పనిచేయడానికి రావటం లేదు. బడి ఆస్తులకు రక్షణ ఉండాలంటే C.C కెమెరాలు ఏర్పాటు అవసరం.
5. ఇది కొండ ప్రాంతం కాబట్టి గ్రౌండ్ లెవెల్ గా లేకపోవడం వల్ల ఆటలకు అనుకూలంగా లేదు. దీన్ని చదును చేయించవలసిన అవసరం ఉంది. చదును చేయకపోవడం వల్ల విద్యార్థులు ఆడుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.
6. ఇటీవల పడిన భారీ వర్షాలకు కొన్ని గదులు కారుతున్నాయి. విద్యార్థులు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారు. స్లాబ్ కు వాటర్ ప్రూఫింగ్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
7. చాలా ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, చెడి పోయాయి కొత్తవి వేయించవలసి ఉంది. కొన్నిటిని రిపేర చేయించవలసి ఉంది. ఎలక్ట్రికల్ బోర్డులు, వైరింగ్ దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ వస్తుంది.
8. కొన్ని చోట్ల పెయింట్స్ పోయాయి. బొమ్మలు కూడా వేయించవలసి ఉంది. సూక్తులు కూడా రాయించాలి.
9. చాలా చోట్ల గౌండ పనిచేయించవలసి ఉంది. టైల్స్ వర్క్ కూడా ఉంది.
10. అప్పుడప్పుడు వచ్చే నీటి సమస్యను పరిష్కరించడానికి వాటర్ సంపు నిర్మించవలసి ఉంది.
ఈ సమస్యల పరిష్కారానికి ఎనిమిది నుంచి పది లక్షలు ఉంటే సరిపోతుంది.సమాజంలో ఉన్న ధనవంతులు, ప్రజలు సహకరిస్తే సరిపోతుంది.
గుడి కన్నా బడి మిన్న... అంటారు కాని... మన దేశంలో గుడులు, చర్చిలు,మసీదులు కళకళలాడుతున్నాయి. బడులు మాత్రం మౌలిక సౌకర్యాల లేమి తో వెలవెల పోతున్నాయి.
పిల్లలు దేవుడు చల్లనివారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే అని పాటలు పాడుకుంటారు కానీ.. వాస్తవంలో బడిలో ఉన్న పిల్లలు సమస్యలు ఎదుర్కొంటుంటే సమాజంలో ఉన్న ప్రజలు పట్టించుకోరు.
మసీదు, చర్చి,గుడి ని నమ్ముకోవడం ద్వార మరణించిన తర్వాత స్వర్గం వస్తుంది అనేది ఎంత వరకు నిజమో కాని...బడిని, విద్యని నమ్ముకోవడం ద్వార బ్రతికి ఉన్నప్పుడే మన భవిష్యత్తు మారుతుంది అన్నది మాత్రం నిజం.
బడి బాగుంటే .. మీ పిల్లవాడి భవిష్యత్తు బాగుంటుంది.. పిల్లవాడి భవిష్యత్తులోనే తల్లిదండ్రుల భవిష్యత్తు ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రులు బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, దేశ భవిష్యత్తు బాగుంటుంది.
విరాళాలు ఇవ్వాల్సింది ప్రార్థనా స్థలాలకు కాదు..విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలలకు మాత్రమే.
విదేశాల్లో ధనవంతులు తమ సంపదను విద్యాలయాలకు,వైద్యాలయా లకు,గ్రంథాలయాలకు,పరిశోధనలకు,పర్యావరణ మరియు అడవుల అభివృద్ధికి కేటాయిస్తారు. అందుకే ఆ దేశాలు అభివృద్ధి లో దూసుకుపోతున్నాయి.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయాయి.వెనుకబడిన దేశం నుండి 40 సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా మారింది. ఇప్పటికీ... అభివృద్ధి చెందుతూనే ఉంది.మనతో పాటే స్వాతంత్ర్యం పొందిన జపాన్,నార్త్ కొరియా,చైనా,తైవాన్,సింగపూర్ లాంటి దేశాలు అభివృద్ధి లో శరవేగంగా దూసుకుపోతున్నాయి.
మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది..కానీ అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందుబాటులోకి రావటంలేదు.కొద్ది మంది చేతిలోనే దేశ సంపద, వనరులు కేంద్రీకరించబడుతున్నాయి.
ధనవంతులు మరింత ధనవంతులుగాను..పేదవారు మరింత పెదవారుగాను మారుతున్నారు.
75 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత కూడా మెజారిటీ ప్రజలు పేదరికంలోనే ఉన్నారు. నిరక్షరాస్యత,నిరుద్యోగం,ఉపాధి లేమి, మౌలిక సౌకర్యాల లేమి, వైద్య వసతుల లేమి,ఆకలి చావులు, పౌష్టికాహార లోపం, తక్కువ తలసరి ఆదాయం,కుల అసమానతలు,లింగ వివక్ష,లింగ నిష్పత్తి లో అసమానతలు,మహిళల పై అత్యాచారాలు, నేరాల పెరుగుదల,భ్రూణ హత్యలు, మూఢ నమ్మకాలు,నీటి,వాయు, నేల కాలుష్యం, అడవుల విచ్చలవిడి నరికివేత,వాతావరణ మార్పులు, భూమి వేడెక్కడం,,కుండపోత వర్షాలు,ఆకస్మిక వరదలు,సునామీలు,కొండచరియలు విరిగిపడటం...వంటి సమస్యలు పరిష్కారం కాలేదు.
రాజ్యాంగం లో చెప్పబడినట్లు ప్రజలు శాస్త్రీయ దృక్పథాన్ని,హేతువాద దృక్ప దాన్ని అలవర్చుకోవాలి.