17/08/2026
ఈ ఊరి మీదుగా వెళ్తున్న ప్రతిసారి మనసుకు కష్టంగా ఉండేది..
********************
కొంతమందితో పరిచయం లేకపోయినా మాట్లాడాలనిపిస్తుంది...
కొన్ని పనులు సంబంధం
లేకపోయినా
చేయాలనిపిస్తుంది...
వీటికి కారణాలు ఉండవు...
వనిపెంట మీదుగా వారంలో మూడు నాలుగు సార్లు బండిమీద మరియు బస్సులో ప్రయాణం చేస్తుంటాను.
ఊరి చివర ఉన్న ఒక పాడుబడిన ఇంటి బయట ఒక వ్యక్తి మౌనంగా కూర్చొని ఉంటాడు.. పొడవాటి గడ్డం, మెలి తిరిగిన జులపాల జుట్టు , మాసిన బట్టలు.
చూడగానే పిచ్చివాడు అని ఎవ్వరైనా అనుకుంటారు. కానీ, ఎప్పుడూ మౌనంగా తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు.. ఎవరైనా పెడితే తింటాడు..అదికూడా తనకు ఇష్టమైతేనే.
ఇతనిని ఆశ్రమానికి తీసుకెళ్లాలని చాలాసార్లు అనుకున్నా కానీ, కార్యరూపం దాల్చలేదు..
దీనికి ప్రత్యేకమైన కారణం లేదు...
ఈరోజు మధ్యాహ్నం రాజా తో కలిసి ప్రొద్దుటూరు నుంచి బయలుదేరి గంటలో వనిపెంట చేరుకున్నాం... ఒక చోట కూర్చొని ఉన్నాడు మౌనంగా.
కాసేపు మాట్లాడాను,
ఒక తేనీరు తాగించాను,
ప్రేమగా లాలించాను....
నింపాదిగా, స్నానం చేయిస్తా సహకరిస్తావా అన్నాను. అప్పటికే నాకు మచ్చిక అయినందున నవ్వి సరే అన్నాడు.
స్నానం అయిపోయింది... కొన్ని ఏళ్లయింది అనుకుంటా ఆయన స్నానం చేసి. భారం దిగిపోయింది అన్నాడు.
కొత్త బట్టలు, చెప్పులు వేయించి తొందరలోనే వస్తాను ఆశ్రమానికి వెళదాం అన్నాను.. సరే అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ మళ్ళీ తన స్థావరానికి వెళ్ళిపోయాడు.
మాటల్లో పెట్టి తన వివరాలు రాబట్టాను.. తన పేరు నరసింహులు, ఊరు ముద్దిరెడ్డిపల్లె దగ్గర తాండా..
అమ్మా,నాన్న, కుటుంబం లేదు... ఇద్దరు సోదరులు ఉన్నా వారి జీవితం వారిది అన్నట్లు ఎక్కడో ఉన్నారంట. ఇతను చిన్నప్పటినుంచి ఒంటరిగానే ఉంటూ ఉండడం వలన డిప్రెషన్ లో ఉన్నాడని అర్థమైంది.
తొందరలోనే మన సేవాశ్రమానికి తీసుకెళ్లి మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నం చేస్తాను.. సఫలం కాకపోయినా కనీసం మూడు పూటలా ఆహారం అయినా అందిస్తాను.
ఎవరి పయనం ఎందాకో,
ఎవరి పరిచయం ఎన్నాళ్ళో...
మీ.. శ్రేయోభిలాషి
పాపిజెన్ని రామకృష్ణారెడ్డి
వ్యవస్థాపకులు
వివేకానంద ఫౌండేషన్
8897292237